AP 9th Class Social Important Questions Chapter 2 భూమి – ఆవరణములు

These AP 9th Class Social Important Questions 2nd Lesson భూమి – ఆవరణములు will help students prepare well for the exams.

AP Board 9th Class Social 2nd Lesson Important Questions and Answers భూమి – ఆవరణములు

9th Class Social 2nd Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
శాస్త్రజ్ఞులు ప్రస్తావించిన భూమి మీద ఉన్న నాలుగు ఆవరణములు ఏవి?
జవాబు:
భూ శాస్త్రజ్ఞులు భూమి మీద నాలుగు ఆవరణాల గురించి ప్రస్తావిస్తుంటారు. అవి –

  1. శిలావరణం
  2. జలావరణం
  3. వాతావరణం
  4. జీవావరణం

ప్రశ్న 2.
జలావరణం అంటే ఏమిటి?
జవాబు:
నీరు ఉండే మండలాన్ని జలావరణం అంటారు. ఇంగ్లీషులో దీనిని ‘హైడ్రోస్ఫియర్’ అంటారు. ఇది నీరు అనే అర్థం ఉన్న ‘హ్యడర్’ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది.

ప్రశ్న 3.
వాతావరణం అంటే ఏమిటి?
జవాబు:
భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను వాతావరణం అంటారు. ఇంగ్లీషులో దీనిని ‘అట్మాస్ఫియర్’ అంటారు. ‘అట్మాస్’ అన్న గ్రీకు పదానికి ‘ఆవిరి’ అని అర్థం.

AP 9th Class Social Important Questions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 4.
జీవావరణం అని దేనినంటారు?
జవాబు:
గాలిలో ఎంతో ఎత్తున, సముద్రాలలో ఎంతో లోతున ప్రాణులు, బాక్టీరియాతో సహా ఉండే ఆవరణాన్ని ‘జీవావరణం’ అంటారు. ఇంగ్లీషులో దీనిని ‘బయోస్ఫియర్’ అంటారు. జీవం అన్న అర్థం ఉన్న ‘బయోస్’ అనే గ్రీకు పదం నుంచి ఇది వచ్చింది.

ప్రశ్న 5.
అగ్నిపర్వతం అంటే ఏమిటి?
జవాబు:
భూగర్భం నుండి బయటికి ప్రవహించిన శిలాద్రవం ముఖ ద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణం ఏర్పడుతుంది, దీనినే అగ్నిపర్వతం (Volcano) అంటారు.

ప్రశ్న 6.
అగ్నిశిలలు అనగానేమి?
జవాబు:
కరిగిన శిలాద్రవం చల్లబడి కఠిన శిలలుగా ఏర్పడుతుంది, వీటిని అగ్ని శిలలు అంటారు.

ప్రశ్న 7.
మూడవ శ్రేణి భూస్వరూపాలు ఏవి?
జవాబు:
నీరు, గాలి వల్ల రూపొందే భూస్వరూపాలను భూ శాస్త్రవేత్తలు “మూడవ శ్రేణి భూస్వరూపాలు” అంటారు.
ఉదా : చెక్కబడిన కొండలు, లోయలు, డెల్టా, ఇసుక పర్వతాలు మొదలైనవి.

ప్రశ్న 8.
శిలాశైథిల్యం అనగానేమి?
జవాబు:
వాతావరణ శక్తుల వల్ల రాళ్ళు ఛిద్రమయ్యే ప్రక్రియను శిలాశైథిల్యం అంటారు.

ప్రశ్న 9.
క్రమక్షయం అంటే ఏమిటి?
జవాబు:
గాలి, నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలం పై పొరలు కొట్టుకుపోవటాన్ని క్రమక్షయం అని అంటారు.

ప్రశ్న 10.
గార్జెస్ అంటే ఏమిటి?
జవాబు:
రాళ్ళు (శిలలు) చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నదీ ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి, వీటిని ‘గార్జెస్’ అంటారు. గోదావరి నది మీద పాపి కొండల వద్ద బైసన్ గార్జ్, కాశ్మీరులోని ఇండగార్జ్ లు ‘గార్జెస్’కు ఉదాహరణలు.

ప్రశ్న 11.
అగాధదరులు ఎలా ఏర్పడతాయి?
జవాబు:
నది అంచులు తీవ్రవాలుతో చాలా లోతుకు కోతకు గురైనప్పుడు అగాధదరులు ఏర్పడతాయి.

ప్రశ్న 12.
ఒండ్రు అంటే ఏమిటి?
జవాబు:
నదికి వరదలు వచ్చినపుడు అది నేలను కోతకు గురి చేస్తుంది, వరద తగ్గు ముఖం పట్టినపుడు కోసిన మట్టిని వేరే చోట మేట వేస్తుంది. దీనిని ఒండ్రు అంటారు.

ప్రశ్న 13.
ఆక్స్-బౌ సరస్సు అని దేనిని అంటారు?
జవాబు:
వరద మైదానంలో నది పాము మాదిరి మెల్లగా వంపు తిరిగి ఉంటుంది, ఈ మెలికలలో పక్కలకు మేట వేస్తుండటంతో అవి చేరువ అవుతూ కాలక్రమంలో మెలిక తిరిగిన భాగం నది నుంచి తెగిపోయి ఒక సరస్సులాగా ఏర్పడుతుంది, దీనినే ‘ఆక్స్-బౌ సరస్సు అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 2 భూమి – ఆవరణములు

ప్రశ్న 14.
మెరైన్లు అనగానేమి?
జవాబు:
హిమానీనదం మోసుకుపోలేని పదార్థాలను వివిధ ప్రాంతాలలో మేటవేస్తుంది, ఇలా మేటవేసిన వాటిని ‘మోరైన్లు’ అంటారు.

ప్రశ్న 15.
మేటవేయటం కారణంగా ఏర్పడేవి ఏవి?
జవాబు:
‘సముద్రపు తోరణాలు’, ‘పేర్పుడు స్తంభాలు’, సముద్ర బృగువు (శిఖరం), అగ్రం మొదలైన సముద్ర తీర భూ స్వరూపాలు, సముద్రపు అలల కారణంగా తీర ప్రాంతాలు కోతకు గురికావటం, మేటవేయటం కారణంగా ఏర్పడతాయి.

ప్రశ్న 16.
లోయస్ మైదానాలు అంటే ఏవి?
జవాబు:
మెత్తగా ఉండే దుమ్ము ఎడారులను దాటి కొట్టుకెళ్లి పక్క భూముల మీద పడుతుంది, ఇటువంటి నేలను ‘లోయిస్’ మైదానాలంటారు.

ప్రశ్న 17.
నీటి ప్రభావంచే ఏర్పడే ఏవేని రెండు భూస్వరూపాలను రాయండి.
జవాబు:
నీటి ప్రభావంచే ఏర్పడే రెండు భూస్వరూపాలు :

  1. లోయలు
  2. డెల్టాలు మొ||వి.

9th Class Social 2nd Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“మానవ కార్యకలాపాలైన గనుల తవ్వకం, ఇటుకలు, సిమెంటుతో నగరాల నిర్మాణం, వ్యవసాయం, ఆనకట్టలు నిర్మించడం వంటివి శిలావరణాన్ని ప్రభావితం చేస్తాయి” ~ వ్యాఖ్యానించండి.
జవాబు:
గనుల తవ్వకం :
గనుల తవ్వకం వలన భూమి పొరలలో లోపలికి తవ్వడం వలన భూమిలోపలి భాగం బాగా దెబ్బతిని భూకంపాలు అవీ సంభవిస్తాయి.

ఇటుకలు – సిమెంటులతో నగరాల నిర్మాణం :
ఇటుకల తయారీలో పంట పండే భూములలోని మట్టి వాడటం వలన భూసారం దెబ్బతింటుంది. అలాగే సిమెంటులోని దుమ్ము, ధూళి వలన వాతావరణం కాలుష్యానికి గురి అవుతుంది.

వ్యవసాయం :
వ్యవసాయంలో వాడే రసాయనిక ఎరువులు, క్రిమి సంహారకాల వలన వాతావరణం కాలుష్యానికి గురి అవుతుంది.

డ్యామ్ నిర్మాణం :
డ్యామ్ ల నిర్మాణం వలన అక్కడ ఉన్న సహజ వృక్ష సంపద దెబ్బ తింటుంది. మరియు ఎక్కువ భాగం ఆయకట్టు ప్రాంతంగా మారి ఎక్కువ మంది నీటి కొరత సమస్యతో బాధపడతారు.

ప్రశ్న 2.
ఈ క్రింద ఇచ్చిన వాటిని పట్టికలో తగిన విధంగా అమర్చండి.
పుట్టగొడుగురాయి, సముద్రతోరణాలు, దుముకు మడుగు, ‘U’ ఆకారపులోయ.

కారణం ఏర్పడే భూస్వరూపం
1. నీటి ప్రభావం
2. హిమానీనదాల ప్రభావం
3. గాలి ప్రభావం
4. అలల ప్రభావం

జవాబు:

కారణం ఏర్పడే భూస్వరూపం
1. నీటి ప్రభావం దుముకు మడుగు
2. హిమానీనదాల ప్రభావం ‘U’ ఆకారపు లోయ
3. గాలి ప్రభావం పుట్టగొడుగురాయి
4. అలల ప్రభావం సముద్రతోరణాలు

9th Class Social 2nd Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
నీరు మరియు గాలి భూమి ఉపరితలాన్ని ఎలా మార్చివేస్తున్నాయో వివరించండి.
జవాబు:
నీరు, గాలి భూమి ఉపరితలాన్ని ఈ క్రింద చూపినట్లు నాలుగు ప్రక్రియల ద్వారా మార్చివేస్తాయి.

శిలాశైథిల్యం :
నీళ్ళు, గాలిలోని తేమ కూడా ఈ ప్రక్రియకు దోహదం చేస్తాయి. రాళ్ళలోని రసాయనాలతో నీళ్ళు ప్రతిచర్య చెంది వాటిని మరింత బలహీనపరుస్తాయి. రాళ్ళు బలహీనమై, పగిలిపోయే ఈ ప్రక్రియను శిలాశైథిల్యం అంటారు.

క్రమక్షయం :
ప్రవహిస్తున్న నీటికి, గాలికి ఎంతో శక్తి ఉంటుంది. అది రాళ్ళను నిదానంగా కరిగించి వేస్తుంది. మట్టి పై పొరలను తొలగించి వేస్తుంది. వాన, నది, భూగర్భజలం, సముద్ర అలలు వంటి రూపాలలో నీళ్ళు, ఈదురుగాలులు, తుఫాను గాలులు వంటి అనేక రూపాలలో గాలి భూమి యొక్క పై పొర కొట్టుకుపోవడానికి దోహదం చేస్తాయి. దీన్ని క్రమక్షయం అంటారు.

రవాణా :
కోతకు గురైన రాళ్ళు, కంకర, మట్టి, ఒండ్రు వంటి వాటిని గాలి, నీళ్ళు మోసుకుపోవడాన్ని రవాణా అంటారు.

నిక్షేపణ :
రాళ్ళ నుంచి పై పొరల నుంచి విడిపోయిన రేణువులు గాలి, నీటితో పాటు కొట్టుకుపోతుంటాయి. అయితే వీటి వేగం తగ్గినప్పుడు ఇక రేణువులను మోసుకు వెళ్ళలేక వాటిని మేటవేస్తాయి. ఇలా మేట వేసిన మట్టివల్ల మైదానాలు, నదీ ప్రాంతాలు ఏర్పడతాయి. ఈ మేటలు సముద్రపు నేలలో పొరలు పొరలుగా నిక్షిప్తమై కాలక్రమంలో అవక్షేప శిలలుగా మారతాయి.

Leave a Comment