Access to the AP 8th Class Telugu Guide 9th Lesson చిరుమాలిన్యం Questions and Answers are aligned with the curriculum standards.
చిరుమాలిన్యం AP 8th Class Telugu 9th Lesson Questions and Answers
చదవండి – ఆలోచించి చెప్పండి :
సమ సమాజ మంట సాధింతురట మీరు
ఒకరి బాగునొక్కరోర్వలేరు
సమత సాధ్యమగునె మమత పెరగకున్న
సయ్యదయ్య మాట సత్యమయ్య
– సయ్యద్ మహమ్మద్ ఆజమ్ (సూక్తి శతకం)
ప్రశ్నలు జవాబులు :
ప్రశ్న 1.
పై పద్యంలో దేని గురించి ప్రస్తావన ఉంది ?
జవాబు:
పై పద్యంలో సమతా భావన గురించి చెప్పారు.
ప్రశ్న 2.
సమత సాధ్యం కావాలంటే ఏమి పెరగాలి ?
జవాబు:
సమత సాధ్యం కావాలంటే ఒకరిపై ఒకరికి మమత పెరగాలి.
ప్రశ్న 3.
ఒకరి బాగును మరొకరు ఎందుకు ఓర్చుకోలేరు ?
జవాబు:
ఈర్ష్య, అసూయ, ద్వేష భావనల వలన ఒకరి బాగును మరొకరు ఓర్చుకోలేరు.
ఇవి చేయండి :
అవగాహన – ప్రతిస్పందన :
అ) క్రింది ప్రశ్నలకు అడిగిన విధంగా సమాధానాలు ఇవ్వండి.
ప్రశ్న 1.
వచన కవితను లయాత్మకంగా చదవండి.
జవాబు:
మీ ఉపాధ్యాయులను అనుకరిస్తూ చదవండి.
ప్రశ్న 2.
ఈ కవితలో ఏయే అంశాలను కవి వర్ణించాడో చెప్పండి.
జవాబు:
మానవుని పుట్టుక అతని ఆటవిక జీవితం గురించి వర్ణించారు. ఆకాశంలో, అడవిలో, కొండలలో, సెలయేళ్ల ధ్వనులను, ఆయుధాల తయారీ, వేట గురించి వర్ణించారు. మాటలు, వ్రాత నేర్చుకోవడం, దేవతలను సృష్టించడం, నక్షత్రాలకు పేరు పెట్టడం మొదలైనవి వర్ణించారు. చక్రం, నిప్పు కనిపెట్టడం వర్ణించారు. రాజ్యాల విస్తరణ, ఆక్రమణ, నిర్మాణాలు చెప్పారు. నదుల మళ్లింపు, సముద్రాల అన్వేషణ, గ్రహాలపైకి ప్రయాణాలు వర్ణించారు. నియంతలు, నిరంకుశుల నాశనాలు వర్ణించారు. దేవతలకు చేసే అభిషేకాలు వర్ణించారు. ఇంత అభివృద్ధిని సాధించినా మానవుని మనసులోని కల్మషాన్ని కన్నీటితో కడగలేకపోయామని కవిగారు బాధపడ్డారు.
ప్రశ్న 3.
పాఠాన్ని చదవండి. కింది వాటి గురించి రెండు వాక్యాలను రాయండి.
జవాబు:
అ) రాగాలు – గానాలు : అడవిని ఊయలలూగించేవి వాయురాగాలు, హోరు జలపాతాలవి బృందగానాలు.
ఆ) భాష – లిపి : మాటలు మాట్లాడడానికి అంటే భాషించడానికి ఉపయోగపడేది భాష. ఆ భాషను వ్రాయడానికి
అనుకూలంగా కూర్చుకొన్నది లిపి.
ఇ) చక్రము – ప్రయాణం : మానవుడు వస్తువులను సులువుగా కదిలించడానికి సాధనంగా చక్రం కనుగొన్నాడు.
చక్రంతో బండ్లు, రైళ్లు, ఓడలు, విమానాలు తయారు చేసుకొని ఖండాంతరాలకు, ఇతర గ్రహాలకు ప్రయాణించాడు.
ఈ) సంపద – సముద్రం : వస్తు వినిమయం నుండి అభివృద్ధి చెంది డబ్బును తయారు చేసుకొన్నాడు. అది బంగారం, క్రూడాయిల్, చేపలు మొదలగు రూపాలలో సంపదగా మారింది. ఆ సంపదను సేకరించడానికి పెంచుకోవడానికి సముద్రాలను అన్వేషించి వెలికి తీశాడు. సముద్రాలపై వ్యాపార ప్రయాణాలు చేసి సంపదను ఇంకా పెంచుకొన్నాడు.
ఆ) కింది పేరా చదివి జతపరచండి.
రచయితలు, కవులు తమ రచనలను ప్రచురించే సమయంలో సొంత పేరు మార్చుకుని నచ్చిన ఇతర పేరుతో రచనలు చేస్తారు. వాటినే ‘కలం పేరు’ అంటారు. రచనలలో వారి అసలు పేరు బదులు వేరే పేర్లు వాడతారు.
ఉదాహరణకు కిళాంబి వెంకట నరసింహాచార్యులుగారు ‘ఆత్రేయ’ అనే కలం పేరుతో రచనలు చేశారు. జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు ‘కరుణశ్రీ’ అనే కలం పేరుతో రచనలు చేశారు. ‘బీనాదేవి’ కలం పేరుతో బి. నరసింగరావు, బాలా త్రిపుర సుందరమ్మ కవిత్వం రాశారు. ‘జాస్మిన్’ పేరుతో రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథలు రాసేవారు. ఇలా ఎంతోమంది కవులు కలం పేరుతో రచనలు చేశారు.
1. కిళాంబి వెంకట నరసింహాచార్యులు (ఇ) అ) కరుణశ్రీ
2. జంధ్యాల పాపయ్య శాస్త్రి (అ) ఆ) జాస్మిన్
3. బాలా త్రిపుర సుందరమ్మ (ఈ) ఇ) ఆత్రేయ
4. రాచకొండ విశ్వనాథ శాస్త్రి (ఆ) ఈ) బీనాదేవి
ఇ) ఈ గేయం చదవండి. భావం రాయండి.
దివిలో ఊగే విహంగాన్ని
భువిలో పాకే పురుగు బంధిస్తుంది
గడియేని ఆగని సూర్యుణ్ణి
గడియారపు బాహువులు బంధిస్తాయి
పీతడెక్కల చంద్రుణ్ణి
చేతులెత్తే సముద్రం బంధిస్తుంది
గలగలలాడే తరంగాల్ని
జలకాలాడే అంగాలు బంధిస్తాయి
తనచుట్టూ తను తిరిగే చక్రాన్ని
మలుపులు తిరిగే రోడ్డు బంధిస్తుంది
పై కవితకు భావం రాయండి.
భావం : ఆకాశంలో తిరిగే పక్షికి ఆహారం కనుక నేలపై పాకే పురుగు ఆకర్షిస్తుంది.
ఒక్క గడియ కూడా ఆగని సూర్యుడి వేగాన్ని గడియారం ముల్లులనే చేతులు కొలిచి సమయాన్ని తెలుపుతాయి.
(గడియ = 24 నిముషాలు)
తెలుపు (గోధుమ) రంగులో పీతడెక్కల వంటి రంగులో ఉండే చంద్రుని గమనాన్ని బట్టి సముద్రం పొంగుతూ అమావాస్య, పౌర్ణములను తన కెరటాల పొంగుల ద్వారా తెలియజేస్తుంది. సముద్రంలో స్నానం చేస్తుంటే అలల వేగాన్ని మన శరీర అవయవాలు (కాళ్లు, చేతులతో) స్వల్పంగా ఆపవచ్చు.
తన చుట్టూ తాను తిరుగుతూ ముందుకు వెళ్లే వాహనాల చక్రాల వేగాన్ని రోడ్డు మీద ఉండే మలుపులు తగ్గిస్తాయి, అంటే మలుపులలో వాహనాల వేగం తగ్గుతుంది.
ఈ) కింది పేరాను చదవండి. నాలుగు ప్రశ్నలు తయారు చేయండి.
వంగపండు ప్రసాదరావు జానపద వాగ్గేయకారుడు. హేతువాది, ‘ఉత్తరాంధ్ర గద్దర్ ‘గా పేరు తెచ్చుకున్నాడు. మూడు దశాబ్దాల పాటు 300కు పైగా జానపదపాటలు రచించాడు. వీరు పేదప్రజలను, గిరిజనులను ఎంతో చైతన్య పరిచారు. విప్లవ కవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందారు. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ’ పాటతో ప్రజలను ఉర్రూతలూగించాడు. వీరి పాటలు అన్ని గిరిజన మాండలికాలతో పాటు తమిళం, బెంగాళీ, కన్నడ, హిందీ వంటి పది భారతీయ భాషలలోకి అనువదించబడ్డాయి. వంగపండు ‘యంత్రమెట్టా నడుస్తు ఉందంటే…’ అనే పాట ఆంగ్లంలోకి అనువదించబడింది. ఇది అమెరికా, ఇంగ్లాండులలో కూడా అభిమానం చూరగొన్నది. ఇలా ఎన్నో పాటలతో ప్రజలను సామాజిక చైతన్యం వైపు నడిపించారు. వీరు 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ‘కళారత్న’ పురస్కారం అందుకున్నారు.
ప్రశ్నలు :
ఉదా : వంగపండు ప్రసాదరావు ఎవరు ?
1. ‘ఉత్తరాంధ్ర గద్దర్’ అని ఎవరినంటారు ?
2. ఆయన ఎన్నాళ్లు జానపద పాటలు రచించారు ?
3. పది భారతీయ భాషలలోకి అనువదించబడిన, పాట ఏది ?
4. కళారత్న బిరుదు ఎవరిచ్చారు ?
ఉ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘వచన కవిత’ ప్రక్రియ లక్షణాలను గూర్చి తెలపండి.
జవాబు:
ఎటువంటి ఛందో నియమాలు లేని కవితను వచన కవిత అంటారు. సాధారణంగా సామాజికాంశాలు వచన కవితా వస్తువుగా స్వీకరిస్తారు. వచన కవితకు శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అందాన్నిస్తాయి. అల్పాక్షరాలతో అనల్పార్థాన్ని వచన కవితలో సాధించవచ్చు.
ప్రశ్న 2.
మానవుడు నదులను మళ్ళించి ఏం చేశాడు ?
జవాబు:
మానవుడు నదులను మళ్లించి, కాలువల ద్వారా ఆ నీటిని వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నాడు. విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మించి జలవిద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. పరిశ్రమలకు కూడా ఆ నీటిని వినియోగిస్తున్నారు.
ప్రశ్న 3.
సామ్రాజ్యకాంక్ష వల్ల ఏమి జరుగుతుంది ?
జవాబు:
సామ్రాజ్యకాంక్ష వల్ల యుద్ధకాంక్ష, నిరంకుశత్వం పెరుగుతుంది. అనవసరంగా ప్రక్క రాజ్యాలతో గొడవలు పెరుగుతాయి. ప్రాణనష్టం, ఆస్తినష్టం కలుగుతుంది. భద్రత లోపిస్తుంది. అభివృద్ధి జరగదు, సామ్రాజ్య కాంక్ష వలన అన్నీ అనర్థాలే తప్ప ఏ ప్రయోజనం ఉండదు.
ప్రశ్న 4.
గ్రహాల పైకి వెళ్ళడంలో మానవునికి గల ఆలోచనలేవి ?
జవాబు:
గ్రహాలపైకి వెళ్ళడానికి మానవుడు గ్రహాలపై పరిస్థితులను అన్వేషిస్తున్నారు. గ్రహాలపై నీటిజాడల గురించి అన్వేషిస్తున్నారు. అక్కడ జీవులు ఉండడానికి అవకాశాలు పరిశీలిస్తున్నారు. అక్కడి ఖనిజాలు, వాతావరణం అనుకూలత, జీవులను గూర్చి విశేషంగా పరిశోధనలు చేస్తున్నారు.
వ్యక్తీకరణ – సృజనాత్మకత :
అ) క్రింది ప్రశ్నలకు నాలుగు వాక్యాల్లో సమాధానం రాయండి.
ప్రశ్న 1.
కవి దేవిప్రియను గురించి రాయండి.
జవాబు:
దేవిప్రియగా పేరొందిన షేక్ ఖాజా హుస్సేన్ గుంటూరు జిల్లాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహేబ్, షేక్ ఇమాంబీ. కవి, రచయిత, పాత్రికేయులుగా ప్రసిద్ధులు. వీరి రచనల్లో అమ్మచెట్టు, సమాజానందస్వామి, గరీబ్ గీతాలు, నీటిపుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్యపురాణం ముఖ్యమైనవి. వీరు 2017లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం పొందారు.
ప్రశ్న 2.
గేయంలో కవి వేటిని నాగరికతగా పేర్కొన్నాడు?
జవాబు:
కవి తన కవితలో మానవుని అభివృద్ధికి కారణమైన పరిణామక్రమాన్ని వర్ణించారు. ఆదిమానవుని నుండి అభివృద్ధి చెందిన ఆధునిక మానవుని వరకు కళ్లకు కట్టినట్లు వర్ణించారు. కాని అతని మనసులోని మాలిన్యం పోలేదని చింతించారు. ఆ మాలిన్యాన్ని కన్నీళ్లతో కడగలేకపోయామని బాధ పడ్డారు. మనసులోని మాలిన్యాన్ని కడిగి దయార్ధ హృదయాన్ని నిర్మించే కన్నీటినే కవిగారు నాగరికతగా పేర్కొన్నారు.
ఆ) క్రింది ప్రశ్నలకు ఎనిమిది వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు:
ఆకాశానికీ, భూమికీ మధ్య (భూమిపై) జన్మించాం. ఆకాశం అనే డమరుకం యొక్క ధ్వనులను (ఉరుములు మొదలైనవి) విన్నాం. అడవులను ఊయలలూగించే గాలిపాటలను (చెట్ల సందులలోంచి గాలి వీచేటపుడు వచ్చే ధ్వనులను) విన్నాం. జలపాతాల సమూహపు పాటలను (సెలయేళ్ల చప్పుళ్లు) విన్నాం. ఆదిమానవునిగా ఉన్నపుడు సిగ్గు తెలిసి ఆకులను బట్టలుగా కట్టుకొన్నాం. రాళ్లను ఆయుధాలుగా తయారు చేసుకొన్నాం. మనతో కలిసి తిరిగే సాటి జీవులైన జంతువులను చంపి ఆ మాంసం తిని ఆకలి తీర్చుకొన్నాం. (ఇది ఆదిమానవుడిగా మన మొదటి దశ) (ఆదిమానవ దశలో కొంత అభివృద్ధి చెందాక మాట్లాడడం నేర్చుకొన్నాం, అక్షరాలు, పదాలు వ్రాయడం నేర్చుకొన్నాం, దేవుళ్లని కల్పించుకొన్నాం. నక్షత్రాలకి పేరు పెట్టాం. గ్రహాల శిల్పాలు తయారు చేసుకొన్నాం. నిప్పును తయారు చేయడం . నేర్చుకొన్నాం.
చక్రాన్ని కనుగొని గిరగిరా త్రిప్పాము, దొర్లించాం. 7 ఖండాలలో ఒకదాని నుండి మరొకదానిలోకి (సముద్రమార్గం ద్వారా) ప్రయాణించాం. ఒక రాజ్యం నుండి మరో రాజ్యంలోకి ప్రవేశించాం. కొత్త రాజ్యాలు నిర్మించుకొన్నాం. శత్రు సామ్రాజ్యాలు (యుద్ధాలు చేసి) ఆక్రమించాం. నదులను (వ్యవసాయం కోసం) దారి మళ్లించాం. సముద్రాలు (పెట్రోలు, డీజిలు, మొ||వాటి కోసం) చిలికాం. ఇతర గ్రహాల మీదకు ప్రవేశించాం. నియంతలుగా మారాం. ఎవరి మాటా వినని నిరంకుశుల్ని నశింపచేశాం. వారు దోచుకొని దాచుకున్న సంపదను తిరిగి దోచుకొన్నాం. దేవతలకు బంగారు చెంబులలో నింపిన పంచామృతాలతో అభిషేకాలు చేశాం.
కానీ ! సోదరా ! మనిషి మనసులో ఉండే మాలిన్యాన్ని కొద్దిగా వెచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేకపోయాం.
ప్రశ్న 2.
ఈ పాఠానికి ‘చిరమాలిన్యం’ శీర్షిక సరైనదేనా ? ఎందుకు ? రాయండి.
జవాబు:
ఈ పాఠానికి ‘చిరమాలిన్యం’ అనే పేరు తగినది, సమర్థింపతగినది, ఎందుకంటే ‘చిరుమాలిన్యం’ అంటే ‘చాలాకాలం నుండి ఉన్న మలినత్వము’ అని అర్థం.
ఆ ‘మలినత్వం’ మానవునిలో కొన్ని వేల సంవత్సరాల నుండి ఉంది. ఈ కవితలో మానవుని అభివృద్ధితో బాటు అతని మనసులోని మలినత్వం కూడా పెరిగిపోయింది. దానిని కవిగారు అన్యాపదేశంగా చెప్పారు.
ఆదిమానవునిగా ఉన్న సమయంలో తన ఆహారం కోసం సాటి జంతువులను ఆయుధాలతో వేటాడి చంపాడు. తన కడుపు నింపుకోవడానికి సాటి జీవులను చంపేసే మలిన స్వభావం ఆనాడే మానవునిలో ఉంది.
కొంత అభివృద్ధిని సాధించాక, బలుల పేరుతో జంతువులను వధించాడు. చేతబడులు, భూతప్రేతాదుల పేరుతో సాటి మానవులను భయపెట్టే స్థితికి తన మాలిన్యం పెరిగింది.
చక్రం కనిపెట్టి, నిప్పును తయారు చేశాడు. బాగా అభివృద్ధి చెందాడు. తన ఆధిపత్యాన్ని, అధికారాన్ని పెంచుకొందుకు రాజ్యాలు నిర్మించి, ఇతర రాజ్యాలు ఆక్రమించాడు. మానవుని మనసులోని మాలిన్యం స్వార్థం, అహంకారం గర్వంగా మారి అధికార రూపంలో పెరిగిపోయింది. ప్రకృతి సిద్ధంగా ప్రవహించే నదులను దారి మళ్లించాడు. సముద్రాన్ని అల్లకల్లోలం చేశాడు. తన సంపద పెంచుకోవడానికి ఇతర గ్రహాలను కూడా తన అధీనంలోకి తెచ్చేసుకోవాలనే మాలిన్యం మనసులో బాగా పెరిగిపోయింది.
జాలి, దయ, మమకారం ఇలాంటివన్నీ విడిచిపెట్టేశాడు. ఈ స్థితిలో మానవుని మనసును ప్రక్షాళన చేయాలని కవిగారి ఉద్దేశం కనుక, అన్ని అనర్థాలకు మూలం మానవుని మనసులోని ‘స్వార్థం’ అనే మాలిన్యం కనుక, దీనికి చిరమాలిన్యం అనే పేరు సరిగ్గా సరిపోయింది.
ప్రశ్న 3.
సాటి మనుషులకు సహాయం చేయడం మన బాధ్యత అని తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
గుంటూరు,
X X X X X.
ప్రియమైన రవికి,
నీ మిత్రుడు మాధుర్ వ్రాయు లేఖ,
ఏం చేస్తున్నావ్ ? ఎలా చదువుతున్నావు ? మొన్న ఒకరోజు గాలి వాన వచ్చి మా వీధిలో ఒకరీ పెంకుటిల్లు కూలిపోయింది. గబగబా వారిని బైటకు తీసుకువచ్చాం. మా ఇంట్లో ఆశ్రయం కల్పించాం. డబ్బు, బట్టలు ఇచ్చాం, మా నాన్నగారు ఎమ్.ఎల్.ఎ. గారితో మాట్లాడి కొత్త ఇల్లు నిర్మాణానికి కొంత డబ్బు శాంక్షన్ చేయిస్తానన్నారు.
ఇలా ఇతరులకు సహాయం చేయడం మన బాధ్యత. ఇరుగు పొరుగు వారికి ఎవరికి కష్టం కలిగినా మనం సహాయపడాలి. వారిని ఆ ఆపద నుండి గట్టెక్కించాలి అని మా మాష్టారు కూడా చెప్పారు.
నువ్వు కూడా మీ మిత్రులతో కలిసి ఇతరులకు సహాయం చేయి. ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అని చెప్పిన మదర్ థెరిసా మాటలను ఆదర్శంగా తీసుకొందాం. ఆపదలో ఉన్నవారిని ఆదుకొందాం.
ఉంటాను మరి. జవాబు వ్రాయి.
చిరునామా :
డి. రవి, నెం. 18, 8వ తరగతి,
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, ఇంద్రపాలెం,
ఇట్లు,
నీ స్నేహితుడు,
కె. మాధుర్ వ్రాలు.
కాకినాడ జిల్లా.
భాషాంశాలు – పదజాలం :
అ) కింది వాక్యాలలో గీత గీసిన పదానికి అర్థం రాసి, వాటితో సొంత వాక్యాలు రాయండి.
1. విశ్వంలోని గ్రహాలను కనిపెట్టి వాటికి నామకరణం చేశారు.
జవాబు:
నామకరణం = పేరుపెట్టడం
సొంతవాక్యం : నాకు పేరుపెట్టడం గురించి మా అమ్మగారు చాలా పేర్లు వెతికారుట.
2. మనిషిలోని మాలివ్యాన్ని శుభ్రం చేయాలి.
జవాబు:
శుభ్రం = నిర్మలం
సొంతవాక్యం : పిల్లల మనసు కల్మషం లేకుండా నిర్మలంగా ఉంటుంది..
3. కార్మికులు నిరంతరం శ్రమించి సంపదలు సృష్టిస్తారు.
జవాబు:
నిరంతరం = ఎల్లప్పుడూ
సొంతవాక్యం : ఎల్లప్పుడూ మంచి పుస్తకాలు చదవాలి.
4. ఆదిమానవుడు కానలలో జీవించాడు.
జవాబు:
కానలు = అడవులు
సొంతవాక్యం : అడవులు ఎక్కువగా ఉంటే వర్షాలు బాగా వస్తాయి.
ఆ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి.
1. రాత్రి వేళ నింగిలో నక్షత్రాలు కనిపిస్తాయి.
జవాబు:
నింగి = గగనం, ఆకాశం, మిన్ను
2. సకల జీవులకు ధరణి పుట్టినిల్లు.
జవాబు:
ధరణి = భూమి, పుడమి, అవని
3. ఆదిమానవుడు ఆకులను వస్త్రాలుగా ధరించాడు.
జవాబు:
ఆకులు = పత్రాలు, దళములు
4. శాస్త్ర సాంకేతికతతో సాగరాలను శోధించాడు.
జవాబు:
సాగరం = సముద్రం, కడలి, పయోధి
ఇ) కింది ప్రకృతి, వికృతులను జతచేసి రాయండి.
జవాబు:
అ) గృహము (2) – 1) రేడు
ఆ) సముద్రము (3) – 2) గేము
ఇ) రాజు (1) – 3) సంద్రం
భాషా క్రీడ :
అ) కింది పదాలకు అర్థాలు పెట్టెలో ఉన్నాయి. వాటిని అకారాది క్రమం ఆధారంగా గుర్తించి రాయండి.
అ) మాలిన్యం = మలినం
ఇ) నిర్మించడం = కట్టడం
ఉ) నిరంకుశులు = కనికరం లేనివారు
ఋ) నామకరణం = పేరుపెట్టుట
ఎ) విగ్రహం, = బొమ్మ
ఒ) అవతరించుట = పుట్టుట
అం) చృందగానం = కలిసి పాడడం
వ్యాకరణాంశాలు :
అ) కింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి.
జవాబు:
1. పంచామృతం – పంచ + అమృతం – సవర్ణదీర్ఘసంధి
2. రాజ్యమేర్పాటు – రాజ్యము + ఏర్పాటు – ఉత్వసంధి
3. ఉత్తరాంధ్ర – ఉత్తర + ఆంధ్ర – సవర్ణదీర్ఘసంధి
4. ఉర్రూతలూగించు – ఉర్రూతలు + ఊగించు – ఉత్వసంధి
ఆ) కింది పదాలకు విగ్రహ వాక్యం రాసి సమాసాన్ని తెలపండి.
1. ఏడు రాజ్యాలు – ఏడైన రాజ్యాలు – ద్విగు సమాసం
2. ఆయుధ శక్తి – ఆయుధమనెడి శక్తి – రూపక సమాసం
3. దేశభక్తి – దేశము నందు భక్తి – సప్తమీ తత్పురుష సమాసం
4. అక్షర రూపం – అక్షరమను పేరుగల రూపం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
ద్విరుక్తటకారదేశ సంధి :
ఇ) కింది పదాలను విడదీసిన విధానాన్ని పరిశీలించండి.
పై ఉదాహరణలలో పూర్వపదాలుగా కుఱు, చిఱు, కడు, నడు, నిడు అను పదాలు ఉన్నాయి. పరపదాల మొదట అచ్చులు పరమయ్యాయి.
పై సూత్రం వల్ల పూర్వపదాల చివరి హల్లులైన ఱ, డ ల స్థానంలో ద్విరుక్తటకారం వచ్చి చేరడం వల్ల ద్విరుక్తటకారదేశ సంధి జరిగింది.
ఈ) క్రింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
జవాబు:
1. చిట్టెలుక = చిఱు + ఎలుక – ద్విరుక్తటకారదేశ సంధి
2. చిట్టాకు = చిఱు + ఆకు – ద్విరుక్తటకారదేశ సంధి
3. నట్టేట = నడు + ఏట – ద్విరుక్తటకారదేశ సంధి
ఉ) అలంకారాలు :
అంత్యానుప్రాస అలంకారం :
కింది వాక్యాలను పరిశీలించండి.
1. రాళ్ళను మలిచి ఆయుధాలుగా చెక్కుకున్నాం.
జంతువులను చంపి ఆకలిని తీర్చుకున్నాం.
వీటిలో చివర ‘కున్నాం’ అనేది రెండు వాక్యాలలోనూ ఉంది. ఈ విధంగా వాక్యాల చివర ఒకే పదం లేదా ఒకే అక్షరం ఉంటే దానిని అంత్యానుప్రాసాలంకారం అంటారు.
ఈ క్రింది వాక్యాలను కూడా గమనించండి.
2. మాటలు నేర్చుకున్నాం.
లిపులు కూర్చుకున్నాం.
దేవుళ్ళను సృష్టించుకున్నాం.
పై కవితలోని పాదాలన్నింటి చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు వచ్చాయని గమనించాలి. ఇలా అన్ని పాదాలలోనూ చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అంత్యానుప్రాసాలంకారం అవుతుంది.
పాఠంలోని అంత్యానుప్రాస కలిగిన పాదాలను గుర్తించి వ్రాయండి.
1. హోరు జలపాతాల బృందగానాలను అవధరించాం.
2. సిగ్గు తెలిసి ఆకులు ధరించాం.
3. ఖండాలు దాటిపోయాం వచ్చాం.
4. రాజ్యాలు దాటిపోయాం వచ్చాం.
పైన (1) (2) వాక్యాలలో చివర ‘ధరించాం’ అనే పదం ఉంది. కనుక వీటిలో అంత్యానుప్రాసాలంకారం ఉంది. (3) (4) వాక్యాల చివర ‘వచ్చాం’ అనే పదం ఉంది. కనుక వీటిలో అంత్యానుప్రాసాలంకారం ఉంది.
పాఠాంత పద్యం :
ఇనుములోన గాగ హీనలోహమ్ములు
బంగరానటంట పసరుపూయ
వెర్రికూతంటర విజ్ఞాన యుగములో
సమసమాజ కాంక్షి చారువాక.
బలరామకృష్ణ – చారువాక శతకం
భావం : కొలిమిలో కాగిన లోహాలు బంగారం పూత పెడితే బంగారంలా మెరుస్తాయి కాని బంగారం కాదు అలాగే విజ్ఞాన యుగంలో మూఢ విశ్వాసాలేంటి అని ప్రశ్నిస్తున్నాడు. సమసమాజాన్ని కోరుకునే చారువాకుడు.
ఈ పాఠంలో నేర్చుకున్నవి :
1. నాకు నచ్చిన అంశం : మనిషి మాలిన్యాన్ని ఇన్ని నులివెచ్చని కన్నీళ్ళతో కడిగి శుభ్రం చేయలేకపోయాం.
2. నేను గ్రహించిన విలువ : మనిషి సాధించిన ప్రగతి కంటే దయార్ద్రహృదయం విలువైనది.
3. సృజనాత్మక రచన : లేఖ.
4. భాషాంశాలు : అర్థాలు, పర్యాయపదాలు, ప్రకృతి-వికృతులు, సవర్ణదీర్ఘ, ఉత్వ సంధులు, ద్విగు, రూపక, సప్తమీ తత్పురుష సమాసాలు, ద్విరుక్తటకారదేశ సంధి, అంత్యాను ప్రాసాలంకారం.
గేయాలు-అర్థాలు-భావాలు :
1. ఆకాశానికీ
భూమికీ మధ్య
అవతరించాం
గగన డమరుక లయనీ
అడివిని ఊయలలూగించే వాయురాగాలనీ విన్నాం
హెూరుజలపాతాల బృందగానాలని అవధరించాం
సిగ్గు తెలిసి ఆకులు ధరించాం
రాళ్ళని మలిచి ఆయుధాలు చెక్కుకున్నాం
సాటి జంతువులని చంపి ఆకలి తీర్చుకున్నాం
ప్రతిపదార్థాలు :
- ఆకాశం = నింగి
- భూమి = పుడమి
- అవశరించడం = జన్మించడం
- డమరుకం = డక్కీ (ఒక వాద్యం)
- లయ = నృత్త గీత వాద్యాలు సమానంగా ఉండడం
- ఆడవి = అరణ్యం
- వాయురాగం = గాలిపాట
- జలపాతం = కొండ మీర నుండి నిటారుగా భూమిపై పడే నీరు
- బృందగానం = సమూహంగా పాడేపాట
- అవధరించడం = వినడం
- ధరించడం = కట్టుకోవడం
- మలిచి = మార్పు చేసి
- సాటి = మనవంటి
భావం: ఆకాశానికీ, భూమికీ మధ్య (భూమిపై) జన్మించాం. ఆకాశం అనే డమరుకం యొక్క ధ్వనులను (ఉరుములు మొదలైనవి) విన్నాం. అడవులను ఊయలలూగించే గాలి పాటలను (చెట్ల సందులలోంచి గాలి వీచేటపుడు వచ్చే ధ్వనులను) విన్నాం. జలపాతాల సమూహపు పాటలను (సెలయేళ్ల చప్పుళ్లు) విన్నాం. ఆదిమానవునిగా ఉన్నపుడు సిగ్గు తెలిసి ఆకులను బట్టలుగా కట్టుకొన్నాం. రాళ్లను ఆయుధాలుగా తయారు చేసుకొన్నాం. మనతో కలిసి తిరిగే సాటి జీవులైన జంతువులను చంపి ఆ మాంసం తిని ఆకలి తీర్చుకొన్నాం (ఇది ఆదిమానవుడిగా మన మొదటి దశ).
2. మాటలు నేర్చుకున్నాం
లిపులు కూర్చుకున్నాం
దేవుళ్ళని సృష్టించుకున్నాం
నక్షత్రాలకి నామకరణం చేశాం
గ్రహాలని విగ్రహాలుగా మార్చాం
నిప్పుని రాజేశాం
ప్రతిపదార్థాలు :
- మాటలు = పలుకులు
- లిపి = వ్రాత
- సృష్టి = కొత్తగా తయారు చేయడం చుక్కలు
- నక్షత్రాలు = చుక్కలు
- నామకరణం = పేరు పెట్టడం
- గ్రహములు = సూర్యాది గ్రహాలు
- విగ్రహం = బొమ్మ
- నిప్పు = అగ్ని
- రాజేశాం = అంటించాం
భావం : (ఆదిమానవ దశలో కొంత అభివృద్ధి చెందాక) మాట్లాడడం నేర్చుకొన్నాం, అక్షరాలు, పదాలు వ్రాయడం నేర్చుకొన్నాం, దేవుళ్లని కల్పించుకొన్నాం. నక్షత్రాలకి పేర్లు పెట్టాం. గ్రహాల శిల్పాలు తయారు చేసుకొన్నాం. నిప్పును తయారు చేయడం నేర్చుకొన్నాం.
3. చక్రాన్ని ఊహించి దొర్లించి గిరగిరా తిప్పాం
ఖండాలు దాటి పోయాం వచ్చాం
ఓం రాజ్యాలు దాటి పోయాం వచ్చాం
రాజ్యాలు నిర్మించాం సామ్రాజ్యాలు ఆక్రమించాం
నదులు మళ్ళించాం సముద్రాలు మధించాం
గ్రహాల మీద అడుగులు వేశాం
నియంతలుగా ఏలాం
నిరంకుశుల్ని నాశనం చేశాం
శ్రామిక రాజ్యాలు కూల్చాం
సంపదలు దోచుకున్నాం
దేవతలకి స్వర్ణకలశాలలో
పంచామృతాలతో అభిషేకాలు చేశాం…
ప్రతిపదార్థాలు :
- ఖండాలు = ఆసియా, ఆస్ట్రేలియా మొదలైన ఖండాలు
- దాటిపోవడం = అధిగమించడం
- నిర్మించడం = కట్టుకోవడం
- సామ్రాజ్యం = పెద్ద రాజ్యం
- సముద్రం = పయోధి
- ఏలుట = పరిపాలించుట
- నిరంకుశులు = ఎవరి అదుపులోనూ లేనివాడు
- అభిషేకం = దేవునికి చేయించే స్నానం
- అడుగులు వేయడం = ప్రవేశించడం
- నియంత = సర్వాధికారాలను గుప్పిట్లో పెట్టుకొని, ఎవ్వరినీ లెక్క చేయకుండా పాలించే వ్యక్తి
- స్వర్ణం = బంగారం
- కలశము = కుండ
- పంచామృతాలు = ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, చక్కెర
భావం : చక్రాన్ని కనుగొని గిరగిరా త్రిప్పాము, దొర్లించాం. 7 ఖండాలలో ఒకదాని నుండి మరొకడానిలోకి (సముద్రమార్గం ద్వారా) ప్రయాణించాం. ఒక రాజ్యం నుండి మరో రాజ్యంలోకి ప్రవేశించాం. కొత్త రాజ్యాలు నిర్మించుకొన్నాం, శత్రు సామ్రాజ్యాలు (యుద్ధాలు చేసి) ఆక్రమించాం, నదులను (వ్యవసాయం కోసం) దారి మళ్లించాం, సముద్రాలు (పెట్రోలు, డీజిలు, మొ॥వాటి కోసం) చిలికాం, ఇతర గ్రహాల మీదకు ప్రవేశించాం, నియంతలుగా మారాం, ఎవరి మాటా వినని నిరంకుశుల్ని నశింపచేశాం, వారు దోచుకొని దాచుకున్న సంపదను తిరిగి దోచుకొన్నాం, దేవతలకు బంగారు చెంబులలో నింపిన పంచామృతాలతో అభిషేకాలు చేశాం.
4. కానీ సోదరా
మనిషి మాలిన్యాన్ని ఇన్ని నులివెచ్చని కన్నీళ్ళతో
కడిగి శుభ్రం చేయలేక పోయాం ….!
ప్రతిపదార్థాలు :
- కానీ = అయినప్పటికీ
- సోదరా = అన్నయ్యా !/తమ్ముడూ !
- మనిషి = మానవుడు
- మాలిన్యం = మురికి
- ఇన్ని = కొంచం
- నులివెచ్చని = కొద్దిగా వేడిగా ఉన్న
- కన్నీరు = అశ్రువులు
భావం : కానీ ! సోదరా ! మనిషి మనసులో ఉండే మాలిన్యాన్ని కొద్దిగా వెచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేక పోయాం.
వ్యాకరణంపై అదనపు సమాచారం :
పర్యాయ పదాలు :
మాలిన్యం = మలినత, మలినత్వం, మురికి, కల్మషం
ఆకాశం = మిన్ను, గగనం, అంబరం, నభం, నింగి
భూమి = నేల, ధరణి, వసుంధర, వసుధ, ధర
డమరుకం = డమరువు, డక్కి ఢక్కి, ఝర్ఘరి
అడవి = అటవి, అరణ్యం, కాన, కాననం, విపినం
ఊయల = ఉయ్యేల, ఊయేల, ఉయ్యాల, ఉయాల, జంపాల, డోలి, డోలిక, జోలె, తొట్ట్, ఆందోళిక
వాయువు = గాలి, గాడ్పు, పవనం, సమీరం, మరుత్తు
జలపాతం = కొండ కాలువ, నిర్ఘరం
సిగ్గు = లజ్ట, బిడియం, త్రప, ఏ్రీడ, మోమాటం, సంకోచం
ఆకు = పత్రం, దళం, పర్ణం
చంపు = వధించు, కూల్చు, రూపుమాప, సంపు
ఆకలి = క్షుత్త, బుభు్క్ష, అంగద, ఆకొన్నతనం, గొద
మాట = పలుకు, ఉక్తి, నుడి, సుద్ది, వాక్కు, వాణి
లిపి = ఏ్రాత, లేఖనం, దస్తూరి, ఏ్రాయసం, అక్షర విన్యాసం
దేవుడు = దేవత, వేల్పు, భగవంతుడు
సృష్టి = సృజించుట, ఉత్పత్తి, నిర్మాణం
నక్షత్రం = చుక్క, రిక్క, తార
పరగాం = ప్రతిమ, దొమ్మ, మూత్తి
నిప్పు = అగ్ని, అనలం, చిచ్చు, వప్ని
ఊహ = యోచన, ఉత్త్రేక్ష
ఖండం = తునుక, ముక్క
ఆక్రమణ = ఆక్రమించు, ఖబ్జా, దురాక్రమణ
నది = ఏఱు, ఆపగ, కూలంకష, నిమ్నగ, స్రవంతి
సముద్రం = సాగరం, అబ్ది, కడలి, మున్నీరు
నాశనం = అంతం, క్షయం, నాశం
సంపద = ఐశ్వర్యం, కలిమి, ఆస్తి, భాగ్యం, సంపత్తి
దోచు = కొల్లగొట్టు, అపహరించు, దొంగిలించు, హరించు
స్వర్ణం = బంగారం, కనకం, సువర్ణం, హేమం
కలశం = కడవ, ఫటం, కుండ, కుంభం, ధారకం
అభిషేకం = స్నానం చేయించుట, తిరు మంజనం, మజ్టనం
కన్నీరు = కన్నీళ్ళు, అశువులు, బాష్పములు
నానార్ధాలు :
చిర = చాలాకాలం, పాతది
మాలిన్యం = మలినత, బాధ, పాపం, నలుపు
గగనం = ఆకాశం, దుర్లభం, శూన్యం, సున్న
ఆకాశం = మిన్ను, అబ్రకం, బ్రహ్మ
భూమి = నేల, చోటు, ప్రపంచం
లయ = స్వరగీతాలకు అనుగుణంగా తాళం వేయుట, మోసం, మాయ, వట్టివేరు, నాశం, ఆలింగనం, వేశ్య
రాగం = సంగీతమున నాట మొు|| రాగము, అనురాగం, రంగు, మాత్సర్యం, యతి, ఎఱొపు, అందం, కోపం, భావకం
చెక్కు = వంకలు తీర్చు, చెక్కిలి
జంతువు = ప్రాణం కలది, చేతనం, మృగం
మాట = పలుకు, నింద, వృత్తాంతం
దేవుడు = వేలుపు, చంద్రుడు, దరిద్రుడు
సృష్టి = సృజించుట, స్వభావం, కల్పన, జగత్తు, ప్రకృతి
గ్రహం = సూర్యాదులు, గ్రహించుట, అనుగ్రహం, చెర, రాహువు, గాము, యుద్ధ ప్రయత్నం
విగ్రహం = మూర్తి, శరీరం, విభాగం, యుద్ధం
చక్రం = బండికల్లు, గుంపు, కృష్ణుని ఆయుధం, దండు, కుమ్మరిసారె, చిన్న నాణెం, రాజ్యం, జక్కువ పిట్ట
ఊహ = యోచన, భావం, వితర్కం, భావన, ఆరోపం
దొర్లు = పొరలు, జారు, పడు, ఉ్రవహించు, ఎదుర్కాను, అనుభవించు, కలయు
ఖండం = తునుక, పులకండం, రత్నదోషం, పెద్ద థూభాగం, దేశం, అధ్యాయం
రాజ్యం = దొరత నానికి లోబడిన దేశం, దొరతనం, పరిపాలనం, సామ్రాజ్యం
నియంత = అధినాయకుడు, సారధి, నడుపువాడు
ఏలు = పాలించు, పొందు, శాసించు, సమాన మగు, వ్రేలు, పోషించు, కాపాడు
సంపద = ఐశ్వర్యం, శ్రేయస్సు
స్వర్ణం = బంగారం, ఎఱ్ఱ టెంకాయ చెట్టు
శుభ్రం = నిర్మలం, తెల్లనిది, ప్రకాశించునది, ఒక గ్రహయోగం, అంకం, పవిత్రమైన
వాయువు = సమీరం, అష్టదిక్పాలకులలో ఒకరు, స్వాతి
సాటి = సమానం, ఇచు్చనది, చేయునది, కొరడా
ప్రకృతులు – వికృతులు :
- ఆకాశము – ఆకసము
- భూమి – బూమి
- గహనం – గగనం
- అటవి – అడవి
- డమరుకం – డమురుగం
- బృందము – పిడు
- స్వకుచ్ – సిగ్గు
- ఆయుధము – ఆయిదము
- గ్రహము – గాము
- ఖండము – కండము
- సముద్రము – సంద్రము
- స్వర్ఱము – సొన్నం
- శ్రమ – చెమట, సొమ్మ
వ్యుత్పత్యర్థాలు :
నక్షత్రం = నశింపనిది – చుక్క
ఆయుధం = యుద్ధం చేయుటకు తగిన సాధనం
అమృతం = మరణం లేనిది – సుధ
అటవి = వేటకై తిరిగెడు చోటు – అడవి
ఆకాశం = దీనియంతటను సూర్యాదులు ప్రకాశించును
భూమి = ఉదకము వలన పుట్టును .
డమరుకం = డమ అనెడి శబ్దం పలుకునది
వాయువు = విసిరెడువాడు
బృందము = కూర్చబడునది
జంతువు = పుట్టునది
లిపి = దీని చేత పత్రము పూయబడును
దేవుడు = క్రీడించువాడు
నక్షత్రము = నశింపనిది
గ్రహము = పట్టబడునది
అమృతము = మరణము నీయనిది
ఖండం = తుంచబడునది
స్వర్ఱము = మంచి వన్నె కలది
సోదరుడు = (తనతో) ఒకే గర్భమున పుట్టినవాడు
కలశము = ఉదకమును తీసుకొనునది
శుభ్రము = ఒప్పునది
ఉత్వసంధి :
ఊయలలూగించు = ఊయలలు + ఊగించు
జంతులని = జంతువులు + అని
బృందగానాలని = బృందగానాలు+ అని
గ్రహాలని = గ్రహాలు+ అని
గణసంధి :
సోదర = స + ఉదర
అత్వసంథి :
సోదరా = సోదర + ఆ
ఖండాలు = ఖండము+ లు
రాజ్యాలు = రాజ్యము+ లు
సామ్రాజ్యాలు = సామ్రాజ్యము+ లు
సముద్రాలు = సముద్రము+ లు
అభిషేకాలు = అభిషేకము+ లు
రాగాలు = రాగము+ లు
జలపాతాలు = జలపాతము+ లు
గానాల = గానము+ ల
ఆయుధాలు = ఆయుధము+ లు
నక్షత్రాల = నక్షత్రము+ ల
గ్రహాల = గ్రహము+ ల
విగ్రహాలు = విగ్రహము+ లు
కలశాలలో= కలశము+ లలో
అమృతాలతో = అమృతము + లతో
సవర్ణదీర్ఘ సంధి :
అమృతాభిషకాలు అమృత +అభిషేకాలు
పంచామృతాలు = పంచ+ అమృతాలు
ప్రాతాది సంధి :
కన్నీరు = కన్ను+ నీరు
సమాసాలు :
షష్తీ తత్పురుష సమాసం :
డమరుక లయ = డమరుకము యొక్క లయ
వాయు రాగాలు= వాయువు యొక్క రాగాలు
జలపాతం = జలము యొక్క పాతం
శ్రామిక రాజ్యం = శశామికుల యొక్క రాజ్యం
బృందగానము = బృందము యొక్క గానము
మనిషి మాలిన్యం = మనిషి యొక్క మాలిన్యము
తృతీయా తత్పురుష సమాసం :
స్వర్ణ కలశము = స్వర్ణముతో కలశము
బృందగానం = బృందముతో గానం
ద్విగు సమాసం :
పంచామృతాలు = ఐదు ఐన అమృతాలు
సప్తమీ తత్పురుష సమాసం :
కన్నీళ్ళు = కంటి యందలి నీళ్ళు
విశేషణ హూర్వపద కర్మధారయ సమాసం :
నులివెచ్చని = కొద్దియైన వెచ్చని
చిరమాలిన్యం = చిరయైన మాలిన్యం
స్వర్ఱకలశం = స్వర్ణపుదైన కలశం
నఞ తత్పురుష సమాసం :
నిరంకుశలు = అంకుశం లేనివారు
కవి పరిచయం :
పేరు : షేక్ ఖాజా హుస్సేన్.
తల్లిదండ్రులు : షేక్ హుస్సేన్ సాహేబ్, షేక్ ఇమాంబీ.
జననం : గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15న జన్మించారు.
రచనలు : అమ్మ చెట్టు, సమాజానందస్వామి, గరీబ్ గీతాలు, నీటిపుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్య పురాణం మొదలైనవి.
అవార్డులు రివార్డులు : 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు.
ప్రత్యేకతలు : తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహితీ పురస్కారం కూడా పొందారు. 1949-2020 కవి, రచయిత, పాత్రికేయుడు, దేవీప్రియగా సుప్రసిద్ధులు.
2020లో స్వర్గస్తులయ్యారు. వీరి గాలిరంగు వచన కవితా సంపుటి నుండి ప్రస్తుత పాఠ్యాంశం గ్రహించబడింది.
ఉద్దేశం :
తోటివారి సుఖదుఃఖాలలో పాలుపంచుకోవాలి. కష్టాలలో ఉన్నవారిపట్ల సానుభూతి కలిగి ఉండాలి. విద్యార్థులలో ఈ లక్షణాలతో బాటు మానవత్వం, సహాయం చేసే గుణం పెరగాలనేది ఈ పాఠం ఉద్దేశం.
ప్రక్రియ – వచన కవిత :
తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత వచన కవితా ప్రక్రియ ప్రసిద్ధి పొందింది. సామాజిక చైతన్యం కలిగించే వస్తువు వచన కవిత్వంలో ఉంటుంది. ఛందోనియమాలు లేకున్నా అంత్యప్రాసలు వచన కవితకు అలంకారాలు. అల్పాక్షారాలలో అనల్పార్ధాన్ని వచ్చే విధంగా రచన చేయడానికి వచన కవిత అనువైనది.