Access to the AP 8th Class Telugu Guide 11th Lesson సమద్రుష్టి Questions and Answers are aligned with the curriculum standards.
సమద్రుష్టి AP 8th Class Telugu 11th Lesson Questions and Answers
చదవండి – ఆలోచించి చెప్పండి :
వినదగుఁ నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక ! వివరింపఁదగున్
కని కల్ల నిజముఁ దెలిసిన
మనుజుఁడె పో నీతిపరుడు మహిలో సుమతీ! – బద్దెన
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
ఎవరు చెప్పినా ఏమి చెయ్యాలి ?
జవాబు:
ఎవరు చెప్పినా వినాలి.
ప్రశ్న 2.
కల్ల అంటే అర్థం చెప్పండి.
జవాబు:
కల్ల అంటే అబద్ధం.
ప్రశ్న 3.
నీతిపరుడు అంటే ఎవరు ?
జవాబు:
దేనినైనా తాను చూచి నిజం, అబద్ధం తెలుసుకొన్నవాడే నీతిపరుడు.
అవగాహన – ప్రతిస్పందన :
ఇవి చేయండి :
అ) క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. రాయండి.
ప్రశ్న 1.
సమదృష్టి గజల్న రాగ, భావయుక్తంగా పాడండి.
జవాబు:
మీ ఉపాధ్యాయులను అనుసరించి పాడండి.
ప్రశ్న 2.
పాఠంలో మీకు నచ్చిన అంశాన్ని గురించి మాట్లాడండి.
జవాబు:
పాఠంలో నాకు నచ్చిన అంశం ఏదంటే ‘కలలే అందమైన భవితకు పునాదులు’ అనే వాక్యం. ఒక పనిని సాధించాలని ఊహించడమే కల. ఆ ఊహ బలంగా ఉండాలి. అప్పుడే ఆ కల నెరవేరడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం. అప్పుడు తప్పక అనుకొన్నది సాధిస్తాం. అందుకే ఈ వాక్యం నాకు నచ్చింది.
ప్రశ్న 3.
కింది వాటిని గురించి రాయండి.
అ) కంటిచూపు ___________.
ఆ) నిదురమత్తు __________.
ఇ) నదికోత ___________.
జవాబు:
అ) కంటిచూపు : మన దృష్టిని కంటిచూపు అంటారు. మన కంటి చూపులో జాలి, సహాయం చేసే స్వభావం ఉండాలి.
ఆ) నిదురమత్తు : నిద్ర వలన కలిగే మత్తు. ఇది బద్దకానికి, అజ్ఞానానికి గుర్తు.
ఇ) నదికోత : కొన్నిచోట్ల నదులు ఒడ్డును కోసి తనలో కలిపేసుకొంటుంది. దీనిని నదీకోత అంటారు. నది ఆక్రమించడమే నదికోత. ఆ ఆక్రమణను అడ్డుకొనే మానవ ప్రయత్నమే ఎదురీత.
ఆ) కింది గద్యాన్ని చదివి ప్రశ్నలను తయారుచేయండి.
మద్దూరి నగేష్ బాబు కవిత్వం చదువుతుంటే పల్లెలో తిరుగుతున్నట్లే ఉంటుంది. కడుపు మాడ్చుకుంటూ కిరసనాయిలు బుడ్డి దీపం ముందు కూర్చోని, వెంట్రుకలు కాల్చుకుని, చదువుతున్న పిల్లలు కనిపిస్తారు. ఆకలి మంటలతో కదిలే పల్లె పదాలు కన్పిస్తాయి. ముతకచీర ఉయ్యాలలో జోలపాటలు పాడే తల్లులను చూడవచ్చు. ముఖ్యంగా తాతల, నాయనమ్మల కష్టాల బతుకుల కథలు వినవచ్చు. రచ్చబండ, వెలివాడ, పుట్ట, గోదావరి, కాస్త సిగ్గుపడదాం, ఊరు-వాడ, మొదలైన కవితా సంపుటాలతో తెలుగు సాహిత్య ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించారు. బడుగులకు గొడుగు పట్టారు.
ప్రశ్నలు :
1. నగేష్ బాబు కవిత్వం చదువుతుంటే ఎలా ఉంటుంది ?
2. ఎటువంటి పిల్లలు కనిపిస్తారు ?
3. పాటలు పాడే తల్లులను వేటిలో చూడవచ్చు ?
4. నగేష్ బాబు కవితా సంపుటాలలో ఒకదాని పేరు వ్రాయండి.
ఇ) క్రింది గద్యాన్ని చదివి నాలుగు ముఖ్యమైన వాక్యాలు రాయండి.
జిల్లెళ్ళమూడి అమ్మగారు 1958 ఆగస్టు 15న అన్నపూర్ణాలయం ప్రారంభోత్సవం చేశారు. ఆ సత్రంలో భోజనం చేయడానికి ఆకలే అర్హత. వేషధారణ బట్టి కాకుండా ఆకలిని బట్టే అన్నం పెట్టారు. అన్ని బాధల కన్నా ఆకలి బాధే ఎక్కువ అనేవారు అమ్మ. అన్ని వర్గాలవారు అన్నిరకాల వారు అమ్మ చేతి అన్నపూర్ణ ప్రసాదాన్ని అమృతోపమానంగా ఆరగించేవారు. అమ్మ తన ఇంటికి అందరి ఇల్లు అని పేరు పెట్టారు.
బాపట్ల కుష్ఠు ఆస్పత్రి రోగులకు అరటిపళ్ళు, పులిహోర పంపేవారు. అన్నంతో పాటు అందరికీ బట్టలనూ ఇచ్చేవారు. 1971లో సంస్కృత పాఠశాల, కళాశాలలను నెలకొల్పి భాషాభివృద్ధికి సంస్కృతి సాంప్రదాయాల అభివృద్ధికి నడుం కట్టారు. అక్కడ చదివే ప్రతి విద్యార్థికి ఉచిత వసతి భోజన సౌకర్యాలు కల్పించారు. ఆసుపత్రిని నెలకొల్పి ఉచితంగా సేవలు అందించారు. ఇలా పలు రంగాలలో ఎనలేని సేవ కార్యక్రమాలు చేసిన అమ్మ సేవలు చిరస్మరణీయం.
జవాబు:
- జిల్లెళ్ళమూడి అమ్మగారు 1958 ఆగస్టు 15న అన్నపూర్ణాలయం స్థాపించారు.
- అన్ని బాధల కంటే ఆకలి బాధ ఎక్కువ.
- అందరూ అమ్మ చేతి ప్రసాదం ఆరగించేవారు.
- 1971లో సంస్కృత పాఠశాల స్థాపించారు.
ఈ) పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
సమదృష్టి కవిని గురించి రాయండి.
జవాబు:
కవిగా, గాయకునిగా, సాహితీవేత్తగా పైడి తెరేష్ బాబు ప్రసిద్ధులు. వీరు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సుబ్బమ్మ, శాంతయ్య. అల్పపీడనం, హిందూమహా సముద్రం వంటి రచనలు చేశారు. ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా తన బాణీ వినిపించారు.
ప్రశ్న 2.
కవి పాఠంలో వేటిని నలుపుతో పోల్చాడు ?
జవాబు:
కవి కన్నును నలుపుతో పోల్చాడు. అలాగే మేఘాన్ని, అక్షరాన్ని, గొంతును, రేయిని, ఈతను, కులాన్ని కూడా నలుపుతో పోల్చాడు.
వ్యక్తీకరణ – సృజనాత్మకత :
అ) క్రింది ప్రశ్నలకు నాలుగు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
గజల్ ప్రక్రియ లక్షణాలను గురించి రాయండి.
జవాబు:
గజల్ అనే పదం గజాల్ అనే పదం నుండి పుట్టింది. ఇది ఉర్దూ సాహిత్య ప్రక్రియ. దానిని తెలుగు సాహిత్యంలోకి తెచ్చుకొన్నాం. అరబ్బీ భాషలో గజల్ అంటే రాగాలాపన అని అర్థం. లయాత్మకమైన నడకతో స్వేచ్ఛగా భావాన్ని ప్రకటించడానికి ఉపయోగపడే సాహిత్య ప్రక్రియ గజల్. ఇందులో భావం ఎక్కువ, పదాలు తక్కువ, భావం ఏ చరణానికి ఆ చరణమే ఉంటుంది. పల్లవిని మాడ్లా అంటారు. చరణాన్ని మక్తా అంటారు. అంత్యప్రాస ఉంటుంది. కవి ముద్ర ఉంటుంది. దీనినే ‘తఖల్లస్’ అంటారు.
ప్రశ్న 2.
‘కలలు కనడమే బంగారు భవితకు పునాది’ అని అనడంలో కవి ఉద్దేశం ఏమి ?
జవాబు:
‘కలలు కనడమే బంగారు భవితకు పునాది’ అని కవి తన అనుభవంతో లోక పరిశీలనా దృష్టితో ఎంతోమంది గొప్పవారి జీవిత చరిత్రలు చదివి సంపాదించిన జ్ఞానంతో అన్నారు. ఒక పనిని సాధించాలంటే దాని గురించి మనసులో సాధించాలనే కోరిక బలంగా నాటుకోవాలి. అది సాధించాలని నిరంతరం తపించాలి. అదే కలలు కనడం. ఆ కలలను నెరవేర్చుకునేందుకు పట్టుదలతో, దీక్షతో కృషి చేయాలి. దానిని సాధించుకోవాలి. బంగారు భవితను నిర్మించుకోవాలి. అందుకే ఆ బంగారు భవితకు కలలు కనడం పునాదిగా కవిగారు చెప్పారు.
ప్రశ్న 3.
తూర్పు తలుపు తెరవదు అంటే ఏమిటో రాయండి.
జవాబు:
అరచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవ అని కవి అన్నాడు. అరచి మరీ పిలవటం అంటే హక్కుల సాధన కోసం బానిసత్వపు సంకెళ్ళను తెంచుకోవటం కోసం, అభివృద్ధి కోసం చేసే నినాదాలే అరుపులు. అలా అరచి పిలిచినప్పుడే తూర్పు తలుపు తెరుచుకుంటుంది అని కవిగారి ఉద్దేశం. నీ బానిస సంకెళ్ళను తెంచుకునేందుకు నువ్వు ప్రయత్నించకపోతే తూర్పు తలుపు తెరుచుకోదు. అభివృద్ధి ఉండదు అని కవిగారి భావము.
ఆ) క్రింది ప్రశ్నలకు ఎనిమిది వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
సమదృష్టి పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మనకి చూపును ఇచ్చే కంటిలోని నల్లగుడ్డు నల్లగా ఉంటుంది. కానీ కంటి చూపు మాత్రం నలుపు కాదు. చెట్లు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండటం వలన నల్లగా కనబడతాయి. కానీ అవి కాసే పూలు, పళ్ళు, కాయలు నలుపు కాదు. నల్లని మేఘం ఇచ్చే వాన చినుకు నల్లగా ఉండదు. కానీ అది నేలకు కడుపు పంటను ఇస్తుంది. అంటే నేలపై విత్తనాలను మొలకెత్తిస్తుంది. భూమిని సస్యశ్యామలం చేస్తుంది.
పుస్తకంలోని అక్షరాలు నలుపు రంగులో ఉంటాయి. కానీ అవి ఇచ్చే చదువు దాని వలన వచ్చే విజ్ఞానం చైతన్యం కలిగిస్తుంది. ఆ చైతన్యం వలననే నిద్రమత్తు, బద్ధకం, అజ్ఞానం తొలగిపోతాయి. ఎండనక, వాననక కష్టపడేవారి శరీరం, గొంతు సాధారణంగా నలుపు రంగులో ఉంటాయి. హక్కుల సాధన కోసం, బానిస సంకెళ్ళు తెంచుకోవటం కోసం వారు చేసే ప్రయత్నాలు, ఉద్యమాలు, నినాదాలు నలుపు రంగులో ఉండవు.
ప్రగతిని సాధిస్తూ, వారి జీవితాలలో తెల్లని వెలుగులను నింపుతాయి. కలలకు మూలమయిన రాత్రి నలుపు రంగులో ఉంటుంది. కానీ ఆ కలలే అందమయిన భవితకు పునాదులయి కాంతివంతంగా ఉంటాయి. నదిలో ఎదురీతకు దిగినప్పుడు ప్రవాహవేగం బలంగా వెనుకకు నెడుతుంటే దానిని ఎదిరించి బలంగా ఈదే ఈత మాత్రం నల్లగా ఉంటుంది. ప్రవాహానికి ఎదురీది గెలిచిన గెలుపు కాంతులను విరజిమ్ముతుంది. ఓ సోదరా మనను విభజించే కులము మాత్రమే నలుపు. ప్రగతిని సాధించటానికి చేసే వేగవంతమైన ప్రయత్నం మన జీవితాలలో లోటును భర్తీ చేసి వెలుగులను ప్రసాదిస్తుంది. మొత్తం మీద ఫలితాలనిచ్చేవి నలుపుగా ఉన్నా ఫలితం మాత్రం కాంతులు విరజిమ్ముతుందని కవి భావన.
ప్రశ్న 2.
సమసమాజ స్థాపనకు నీవు ఏమి చేయగలవో రాయండి.
జవాబు:
సమసమాజ స్థాపనకు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. పేదలకు ఆర్థిక సహాయం చేస్తాను. నా స్నేహితులెవరైనా ఆకలితో ఉంటే వారికి నేను తెచ్చుకున్న తినుబండారాలు పెడతాను. నా స్నేహితులెవరైనా పరీక్ష ఫీజు కట్టలేని స్థితిలో ఉంటే మా నాన్నగారిని అడిగి డబ్బులు తెచ్చి వారి ఫీజు కడతాను. నా స్నేహితులను ఎవరైనా కించపరచినా హేళన చేసినా సహించను. అది తప్పని చెబుతాను. నాకు తెలియనివి నా స్నేహితుల వద్ద అడిగి నేర్చుకుంటాను. వారికి తెలియకపోతే నేను అర్థమయ్యేలా చెబుతాను. మేమందరం ఒకేబాట, ఒకేమాటగా కలసిమెలసి ఉంటాము.
ప్రశ్న 3.
సమదృష్టిపై కవిత రాయండి.
జవాబు:
అంతా ఒకటే మనమంతా ఒకటే
కులమేదైనా మతమేదైనా కలిసుందాం
ధనిక పేదా భేదం వీడుదాం
అంతా ఒకటే మనమంతా ఒకటే
అవిద్యను, అజ్ఞానాన్ని నిర్మూలిద్దాం
బాధలను కష్టాలను తరిమేద్దాం
అంతా ఒకటే మనమంతా ఒకటే
మోసం, ద్వేషం మనకేల
స్నేహం, సౌఖ్యం మనవేలే
అంతా ఒకటే మనమంతా ఒకటే.
భాషాంశాలు – పదజాలం :
అ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సరైన అర్థాలను రాసి, వాటితో సొంత వాక్యాలను రాయండి.
ఉదా : తొలకరి చినుకుల వర్షఋతువుకు సంకేతం.
సంకేతం = గుర్తు
సొంతవాక్యం : రహదారిపై జీబ్రా చారలు నడక దారికి గుర్తు.
1. తల్లిస్పర్శ బిడ్డకు నులివెచ్చగా ఉంటుంది.
జవాబు:
తల్లిస్పర్శ = అమ్మ తాకుట
సొంతవాక్యం : బిడ్డను అమ్మ తాకితే ఎంత బాధైనా పోతుంది.
2. ఒక్క చరుపుతో మత్తు వదులుతుంది.
జవాబు:
చరుపు = చేతిదెబ్బ
సొంతవాక్యం : హనుమంతుని చరుపుతో ఏనుగులు కూడా భయపడి పారిపోయాయి.
3. విద్యార్థులు భవితకై బాగా శ్రమించాలి.
జవాబు:
భవిత = భవిష్యత్తు
సొంతవాక్యం : కష్టపడి చదివితే భవిష్యత్తు బంగారంలా ఉంటుంది.
4. ఏటికి ఎదురీత అన్నివేళలా మంచిది కాదు.
జవాబు:
ఎదురీత = ప్రవాహానికి ఎదురు వెళ్ళటం
సొంతవాక్యం : కష్టాలకు భయపడకుండా ఎదురీత ఈదాలి.
ఆ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి.
1. ఆ కోనసీమ అందాలు కన్నులకింపు కూర్చుతాయి.
జవాబు:
అందము = సొగసు, దొరకము
2. మనిషి నలుపు కానీ గుణం కాదు.
జవాబు:
గుణము = స్వభావము, వింటినారి
3. ఆ నగరం వరదలలో మునిగిపోయింది.
జవాబు:
వరద = నదీ విశేషము, కన్యక
4. పల్లె సీమలు కష్టాల పాలైనాయి.
జవాబు:
సీమ = ప్రదేశము, రాజ్యము
ఇ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి.
ఉదా : అనవసరంగా రాత్రివేళలలో బయట తిరగరాదు.
రాత్రి = నిశ, అంధకారం, రేయి
1. భూమి కట్టిన పచ్చని వస్త్రాలు చెట్లు.
జవాబు:
చెట్లు = తరువులు, వృక్షాలు
2. రైతులు నేలతల్లిని నమ్మి పంటలు పండిస్తారు.
జవాబు:
రైతులు = కర్షకులు, వ్యవసాయదారులు
3. మా ఊరు కుందూనది ఒడ్డున ఉంది.
జవాబు:
నది = ఆపగ, ఏరు
4. మా మిత్రులందరికి కబడ్డీ అంటే ఇష్టం.
జవాబు:
మిత్రులు = స్నేహితులు, సఖులు
ఈ) కింది ప్రకృతి – వికృతులను జతపరచండి.
జవాబు:
అ) రేయి (3) – 1) అక్కరం
ఆ) కులం (4) – 2) మది
ఇ) అక్షరం (1) – 3) రాత్రి
ఈ) మతి (2) – 4) కొలము
వ్యుత్పత్త్యర్థాలు :
వ్యుత్పత్తి అనగా పుట్టుక, పదాల పుట్టుక తెలిపే విధానాన్ని వ్యుత్పత్తి అంటారు. ఆ శబ్దాల అర్థాన్ని తెలిపేది వ్యుత్పత్త్యర్థం.
ఉదా : 1) గురువు – అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలేవాడు (ఉపాధ్యాయుడు).
2) శూరుడు
శౌర్యమును ప్రదర్శించేవాడు (వీరుడు).
కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.
1. భాస్కరుడు = కాంతిని కలుగజేయువాడు.
2. శారద = శరత్తునందు పుట్టునది.
3. విద్యార్థి = విద్యను అర్థించువాడు. (ఇచ్చినది వ్యుత్పత్తి పదం కాదు, సమాస పదం)
4. క్షేత్రం = దైవం వెలసిన ప్రాంతం (దేవాలయం)
భాషా క్రీడ :
కింది పదాలకు అర్థాలను పట్టికలోని సరైన అక్షరాలతో కూర్చి రాయండి.
1. స్నేహితుడు = మిత్రుడు (తృ-తప్పు)
2. తాకుట = స్పర్శ
3. క్షయంకానిది = అక్షయం
4. రాత్రి = రేయి
5. సాధన, ప్రయత్నం = వ్యవసాయం
వ్యాకరణాంశాలు :
అ) కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
ఉదా : కన్నొకటి = కన్ను + ఒకటి = ఉత్వసంధి
ఆ) కింది పదాలను విడదీసి సంధి ఏమిటో తెల్పండి.
ఇ) కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
1. చినుకుస్పర్శ = చినుకు యొక్క స్పర్శ – షష్ఠీ తత్పురుష సమాసం
2. రేయిపగలు = రేయియును, పగలును – ద్వంద్వ సమాసం (రేయిపగలు సమాసపదం కాదు)
3. అక్షరం = క్షరము కానిది – నఞ తత్పురుష సమాసం
4. నల్లమేఘం = నల్లనైన మేఘం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.
1. వర్షం నేలను తాకింది. వర్షం పంటలకు ప్రాణం పోసింది.
జవాబు:
వర్షం నేలను తాకి, పంటలకు ప్రాణం పోసింది.
2. విద్య అజ్ఞానాన్ని తొలగిస్తుంది. విద్య విజ్ఞానాన్నిస్తుంది.
జవాబు:
విద్య అజ్ఞానాన్ని తొలగించి, విజ్ఞానాన్నిస్తుంది.
3. విద్యార్థులు నిరంతరం శ్రమించారు. విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
జవాబు:
విద్యార్థులు నిరంతరం శ్రమించి, ఉత్తీర్ణులయ్యారు.
4. ప్రజలందరు సమానత్వం పాటించాలి. ప్రజలందరు శాంతిని స్థాపించాలి.
జవాబు:
ప్రజలందరు సమానత్వం పాటించి, శాంతిని స్థాపించాలి.
వృద్ధిసంధి :
పై వానిలో సంధి జరిగిన విధానం గమనించండి.
అ, ఆలకు ఏ, ఐలు పరమైతే ఐకారం వచ్చింది. అ, ఆలకు ‘ఓ, ఔలు పరమైతే ఔకారం వచ్చింది. అ, ఆలకు ఋకారం పరమైతే ‘ఆర్’ వచ్చింది.
సూత్రం : అకారానికి ‘ఏ, ఐ’ లు పరమైతే ‘ఐ’కారం, ‘ఓ, ఔలు పరమైతే ‘ఔ’కారం, ఋకారం పరమైతే ‘ఆర్’ ఆదేశంగా వస్తాయి.
ఐ, ఔలకు వృద్ధులని పేరు కనుక దీనికి వృద్ధిసంధి అని పేరు పెట్టారు. పాఠంలో వృద్ధిసంధి పదాలను గుర్తించండి.
పాఠాంత పద్యం :
ఆ.వె. పరుల స్వేచ్ఛకొక్క ప్రతిబంధకమ్ముగా
నిలువ రాదు సుమ్ము నీదు. స్వేచ్ఛ
పంచుకొనని స్వేచ్ఛ కుంచుకపోవురా!
నవయుగాల బాట నార్లమాట.
– నార్ల వేంకటేశ్వర రావు
భావం : నీ స్వేచ్ఛ ఎదుటివారి స్వేచ్ఛకి ప్రతిబంధకం కారాదు. ఒకరికొకరు స్వేచ్ఛను పంచుకోకపోతే అది సంకుచితమవుతుంది.
ఈ పాఠంలో నేర్చుకున్నవి :
1. నాకు నచ్చిన అంశం: కలలే కదా అందమైన భవితకు పునాదులు.
2. నేను గ్రహించిన విలువ : ఫలితాన్ని ఇచ్చేది అందంగా లేకపోయినా ఫలితం మాత్రం అందంగా వెలుగులు నింపుతుంది.
3. సృజనాత్మక రచన : సమదృష్టిపై స్వీయకవిత,
4. భాషాంశాలు : అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి – వికృతులు, వికృతులు, వ్యుత్పత్యర్థాలు, ఉత్వ, అత్వ, వృద్ధి సంధులు, తత్పురుష, ద్వంద్వ సమాసములు, సంక్లిష్ట వాక్యాలు.
గేయ భాగాలు-అర్థాలు-భావాలు :
1. కన్నొకటే నలుపు – కంటిచూపు నలుపు కాదు
చెట్టొకటే నలుపు – చెట్టు కాపు నలుపు కాదు
అర్థాలు :
- కన్ను = నయనము
- నలుపు = నల్లరంగు
- కంటిచూపు = దృష్టి
- వృక్షము = చెట్టు
భావం : కన్ను అంటే కంటిలోని నల్లగుడ్డు నల్లగా ఉంటుంది. మన కంటిచూపుకు ఆ నల్లగుడ్డ ప్రధానం. కానీ దాని ద్వారా చూసే చూపు నలుపు కాదు. అంటే మన కంటిచూపులో జాలి, సహాయం చేసే గుణం ఓదార్పు కనబడాలి. చెట్టు కూడా ముదర ఆకుపచ్చ రంగులో ఉండటం వల్ల దూరానికి నల్లగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆ చెట్టు కాయలు, పూలు, పండ్లు రకరకాల రంగులలో కన్పిస్తూ చూసేవారికి ఆనందం కలిగిస్తాయి.
2. చినుకు స్పర్శకే కదా నేలకడుపు పండేది
మబ్బొకటే నలుపు – మబ్బు చినుకు నలుపు కాదు.
అర్థాలు :
- చినుకు = వానచుక్క
- స్పర్శ = తాకిడి
- నేల = భూమి
- కడుపు = ఉదరము
- మబ్బు = మేఘము
భావం: వాన చినుకు తాకితేనే నేలకు కడుపు పండుతుంది. కడుపు పండడం అంటే సంతానం కలగటం, నేలకు కడుపు పండడం అంటే నేలమీద ఉన్న విత్తనాలు మొలకెత్తడం. పంటలు పండడం, నేలంతా సస్యశ్యామలం కావడం. దీనికంతటికి కారణమైన వాన చినుకులను ఇచ్చేది మాత్రం నల్లని మేఘం. మేఘం యొక్క రంగు నలుపు రంగు అయినా అది లోకానికి చేసే మేలు అపారమయినది.
3. చరుపు తగిలితే కదా నిదుర మత్తు వొదిలేది
అక్షరమే నలుపు – దాని చరుపు నలుపు కాదు
అర్థాలు :
- చరుపు = చేతిదెబ్బ
- నిదుర = నిద్ర
- మత్తు = మైకం
- చదువు = విద్య
భావం: నిద్రమత్తు అజ్ఞానానికి సంకేతం, బద్ధకానికి గుర్తు. బద్ధకం, అజ్ఞానం వదలాలంటే ఎదురుదెబ్బ తగలాలి. ఎదురుదెబ్బ ఛెళ్ళున తగిలితే బద్దకం, అజ్ఞానం వదులుతాయి. బద్ధకాన్ని, అజ్ఞానాన్ని వదిలించే జ్ఞానాన్నిచ్చేది చదువు మాత్రమే. పుస్తకంలో అక్షరాలు నల్లగా ఉంటాయి. కానీ, చదువు మాత్రం నల్లగా ఉండదు. జ్ఞానం, దానివలన వచ్చే కీర్తి ప్రకాశవంతంగా ఉంటాయి. మనకు చదువు ప్రధానం కానీ అది నేర్పే గురువుగారి శారీరక నిర్మాణంతో పనిలేదు.
4. అరిచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు
గొంతొకటే నలుపు దాని అరుపు నలుపు కాదు
అర్థాలు :
- అరుపు = కేక
- పిలుపు = రమ్మని ఆహ్వానం
- తూర్పు = ప్రాగ్దిశ
- తలుపు = కవాటం
- గొంతు = కంఠధ్వని
భావం: తూర్పు తలుపు తెరుచుకోవడం అంటే చీకటి పటాపంచలు కావడం, చీకటి అంటే మోసం, అజ్ఞానం, దోపిడీ మొదలైనవి. ఇవన్నీ పోవాలంటే గొంతెత్తాలి, నినాదాలు చేయాలి. హక్కులు సాధించుకోవాలి. ఇవన్నీ చేయవలసినది కష్టపడి పనిచేసేవారు. ఎండనక, వాననక పని చేసేవారు సాధారణంగా నల్లగానే ఉంటారు. నినాదాలు చేసేవారి గొంతు రంగు నలుపు కాని, వారు సాధించే హక్కులు అనే సూర్యోదయం తెలుపే కదా !
5. కలలే కదా అందమైన భవితకు పునాదులు
రేయి ఒకటి నలుపు – రేయి కలలు నలుపు కాదు
అర్థాలు :
- కల = స్వప్నం
- భవిత = భవిష్యత్తు
- పునాది = ప్రారంభం
- రేయి = రాత్రి
భావం : కలలు అంటే ఊహలు అది సాధించాలి, ఇది సాధించాలి అనే ఆలోచనలే కలలు ఆ కలలే భవిష్యత్తుకు పునాదులు. రేపు ఒక గొప్పదానిని సాధించాలి అంటే ఈ రోజు దాని గురించి బలమైన కల కనాలి. రాత్రి నిద్రలో కూడా కలలు వస్తాయి. పగలు మెలకువగా ఉన్నప్పుడేవి సాధించాలని ఊహిస్తామో అవే కలలుగా వస్తాయి, కలలు తెచ్చే రాత్రి నలుపు కాని కలలు నలుపు కావు..
6. ఎదురీతకు దిగావో నదికోతలు తప్పవు
ఈత ఒకటే నలుపు – ఈత గెలుపు నలుపు కాదు
అర్థాలు :
- ఈత = నీటిపై తేలుతూ ముందుకు వెళ్లడం
- ఎదురీత = నీటి ప్రవాహానికి ఎదురుగా ఈదడం
- నదీకోత = నదీ ప్రవాహం యొక్క అడ్డంకి
- గెలుపు = విజయం
భావం : నదీ ప్రవాహానికి ఎదురీదడం చాలా కష్టం. ప్రవాహవేగం బలంగా వెనుకకు నెడుతుంటే, దానిని ఎదిరించి బలంగా ముందుకు వెళ్లాలి. ఈత నలుపు అంటే ఒకటే భరించడం కష్టం, కానీ గెలుపులో ఆనందం ఉంటుంది.
7. పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా
కులమొకటే నలుపు – నీ పరుగు నలుపు కాదు
అర్థాలు :
- పరుగు = పరువు
- వెలితి = ఖాళీ, లోటు
- పూడ్చడం = కప్పడం
- మిత్రుడు = స్నేహితుడు
- కులం = వంశం
భావం : ఓ స్నేహితుడా ! పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలం. అంటే అభివృద్ధికి ప్రయత్నిస్తేనే బ్రతుకులోని లోటును పూడ్చుకోగలం. నాది ఆ కులం, నీది ఈ కులం అనే భావనతో ఉంటే అభివృద్ధి జరగదు. కులం అనే భావన నలుపు కానీ అభివృద్ధికి చేసే ప్రయత్నం నలుపు కాదు.
వ్యాకరణంపై అదనపు సమాచారం :
పర్యాయపదాలు:
- కన్ను = నయనము, నేత్రము
- నలుపు = నీలము, కాలము
- కంటిచూపు = దృష్టి, ఈక్షణము
- చెట్టు = వృక్షము, తరువు
- చినుకు = తొలకరించు, తొలుకు
- స్పర్శ = తాకుట, ముట్టుకొనుట
- నేల = భూమి, అవని
- కడుపు = గర్భము, ఉదరము
- మబ్బు = మేఘము, పయోధరము
- చరుపు = దెబ్బ, ఆఘాతము
- అరుపు = కేక, బొబ్బ
- నిదుర = నిద్దుర, నిద్ర
- మత్తు = మైకము, నిఫా
- అక్షరము = అక్కరము, వర్ణము
- చదువు = విద్య, అధ్యయనం
- పిలుపు = ఆహ్వానం, ఆమంత్రణము
- తూర్పు = తూరుపు, తొలిదిక్కు
- తలుపు = కవాటం, పలుగాడి
- గొంతు = కంఠము, గొంతుక
- కల = స్వప్నము, స్వాపము
- అందము = సొగసు, సౌందర్యము
- భవిత = భవిష్యత్తు, భావి
- పునాది = అడుగుమట్టు, కడగాలు
- రేయి = రాత్రి, రాతిరి
- ఈత = నీరాట, నీరాటము
- నది = ఆపగ, ఏరు
- గెలుపు = విజయం, జయం
- పరుగు = పరువు, పర్వు
- బతుకు = బ్రతుకు, జీవితం
- వెలితి = లోటు, ఖాళీ
- మిత్రుడు = స్నేహితుడు, చెలికాడు
- కులము = అన్వయము, గోత్రము
నానార్ధాలు :
- కన్ను= నయనము, రథము
- దృష్టి = చూపు, అభిప్రాయం
- నలుపు = నీలము, దోషము
- చెట్టు = గుల్మము, వృక్షము
- చినుకు = వర్షబిందువు, నీటిటొట్టు
- స్పర్శ = తాకుట, వాయువు
- నేల = భూమి, ఏదేశము
- కడుపు = ఉదరము, సంతతి
- మబ్బు = మేఘము, అజ్ఞానము
- మత్తు = మదము, మైకము
- అక్షరం = అక్కరము, పరబ్రహ్మము
- చదువు = పఠించు, పలుకు
- గొంతు = కంఠము, కంఠధ్వని
- కల = స్వప్నము, లావణ్యము
- పునాది = మూలబంధము, ఆధారము
- పరుగు = తీవ్రగమనము, ఫ్లతము
- మిత్రుడు = సూర్యుడు, స్నేహితుడు
- కులము = వంశము, శరీరము
ప్రకృతులు – వికృతులు :
- నిద్ర – నిదుర
- అక్షరము – అక్కరము
- రాత్రి – రేయి, రాతిరి
- కులము – కొలము
- నల్లన – నైల్యము
- మభత్ – మబ్బు
- కంఠము – గొంతు
- మిత్రుడు – మిత్తుడు
వ్యుత్పత్యర్థాలు :
- దృష్టి = దీని చేత చూచుదురు – కన్ను
- స్పర్శ = స్పృశించచబడునది
- అక్షరం = నాశనం లేనిది
- మిత్రుడు = స్నేహించువాడు – సఖుడు
సందులు :
ఉత్వసంధి :
- కన్నొకటి = కన్ను + ఒకటి
- చెట్టొకటీ = చెట్టు + ఒకటి
- మట్బొకటి = మబ్బు + ఒకటి
- అక్షరమే = అక్షరము + ఏ
- గొంతొకటి = గొంతు + ఒకటి
- అందమైన = అందము + ఐన
- ఎదురీత = ఎదురు + ఈత
- కులమొకటే = కులము + ఒకటే
ఇత్వసంధి :
- ఒకటే = ఒకటి + ఏ
- స్పర్శకే = స్పర్శకు + ఏ
- పిలవనిదే = పిలవనిది + ఏ
సమాసాలు :
సమదృష్టి = సమమైన దృష్టి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
తూర్పు తలుపు = తూర్పు అనెడు తలుపు – రూపక సమాసం
నిదురమత్తు = నిదుర వలన మత్తు – పంచమీ తత్పురుష సమాసం
నదికోత = నది వలన కోత – పంచమీ తత్పురుష సమాసం
కంటిచూపు = కన్ను యొక్క చూప – షష్ఠీ తత్పురుష సమాసం
నేలకడుపు = నేల యొక్క కడుపు – షష్ఠీ తత్పురుష సమాసం
కవి పరిచయం :
పేరు : పైడి తెరేష్ బాబు
జననం : ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో
తల్లిదండ్రులు : సుబ్బమ్మ, శాంతయ్య
రచనలు : అల్పపీడనం, హిందూ మహాసముద్రం వంటివి
ప్రత్యేకతలు : కవి, గాయకుడు, సాహితీవేత్త, ఆకాశవాణిలో వ్యాఖ్యాత
జీవనకాలం : 1963 నుండి 2014
ఉద్దేశం :
పైపై మెరుగులు చూసి మోసపోకూడదు. రంగులు వర్ణాన్ని బట్టి గాక గుణాన్ని బట్టి గౌరవించడం నేర్చుకోవాలి. మానవులందరి పట్ల సమాన భావంతో ఉండాలనేది విద్యార్థులకు అలవాటు చేయాలనేదే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.
ప్రక్రియ – గజిల్
గజల్: అనే పదం గజాల్ అనే పదం నుండి పుట్టింది. ఇది ఉర్దూ సాహిత్య ప్రక్రియ. దానిని తెలుగు సాహిత్యంలోకి తెచ్చుకొన్నాం. అరబ్బీ భాషలో గజల్ అంటే రాగాలాపన అని అర్థం. లయాత్మకమైన నడకతో స్వేచ్ఛగా భావాన్ని ప్రకటించడానికి ఉపయోగపడే సాహిత్య ప్రక్రియ గజల్. ఇందులో భావం ఎక్కువ, పదాలు తక్కువ, భావం ఏ చరణానికి ఆ చరణమే ఉంటుంది. పల్లవిని మాల్లొ అంటారు. చరణాన్ని మక్తా అంటారు. అంత్యప్రాస ఉంటుంది. కవి ముద్ర ఉంటుంది. దీనినే ‘తఖల్లస్’ అంటారు.