Access to the AP 10th Class Telugu Guide 6th Lesson ప్రకృతి సందేశం Questions and Answers are aligned with the curriculum standards.
ప్రకృతి సందేశం AP 10th Class Telugu 6th Lesson Questions and Answers
చదవండి ఆలోచించి చెప్పండి.
సీ. కోడి కుంపటి దింపుకొని పిల్లలను బిల్చి
కొసరి గింజియలేరుకొనుట నేర్పు
ఈని యీనకమున్నె మృగభామ పిల్లకు
వెనువెంట చెంగులు బెట్ట నేర్పు
ముందుబుట్టిన తీవె పందిరి కెగబ్రాకి
పసితీవియకు వెంట బ్రాక నేర్పు
నడువనేర్చిన బిడ్డ బుడతతమ్మునిఁ బ్రేమ
నడుగులో నడుగు లేయంగ నేర్పు.
తే.గీ. ప్రకృతి సర్వంబు నీ గురుత్వంబునందు
లీనమై యున్నయది నీవులేని సీమ
దీపమెత్తని వ్యర్థ మందిరము సుమ్ము
ప్రాభవంబోయి నీనోటి వాక్యమునకు.
– గుఱ్ఱం జాషువా (ఖండకావ్యం)
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ఫై పద్యంలో కవి ఏం చెబుతున్నారు ?
జవాబు:
పై పద్యంలో కవి గురువు గొప్పదనాన్ని చెబుతున్నాడు. ప్రకృతిలోని సమస్తం గురుత్వంలో లీనమై ఉందని కవి వివరిస్తున్నాడు.
ప్రశ్న 2.
ఫ్రక్రతి ద్వారా మనం ఏ ఏ విషయాలు నేర్చుకోవచ్చు ?
జవాబు:
ప్రకృతిలోని అన్ని ప్రాణుల సమూహంలో గురుత్వం ఇమిడి ఉంటుంది. కోడి తన పిల్లలకు గింజల్ని ఏరుకుని తినడం నేర్పుతుంది. జింక అప్పుడే పుట్టిన తన పిల్లకు గంతులెయ్యడం నేర్పుతుంది. తీగ తను పందిరి పైకి పాకుతూ తర్వాత పుట్టిన తీగలకు ఎదగడానికి ఆలంబనగా నిలుస్తుంది. నడక నేర్చిన పిల్లవాడు తన తమ్ముడికి నడవడం నేర్పిస్తాడు. ఈ విధంగా పరిశీలిస్తే ప్రకృతిలోని సమస్తంలో గురుత్వం ఉందనే విషయం నేర్చుకోవచ్చు.
ప్రశ్న 3.
విశ్వానికి గురువుగా దేనిని భావిస్తాము ?
జవాబు:
సమాజంలో గురువు పాత్ర విశిష్టమైంది. విద్యార్థులకు జ్ఞానాన్ని పంచి, వారి పురోభివృద్ధికి గురువు నిరంతరం కృషి చేస్తాడు. గురువులేని ప్రాంతం శిథిలమైన ఆలయం వంటిది. సద్గురువు మాటకు ఈ లోకంలో ఎంతో విలువ ఉంటుంది. ఈ విశ్వంలోని ప్రకృతి గురుత్వంతో నిండి ఉంది కనుక ప్రకృతిని మనం విశ్వానికి గురువుగా భావిస్తాము. ఈ గురుత్వమే విశ్వానికి గురువుగా భావించవచ్చు.
అలోచించండి – చెప్పండి :
ప్రశ్న 1.
ఐక్యతను చెప్పేవి ఏవి ?
జవాబు:
ఆకాశంలో తమను తాము మరచి తిరుగుతున్న అందమైన మేఘాలు పర్వత శిఖరాలను ఆలింగనం చేసుకుంటున్నాయి. ఆ కొండ కోనలలో అందంగా, నిండుగా పూలతో నిండిన తీగలు అక్కడి చెట్లను అల్లు కుంటున్నాయి. ఈ విధంగా మేఘాలు, పూలతీగలు ఐక్యతను చాటి చెబుతున్నాయి.
ప్రశ్న 2.
అనురాగ సందేశాల వలన ప్రయోజనం ఏమిటి ?
జవాబు:
ఆకుపచ్చని రెక్కలు విప్పి, ఆకాశంలో విహరించే రామ చిలుకలు ఆకాశానికి కొత్త కాంతినిస్తున్నాయి. లకుముకి పిట్టల జంట అన్యోన్యంగా, అనురాగంతో కొండలపై విహరిస్తూ మనకు అనురాగ సందేశాన్ని ఇస్తున్నాయి.
ఈ అనురాగ సందేశం వలన మనకు ఎంతో ప్రయోజనం ఉంది. మానవులంతా పరస్పరం ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండడమే మనకు ఎంతో ప్రయోజనం.
ప్రశ్న 3.
సమత మమతలు అనగా ఏమి ?
జవాబు:
సమత అంటే సమానత్వం. మమత అంటే ప్రేమాను రాగాలు. మతాలన్నీ సమత, మమతలు ప్రబోధిస్తున్నాయి. వీటికోసం అందరం కట్టుబడి ఉండాలి.
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
క్రమశిక్షణ అంటే ఏమిటి ?.
జవాబు:
జీవితంలో నిబద్దత కలిగి, నియమాలను పాటిస్తూ నడచుకోవడమే క్రమశిక్షణ. చేసే పనిలో సోమరితనం వదలి కష్టపడాలి. చీమలబారు ఎంతో క్రమశిక్షణతో ఆహారం సేకరించి, కూడబెట్టుకోవడం మనం గమనిస్తాం.
ప్రశ్న 2.
సమానత్వం కోసం మనం ఏం చేయాలి?
జవాబు:
ఏ సమాజంలోనైనా వారు చేసే పనిని బట్టి, వారు నడచుకునే విధానాన్ని బట్టి వారికి ప్రత్యేక అధికారం, గౌరవం ఏర్పడుతుంది. సమాజం మనుగడ కోసం అందరూ కలసి మెలసి పని చేయాలి. ప్రతి ఒక్కరు ఇతరులను గౌరవించాలి. కార్మికులు, కర్షకులు, ఇతర బడుగు జీవులను ఆదరించాలి. వారి కష్టాన్ని గుర్తించాలి. అందరం మానవులమే అని, మంచితనం, మానవత్వమే మన లక్ష్యమని భావించాలి. పక్షులకు, ఇతర ప్రాణులకు లేని కుల, మత వివక్ష విడనాడాలి. సమసమాజ స్థాపన జరగాలంటే మనిషి మనీషిగా ప్రవర్తించాలి.
అవగాహన-ప్రతిస్పందన
అ) కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
ఇవి చేయండి :
ప్రశ్న 1.
గేయ కవితను రాగయుక్తంగా పాడండి.
జవాబు:
ఉపాధ్యాయుడు పాడి విన్పించిన తర్వాత ఆయనను అనుసరించి పాడటానికి ప్రయత్నించాలి.
ప్రశ్న 2.
మానవుడికి సందేశమిచ్చినవి ఏవి ?
జవాబు:
పర్వత సానువుల్లోని అద్దాల వంటి నిర్మలమైన సరస్సులలో విచ్చుకుంటున్న తామరలు తుమ్మెదలకు సంతోషాలను పంచుతున్నాయి. వసంత కాలంలో ఆశగా తిరుగుతున్న కోకిలలకు మామిడి చెట్లు లేత మావిచిగురులను అందిస్తున్నాయి. ఇవి ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి.
ఆకాశంలో తమని తాము మరచి తిరుగుతున్న అందమైన మేఘాలు పర్వత శిఖరాలను కౌగిలించుకుంటున్నాయి. కొండ కోనలలో నిండుగా పూలు పూచిన తీగలు చెట్లను అల్లుకుంటున్నాయి. ఇవి మానవులంతా ఐకమత్యంతో ఉండాలని గొప్ప ఉపదేశాన్ని ఇస్తున్నాయి.
మన్మథుడి వాహనమైన రామచిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఎగురుతూ ఆకాశమనే స్త్రీ కన్నులలో కాంతి నింపుతున్నాయి. అన్యోన్యమైన లకుముకి పిట్టల జంట అనురాగంతో గుసగుసలాడుతూ కొమ్మలపై నివసిస్తున్నాయి. ఇవి పరస్పరం ప్రేమానురాగాలతో జీవించాలని ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాయి.
మబ్బు పట్టిన వేళ ఆనందంతో నెమళ్ళు పురివిప్పి నాట్యమాడుతున్నాయి. కొండలపైనుండి దూకుతూ మలుపులు తిరుగుతూ, వయ్యారంగా సాగే సెలయేటి కన్యలకు చిరుగాలులు ఆటపాటలు నేర్పుతున్నాయి. ఇవి ఈ మనుషులంతా స్వేచ్ఛ, సమత, మమతలతో సాగిపోవాలని సందేశాన్నిస్తున్నవి.
ప్రశ్న 3.
కవి గిరిదరీ సరోవరాలను దేనితో పోల్చాడు ?
జవాబు:
కవి గిరిదరీ సరోవరాలను అద్దాలతో పోల్చాడు.
ఆ) కింది పద్యాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
పృధ్వీ, ధరణి, వసుధ, ధాత్రి ఇలా ఎన్నో పేర్లతో పిలవబడే భూమి ఒక్కటే జీవరాశి మనుగడకు అనువైనది. ప్రకృతి భూమిలో ఒక భాగం. “ప్రకృతిని కనుగొనడం, ప్రకృతి ద్వారా నేర్చుకోవడమంటే మనల్ని మనం కనుగొనడమే” అని అంటారు మాగ్జిమ్ లగాకె. ప్రకృతి మన చుట్టూ ఉన్న మొత్తం భౌతిక ప్రపంచం. ఇందులో వాతావరణం, వృక్షజాలం, నదీ ప్రవాహాలు, ఆకాశాన్ని తాకే పర్వతాలు, అందమైన లోయలు, జలపాతాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం, చీకటి, వెన్నెల ఇలా ఆశ్చర్యపరిచే దృశ్యాలెన్నో ఉన్నాయి.
ప్రకృతి తల్లియై జీవరాశి మనుగడ కోసం గాలి, నీరు, ఆహారం, ఆవాసం, ఎండ, వాన, మొదలైన వాటన్నింటిని సమకూర్చి సకల ప్రాణులను పోషిస్తోంది. గురువై మార్గదర్శనం చేస్తుంది. ప్రకృతికి వెన్నెముక వృక్షాలు. ఇవి లేకపోతే ప్రకృతికి సౌందర్యముండదు. వర్షించే మేఘం కానరాదు. గలగల పారే నదులుండవు. పండే పంటలు ఉండవు. ఇలాంటి వృక్షాలను మనం కాపాడితే, అవి మనల్ని కాపాడుతాయి. అందుకే పెద్దలు “వృక్షో రక్షతి రక్షితః” అన్నారు.
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
మాగ్జిమ్ లగాకె ప్రకృతి గురించి ఏం చెప్పారు ?
– ప్రకృతి వ్యాసావళి
జవాబు:
ప్రకృతిని కనుగొనడం, ప్రకృతి ద్వారా నేర్చుకోవడమంటే మనల్ని మనం కనుగొనడమే అని మాగ్జిమ్ లగాకె అన్నారు.
ప్రశ్న 2.
ప్రకృతిలో ఏయే దృశ్యాలు ఉన్నాయి ?
జవాబు:
ప్రకృతిలో వాతావరణం, వృక్షజాలం, నదీ ప్రవాహాలు, ఆకాశాన్ని తాకే పర్వతాలు, అందమైన లోయలు, జలపాతాలు,
సూర్యోదయం, సూర్యాస్తమయం, చీకటి, వెన్నెల ఇలా ఎన్నో ఆశ్చర్యపరిచే దృశ్యాలెన్నో ఉన్నాయి.
ప్రశ్న 3.
పై గద్యంలోని సూక్తిని గుర్తించండి.
జవాబు:
పై గద్యంలోని సూక్తి “వృక్షో రక్షతి రక్షితః”.
ప్రశ్న 4.
పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
వృక్షాల వల్ల ఉపయోగం ఏమిటి ?
ఇ) కింది వచన కవిత చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
గలగల పారే సెలయేళ్ళు
మిలమిల మెరిసే తారకలు
అందమైన పూదోటలు
హాయి గొలిపే పిల్ల తెమ్మెరలు,
ఎగిసిపడే కడలి కెరటాలు
సాగిపోయే నీలిమేఘాలు
కోయిల పాటల వసంతాలు
మట్టి వాసనల వర్షాలు,
కొండల్లో దూకే జలపాతాలు
కోనల్లో కొలువైన అందాలు
ఎ ఎన్నెన్నో అందాలు ఎన్నెన్నో అద్భుతాలు – ఇవి
మనకోసం
ప్రకృతి ప్రసాదించిన వరాలు
మనిషి కోరికలకు
అవుతున్నాయి ప్రకృతి వినాశకాలు,
ప్రకృతిని రక్షించకపోతే !
మనిషి మనుగడ సాధ్యమవునా ?
– ప్రకృతి కవితా సంకలనం
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
పై కవితలో కవి ఏయే జలవనరులు గురించి వర్ణించాడు ?
జవాబు:
పై కవితలో కవి సెలయేరులు, నీలిమేఘాలు, వర్షాలు, జలపాతాలు మొదలగు జలవనరుల గురించి వర్ణించాడు.
ప్రశ్న 2.
ప్రకృతి మనిషికి ప్రసాదించిన వరాలు ఏవి ?
జవాబు:
ప్రకృతి మనిషికి పూదోటలు, పిల్లతెమ్మెరలు, కోయిలలు, కోనల్లో కొలువైన అందాలు మొదలైన వరాలు ప్రసాదించింది.
ప్రశ్న 3.
మనిషి కోరికల వలన ఏం జరుగుతోంది ?
జవాబు:
మనిషి కోరికల వలన ప్రకృతి వినాశనం చెందుతోంది.
ప్రశ్న 4.
కవిత ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
నేటి మానవుడు ప్రకృతిని రక్షించాల్సిన విధమెట్టిది ?
ఈ) కింది వానికి అర్థ సందర్భములు రాయండి.
ప్రశ్న 1.
పొరుగు వారికి పంచిపోవు తేనీగలు.
జవాబు:
పరిచయము : ఈ వాక్యము యమ్మనూరు చిన వెంకటరెడ్డి రచించిన వీరి సమగ్ర సాహిత్యం నుండి గ్రహింపబడిన
“ప్రకృతి సందేశం” అను పాఠంలోనిది.
సందర్భము : తేనెటీగలు కష్టపడి సంపాదించిన తేనెను మానవులకే పంచిపెడుతున్నాయని చెప్తూ వాటిని త్యాగజీవులని వివరిస్తూ కవి పలికిన సందర్భంలోనిది ఈ వాక్యం.
భావము : తేనెటీగలు తాము తెచ్చిన తేనెను పొరుగువారికి పంచుతున్నాయని భావము.
ప్రశ్న 2.
సమతకై పోరాడగా ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా.
జవాబు:
పరిచయము : ఈ వాక్యము యమ్మనూరు చిన వెంకటరెడ్డి రచించిన వీరి సమగ్ర సాహిత్యం నుండి గ్రహింపబడిన
“ప్రకృతి సందేశం” అను పాఠంలోనిది.
సందర్భము : రేయనక, పగలనక కాయకష్టం చేసే కార్మికులు, కర్షకుల సమైక్యతను వివరిస్తూ కవి పలికిన సందర్భంలోనిది ఈ వాక్యం.
భావము : శాంతి సౌఖ్యాలు నింపేందుకు సమైక్యతకై పోరాడారని భావము.
ఉ) కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
చీమల నుండి మనం ఏం నేర్చుకోవాలి ?
జవాబు:
కష్టపడి, నష్టపడి ఐక్యమత్యంగా తిండి గింజలను చీమలు సంపాదిస్తాయి.
ప్రశ్న 2.
కార్మికులు, కర్షకులు ఎలా కష్టపడుతున్నారు?
జవాబు:
రాత్రి అనక, పగలనక కష్టపడే కార్మికులు, కర్షకులు కలసి ఈ ప్రపంచంలో సమానత్వం సాధించాలని, శాంతి, సౌఖ్యాలను నెలకొల్పాలని కోరుతున్నారు.
ప్రశ్న 3.
మతాలన్నీ ఏమి బోధిస్తున్నాయి ?
జవాబు:
ప్రజలందరికీ ప్రేమానురాగాలను పంచడానికే మతాలు పుట్టాయి.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
సహకరించుకోవడం గురించి మనకు ఏవేవి సందేశమిస్తున్నాయి ?
జవాబు:
మానవ సమాజం మనుగడ సాగించాలంటే ప్రజలందరు పరస్పరం సహకరించుకోవాలి. కులమతాలకు అతీతంగా, రాజు, బంటు, పేద, ధనిక అనే భేదాలు లేకుండా ఇతరులకు మన సహకారం అందించాలి. నిర్మలమైన సరస్సులో అప్పుడే విచ్చుకుంటున్న తామరలు తుమ్మెదలకు సంతోషాన్ని కలుగజేసి సహకరిస్తాయి. వసంతకాలంలో తోటలలో విహరిస్తున్న కోకిలలకు మామిడిచెట్లు తమ లేత చిగురులను అందించి సహకరిస్తున్నాయి. ప్రకృతి ప్రాణులకు సహకరిస్తుంది. ఈ విధంగా ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి. ఈ గొప్ప సందేశాన్ని తామరలు, మామిడిచెట్లు మనకు అందిస్తున్నాయి.
ప్రశ్న 2.
మానవుల ప్రగతికి బాటలు వేసినవి ఏవి ?
జవాబు:
కొండల మధ్య లోయలలో పుట్టి వ్యాపిస్తున్న ఎర్రని కాంతి కొమ్మలలో, రెమ్మలలో అందాలు చిందిస్తూ అరవిరిసిన పువ్వుల సువాసన ఒక కవితలా సాగిపోతూ మానవుల జీవన గమనానికి చక్కటి దారులను చూపిస్తున్నాయి.
ప్రశ్న 3.
పక్షులు మనకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నాయి ?
జవాబు:
జంతువులు, పక్షుల నుండి మనం నేర్చుకొని ఆచరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. లేలేత చిగురులు తిన్న కోకిల తన మధురమైన స్వరంతో లోకాన్ని పరవశింపజేసి, ఒకరికొకరు సహకరించుకోవాలని సందేశం ఇస్తుంది. రామ చిలుకలు ఆకాశంలో విహరిస్తూ కొత్త కాంతిని నింపుతాయి. లకుముకి పిట్టలు అన్యోన్యంగా ఉంటాయి. రామచిలుకలు, లకుముకి పిట్టల జంటలు మానవులు ప్రేమానురాగాలతో జీవించాలని సందేశం ఇస్తాయి. స్వేచ్ఛగా, అందంగా పురివిప్పి నాట్యమాడే నెమళ్ళు స్వేచ్ఛ, సమత, మమతలను కలిగి ఉండాలని మనకు సందేశం ఇస్తున్నాయి. ఈ విధంగా ఆకాశంలో ఎగిరే పక్షులు ప్రపంచంలో సమానత్వం, శాంతి సౌఖ్యాలను నెలకొల్పాలని మనకు సందేశం ఇస్తున్నాయి.
ఆ) కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
“ప్రకృతి సందేశం” పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
భగవంతుడు ప్రసాదించిన వరమైన ప్రకృతి మానవజాతికి ఏమి సందేశం ఇస్తున్నదో పాఠ్యభాగమాధారంగా వివరించండి.
జవాబు:
పర్వత సానువుల్లోని అద్దాల వంటి నిర్మలమైన సరస్సులలో విచ్చుకుంటున్న తామరలు తుమ్మెదలకు సంతోషాలను పంచుతున్నాయి. వసంతకాలంలో ఆశగా తిరుగుతున్న కోకిలలకు మామిడిచెట్లు లేత మావిచిగురులను అందిస్తున్నాయి. ఇవి ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి.
ఆకాశంలో తమని తాము మరచి తిరుగుతున్న అందమైన మేఘాలు పర్వత శిఖరాలను కౌగిలించుకుంటున్నాయి. కొండకోనలలో నిండుగా పూలు పూచిన తీగలు చెట్లను అల్లుకుంటున్నాయి. ఇవి మానవులంతా ఐకమత్యంతో ఉండాలని గొప్ప ఉపదేశాన్ని ఇస్తున్నాయి.
మన్మథుడి వాహనమైన రామచిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఎగురుతూ ఆకాశమనే స్త్రీ కన్నులలో కాంతి. నింపుతున్నాయి. అన్యోన్యమైన లకుముకి పిట్టల జంట అనురాగంతో గుసగుసలాడుతూ కొమ్మలపై నివసిస్తున్నాయి. ఇవి పరస్పరం ప్రేమానురాగాలతో జీవించాలని ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాయి.
మబ్బుపట్టిన వేళ ఆనందంతో నెమళ్ళు పురివిప్పి నాట్యమాడుతున్నాయి. కొండలపై నుండి దూకుతూ, మలుపులు తిరుగుతూ, వయ్యారంగా సాగే సెలయేటి కన్యలకు చిరుగాలులు ఆటపాటలు నేర్పుతున్నాయి. ఇవి ఈ మనుషులంతా స్వేచ్ఛ, సమత, మమతలతో సాగిపోవాలని సందేశాన్నిస్తున్నాయి.
ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి చీమలు కలిసికట్టుగా తిండిగింజలను సేకరిస్తున్నాయి. తేనెటీగలు ప్రతి పువ్వు నుండి తేనెను సేకరించి కూడపెట్టి ఇతరులకు పంచుతాయి. ఇవి క్రమశిక్షణ, కలిసికట్టుగా ఉండాలని, మానవాళికి చెబుతున్నాయి. కొండల మధ్య లోయలలో పుట్టి వ్యాపిస్తున్న ఎర్రని కాంతి కొమ్మలలో, రెమ్మలలో అందాలు చిందిస్తూ అరవిరిసిన పువ్వుల సువాసన ఒక కవితలా సాగిపోతూ మానవుల జీవన గమనానికి చక్కటి దారులను చూపిస్తున్నాయి.
ప్రజలందరికీ ప్రేమానురాగాలను పంచడానికే మతాలన్నీ పుట్టాయి. కానీ కొందరు కుటిల బుద్ధితో మత గ్రంథాలు చెప్పే విషయాలకు వక్రభాష్యాలు చెప్పి, ఎన్నో ఎత్తులు, జిత్తులు వేసి, మతాల మధ్య చిచ్చుపెట్టి ఎందరి చావులకో కారణమైనారు. ఇలాంటివి ఇక్కడ ఇక మీదట సాగవు. (జరగవు)
ఆకాశంలో నీలిమేఘాలకింద అందంగా ఎగిరే పక్షులు, రాత్రనక, పగలనక కష్టపడే కార్మికులు, కర్షకులు కలిసి ఈ ప్రపంచంలో సమానత్వం సాధించాలని, శాంతిసౌఖ్యాలను నెలకొల్పాలని కోరుతున్నారు.
ప్రశ్న 2.
ఐకమత్యాన్ని గురించి ఏవి ఎలా బోధిస్తున్నాయో రాయండి.
జవాబు:
ఆకాశంలో తమని తాము మరచి తిరుగుతున్న అందమైన మేఘాలు పర్వత శిఖరాలను కౌగిలించుకుంటున్నాయి. కొండ కోనలలో నిండుగా పూలు పూచిన తీగలు చెట్లను అల్లుకుంటున్నాయి. ఇవి మానవులంతా ఐకమత్యంతో ఉండాలన్న సందేశంతో బోధిస్తున్నాయి.
మన్మథుడి వాహనమైన రామచిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఎగురుతూ ఆకాశమనే స్త్రీ కన్నులలో కాంతి నింపుతున్నాయి. అన్యోన్యమైన లకుముకి పిట్టల జంట అనురాగంతో గుసగుసలాడుతూ కొమ్మలపై నివసిస్తున్నాయి. ఇవి పరస్పరం ప్రేమానురాగాలతో జీవించాలని ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాయి.
ఇ) కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
“పరితపిస్తున్న పర్యావరణం – ప్రకృతిని కాపాడుకోవలసిన తరుణం” ఈ అంశంపై ప్రసంగ వ్యాసం రాయండి.
జవాబు:
మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలే ప్రకృతి. భూమి, నీరు, గాలి మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. కనుక పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం అని అర్థం. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది. పరితపిస్తున్న పర్యావరణం రక్షింపబడుతుంది. ప్రాణులు నివసించేది నేలపైన గదా ! ఆ నేలతల్లిని సరిగా చూసుకోవాలి. ఖాళీ ప్రదేశాల్లో విరివిగా చెట్లను పెంచాలి. చెట్ల వల్ల పర్యావరణం పరిరక్షింపబడుతుంది. ఈ చెట్ల వల్ల వర్షపాతం అధికమౌతుంది. భూగర్భజలాలు పుష్కలంగా ఉంటాయి.
వివిధ కర్మాగారాలు, పరిశ్రమలు, లెక్కలేనన్ని మోటారు వాహనాలు, మురికినీరు మొదలగునవి వాతావరణ కాలుష్యాన్ని కల్గిస్తున్నాయి. కర్మాగారాలు వదిలే వ్యర్థ పదార్థాల వల్ల, నదుల జలాలు కలుషితం అవుతున్నాయి. దానితో జలకాలుష్యం ఏర్పడుతోంది. వాహనాల ధ్వనులతో ధ్వని కాలుష్యం ఏర్పడుతోంది. అందువల్ల చెట్ల పెంపకమే వీటన్నింటినీ నివారించి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
ప్రశ్న 2.
ప్రకృతిలో మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని వర్ణిస్తూ రాయండి.
జవాబు:
కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో శ్రీరంగపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మూడువైపులా పచ్చని పంట పొలాలు. ఒక వైపున కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గ్రామం దరిదాపుల్లో అద్భుతమైన ఒక సరోవరం ఉంది. అందులో సువాసనలను వెదజల్లే పద్మాలున్నాయి. ఆ సరోవరం చుట్టూ పండ్లను ప్రసాదించే చెట్లున్నాయి. అక్కడక్కడ పొదరిల్లు. ఆ చెట్ల నీడన అనేక జంతువులు, మనుషులు సేద తీరుతూంటారు. ఆ చెట్లపై అనేక పక్షులు నివసిస్తూ కిలకిలా రావాలతో మారుమ్రోగుతుంటాయి. ప్రతిరోజూ ఉదయాన్నే కోవెలలో సుప్రభాత గీతికలతో ప్రతిధ్వనిస్తూ గంటలు మారుమ్రోగుతుంటాయి. అనేక ఆవుల మందలు గుంపులు గుంపులుగా బీళ్ళకు వెడుతుంటాయి. రకరకాల పుష్పాల సువాసనలతో ఆ ప్రాంతమంతా నిండిపోతుంది.
భాషాంశాలు
పదజాలం
అ) కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి, సొంతవాక్యాలు రాయండి.
1. పిల్లలు ముకురం ముందు నిలబడి ముస్తాబవుతున్నారు.
ముకురం = అద్దం
సొంతవాక్యం : మా యింట నిలువెత్తు అద్దం ఉంది.
2. పికము పంచమ స్వరంలో పాట పాడింది.
పికము = కోయిల
సొంతవాక్యం : వసంతం రాగానే కోయిల పదే పదే కూస్తుంది.
3. పురివిప్పిన నెమ్మి ఎంత అందంగా ఉందో !
నెమ్మి = ప్రేమ
సొంతవాక్యం : తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రేమతో పెంచుతారు.
4. మానస సరోవరం హిమాలయాల్లో ఉంది.
సరోవరం = కొలను
సొంతవాక్యం : మా గ్రామంలో పెద్ద కొలను ఉంది.
5. మల్లెల నెత్తావి తోట అంతా వ్యాపించింది.
నేత్తావి = అధికమైన సువాసన
సొంతవాక్యం : అధికమైన సువాసనతో మల్లెలు విరబూసాయి.
ఆ) కింది వాక్యాలు చదివి పర్యాయ పదాలు గుర్తించి రాయండి.
ప్రశ్న 1.
తోటలో పుష్పాలు వికసించాయి. అమ్మ ఆ కుసుమాలను సేకరించింది. విరులను దండగా కూర్చింది.
జవాబు:
పుష్పాలు, కుసుమాలు, విరులు
ప్రశ్న2.
రజని ధరణి అంతా కమ్ముకున్నది. రాత్రికి రాజైన చంద్రుడు తన వెలుగులతో రేయిని పగలుగా మార్చాడు.
జవాబు:
రజని, రాత్రి, రేయి
ప్రశ్న3.
కొండలపై వృక్షాలు ఎన్నో ఉన్నాయి. వాటి వల్ల పర్వతాలకు పచ్చదనం వచ్చింది. గిరులు భూమికి అందాన్ని ఇస్తాయి.
జవాబు:
కొండలు, పర్వతాలు, గిరులు
ప్రశ్న4.
అడవులు ప్రగతికి మూలం. అరణ్యాలు లేకపోతే వర్షాలు కురవవు. అందుకే వీపినాలను కాపాడుకోవాలి.
జవాబు:
అడవులు, అరణ్యాలు, విపినాలు
ప్రశ్న5.
పిల్లలు ఆట మొదలుపెట్టారు. అందులో వారి నటన బాగుంది. వారి లాస్యము చూచి అందరూ సంతోషించారు.
జవాబు:
ఆట, నటన, లాస్యము
ఇ) కింది పదాలకు నానార్థాలు రాయండి.
1. అరుణం = ఎరుపు, కుష్టువ్యాధి, బంగారం
2. మతం = అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి
3. కొమ్మ = ప్రేమ, నెమ్మది, నెమలి
4. నెమ్మి = ప్రేమ, నెమ్మది, నెమలి
5. గగనం = ఆకాశం, శూన్యం, దుర్లభం
ఈ) కింది పదాలకు వ్యుత్పత్యర్థాలు రాయండి.
1. పికం = చాటు నుండి కూయునది (కోయిల)
2. అచలము = చలనము లేనిది (పర్వతము)
3. పయోధరం = ఉదకమును ధరించునది (మేఘం)
4. సమరం = మరణంతో కూడినది (రణరంగం)
ఉ) కింది పట్టికలో ప్రకృతి, వికృతి పదాలు ఉన్నాయి. వీటిని గుర్తించి రాయండి.
1. మేఘాలు ఆకాశంలో విస్తరించాయి. మొగులు కురిస్తేనే పంటలు పండుతాయి.
2. కూచిపూడి నాట్యం ప్రసిద్ధ నట్టువలలో ఒకటి.
3. లతకు కవితలంటే ప్రాణం. ఆమె కయితలు వినడానికి ఇష్టపడుతుంది.
4. మా ఊరిలో సంక్రాంతి వేడుకలు సంభ్రమము గొల్పునట్లు జరిగాయి. అందరూ ఆ సంబరములలో పాల్గొన్నారు.
ప్రకృతి – వికృతి
1. మేఘాలు – మొగులు
2. నాట్యము – నట్టువ
3. కవిత – కయిత
4. సంభ్రమము – సంబరము
సంధులు:
వ్యాకరణాంశాలు
అ) కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
1. మతములన్ని : మతములు + అన్ని = ఉత్వసంధి
2. పూదేనె : పూవు + తేనె =ప్రాతాదిసంధి
3. లతాళి : లత + ఆళి = సవర్ణదీర్ఘ సంధి
4. కొలువైన : కొలువు + ఐన = ఉత్వసంధి
పడ్వాది సంధి
1. భయము + పడు = భయపడు, భయంపడు, భయముపడు
2. కష్టము + పడు = కష్టపడు, కష్టంపడు, కష్టముపడు
3. ఇష్టము + పడు = ఇష్టపడు, ఇష్టంపడు, ఇష్టముపడు
4. సందేహము + పడు = సందేహపడు, సందేహంపడు, సందేహముపడు
పై ఉదాహరణలు గమనించండి. పై వానిలో మొదటి పదం చివర ‘ము’ వర్ణం ఉంది. రెండో పదంగా ‘పడు’ ఉంది. పదాలు కలిసినప్పుడు ‘ము’ వర్ణకానికి లోపం, పూర్ణ బిందువు (0) విభాషగా వచ్చాయి. ఇలా రావడాన్ని పడ్వాది సంధి అంటారు.
సూత్రం : పడ్వాదులు పరమైనప్పుడు ‘ము’ వర్ణకానికి లోప, పూర్ణ బిందువులు విభాషనగు.
సమాసం :
ఆ) కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
1. గగనకొంత : గగనమనెడి కాంత (రూపక సమాసం)
2. సమతామమతలు : సమతయును, మమతయును (ద్వంద్వ సమాసం)
3. మేఘమాలికలు : మేఘముల యొక్క మాలికలు (షష్ఠీ తత్పురుష సమాసం)
4. సుందరమేఘాలు : సుందరమైన మేఘాలు (విశేషణ పూర్వపద కర్మధారయం)
5. కుటిలబుద్ధి : కుటిలమైన బుద్ధి (విశేషణ పూర్వపద కర్మధారయం)
6. తిండిగింజలు : తిండి కొరకు గింజలు (చతుర్థీ తత్పురుష సమాసం)
7. అనురాగసాగరం : అనురాగమనెడి సాగరం (రూపక సమాసం)
బహువ్రీహి సమాసం :
కింది సమాస పదాలను, వాటి విగ్రహ వాక్యాలను పరిశీలించండి.
1. ఆజానుబాహుడు – జానువుల వరకు బాహువులు కలవాడు.
2. ముక్కంటి – మూడు కన్నులు కలవాడు.
3. చతుర్ముఖుడు – నాలుగు ముఖాలు కలవాడు.
4. పద్మాక్షి – పద్మం వంటి అక్షులు కలది.
పై పదాలలో మొదటి పదానికి గాని రెండవ పదానికి గాని ప్రాధాన్యం లేదు. రెండు పదాలు మరో పదం యొక్క అర్థాన్ని స్ఫురింపచేస్తున్నాయి. ఇలా మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసాన్ని బహువ్రీహి సమాసం అంటారు.
ఉదాహరణ : చక్రపాణి అనే సమాసపదంలో చక్రము అనే పదానికి ప్రాధాన్యం లేదు. పాణి (చేయి) అనే పదానికి కూడా ప్రాధాన్యం లేదు. చక్రము పాణియందు కలిగిన వానికి ప్రాధాన్యం ఉన్నది. ఇట్లా సమాసంలోని పదాలకు కాక మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్నది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం.
(ఇ) కింది గేంక కవితగు పరీలంంచి అలంకారాన్ని గుర్తించండి.
1. గుసగుసలతో కొమ్మకొమ్మఫై నివసించి
ముక్కులానించు లకుముకివిట్ట దంపతులు;
పై ఉదాహరణలో లకుముకి పిట్టలు కొమ్మకొమ్మ పైనా నివసిస్తూ గుసగుసలాడుతూ ముద్దాడుతున్నాయి అనే విషయాన్నే ఉన్నదున్నట్లుగా చెప్పడం జరిగింది. కాఐట్టి ఇది స్వభావోకి అలంకారం.
లక్షణం : జాతి గుణ క్రియాదులచేత దాని స్వభావాన్ని రమణీయంగా వర్ణించిన యెడల స్వభావోక్తి.
ఉడా : అతిచంచలములగు కన్నులు కలిగి, నిశ్లలములగు చెపులు కలిగిన కురంగములను చూచెను.
జవాబు:
వివరణ : ఇక్కడ కురంగ వర్ణన. కురంగ జాతి యొక్క స్వభావం సహజసుందరంగా వర్ణితమైంది. అట్లే కురంగములు చూచునప్పటి స్థితి అనగా క్రియా స్వభావం కూడా సహజ సుందరంగా వర్ణింపబడింది. కనుక ఇది స్వభావోక్తి.
కురంగము = జింక
(ఈ) స్వభావోక్తి అలంకారానికి చెందిన మరికొన్ని ఉదాహరణలు రాయండి.
ఉదా : అతిచంచలములగు కన్నులు కలిగి, నిశ్చలములగు చెవులు కలిగిన కురంగములను చూచెను.
జవాబు:
వివరణ : ఇక్కడ కురంగ వర్ణన. కురంగ జాతి యొక్క స్వభావం సహజసుందరంగా వర్ణితమైంది. అట్లే కురంగములు చూచునప్పటి స్థితి అనగా క్రియా స్వభావం కూడా సహజ సుందరంగా వర్ణింపబడింది. కనుక ఇది స్వభావోక్తి.
కురగము = జింక
ప్రాజెక్టు పని :
ప్రకృతి సౌందర్యాన్ని తెలిపే గేయాలు లేదా పాటలు, పద్యాలు సేకరించి తరగతి గదిలో ప్రదర్శించి చర్చించండి.
పాఠాంత పద్యం
1. పువ్వుల లీల
– దేవులపల్లి కృష్ణశాస్త్రి
పల్లవి : ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు
పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
అనుపల్లవి : ఎంత తొందరలే హరిపూజకు
ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ
చరణం-1
కొలువైతివాదేవి నా కోసము
తులసీదయాపూర్ణకలశీ
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి
మొల్లలివి నన్నేలు నా స్వామికి ॥ఎవరు॥
చరణం-2
ఏ లీల సేవింతు ఏమనుతు కీర్తింతు
సీత మనసే నీకు సింహాసనం
ఒక పువ్వుపాదాల ఒక దివ్వెనీమ్రోల
ఒదిగి నీ ఎదుట ఇదే వందనం ॥ఎవరు॥
2. ప్రకృతి విన్యాసం
– దేవులపల్లి కృష్ణశాస్త్రి
ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈయడవి దాగిపోనా ఎట్లైనా నిచటనే యాగిపోనా?
1. గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
జలజలని పారు సెలపాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు తేటినై
పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై
ఈయడవి దాగిపోనా ఎట్లైనా నిచటనే యాగిపోనా ? ॥ ఆకు ॥
2. తరువెక్కి యల నీలిగిరి నెక్కి మెలమెల్ల
చదలెక్కి జలదంపు నీలంబు నిగ్గునై
ఆకలా….. దాహమా ….. చింతలా ….. వంతలా
ఈ కరిణి వెర్రినై యోకతమ తిరుగాడ
ఈయడవి దాగిపోనా ఎట్లైనా నిచటనే యాగిపోనా ? ॥ ఆకు ॥
3. ఆమని
– ఆచార్య శ్రీవత్స
సీ. తరువు తరువులోన – విరుల మరుల తోడ
చివురుల జొంపమ్ము – చెలగువేళ
తుమ్మెదల తతులు – ఝుమ్మని కలహించె
గుబురుగుబురులోన – కుల్కువేళ
మావికొమ్మను జేరి – మారాకు సేవించి
పంచమశృతులతో పరవశాన
పిండు కోయిలలు వివృద్ధితో పల్కెడి
సుస్వరగీతాలు – సొబగువేళ
చైత్రుండు నవకళా చైతన్య కలకంఠి
గానామృతమున స్వాగతము పలుక
తే.గీ. ప్రకృతికాంత పరిమళించి పరగువేళ
విహగ సంహృతుల్ రవళించె గృహములందు
వెలుగ నింపగ వచ్చెను వివేక మెఱిగి
విశ్వశాంతిని కాంక్షించె వేడ్కమీర
పాఠ్యాంత పద్యం :
చల్లనివైన రాత్రుల వసంతసుఖోదయవేళ బుష్పముల్
చల్లెడు విస్ఫురత్పరిమళమ్ముల తీయదనమ్ములోన గాం
తిల్లిన కన్నులం బయికి ద్రిప్పుచు జాబిలి జూచు పిల్లలన్
మెల్లన జిన్కుగా గరిగి నిండుమనంబున ముద్దులాడెదన్
– వేంకట కాళిదాస కవులు. (మబ్బుతునక ఖండకావ్యం)
భావం : నేను తెల్లని మబ్బుతునకను. వసంతకాలంలో చల్లని వెన్నెల రాత్రుల్లో అందరికీ ఆహ్లాదం కలిగిస్తాను. పువ్వులు కమ్మని సువాసనలు వెదజల్లుతుంటాయి. చందమామను చూసి విప్పారిన కళ్ళతో కేరింతలు కొట్టే పసివాళ్ళను చూసి నేను మురిసిపోతుంటాను. నేనొక వెన్నెల చినుకుగా కరిగి పాలుగారే వాళ్ళ చెక్కిళ్ళను ప్రేమగా చుంబిస్తాను.
సూక్తి : పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి సద్యః,
పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థ మిదం శరీరమ్.
భావం : పరుల కొరకే చెట్లు పండ్లను, నదులు నీటిని, గోవులు పాలను ఇస్తున్నాయి. అదే విధంగా ఈ శరీరము పరుల మేలుకొరకే కదా !
అదనపు భాషాంశాలు :
పర్యాయపదాలు
ముకురము : అద్దము, ఆదర్శము, ఆత్మదర్శము, కర్పరము
కందరము : గుహ, కలుగు, కుహరము, గహ్వరము
సరోవరము : కొలను, కమలిని, కాసారము, తటాకము, పద్మాకరము, సరసి
విరులు : పువ్వులు, కుసుమాలు, సుమాలు
తుమ్మెద : ఇందిందిరము, భ్రమరము, ద్విరేఫము, బంభరము, భృంగము, మధుకరము
వసంతము : ఆమని, కుసుమాకరము, పికానందము, సురభి
గిరి : కొండ, నగము, పర్వతము
మంజరి : పూగుత్తి, కుచ్చు, గుంజము, గుచ్ఛము, మంజరము, మంజుల
మంజులము : మనోహరము, అన్నువ, ఇమ్ము, ఓయారము, కొమరు, పసందు, మనోజ్ఞము, రమణీయము
పికము : కోకిల, అళి, కలకంఠము, కలఘోషము, కోయిల, మధుస్వరము
ఆలింగనము : కౌగిలింత, అంకపాళి, కౌగిలి, కౌగిలింపు, పరిష్వంగము, సంశ్లేషము, హేలి
శిఖరము : ఆధిక్యత, కొపురు, కొప్పరము, కొమ్ము, గుబ్బ, ముకుటము, శేఖరము
మేఘము : అంబుదము, అంబుధరము, అంథోధరము, తోయదము, పయోధరము, వారిదము
లత : తీగ, ఛల్లి, తివ్వ, తీనియ, వల్లరి
ఆళి : సమూహము, ఉత్కరము, గుంపు, దళము, ఐృందము, సంచయము, సంహృతి
గగనము : ఆకాశము, ఆకసము, వైహాయసము, నింగి
కాంక్ష : కోరిక, అభిలాష, ఆసక్తి, కామము, కామన
కన్ను : నేత్రము, అంఐకము, నయనము, దృక్కు
వలరాజు : మన్మథుడు, అంగభవుడు, అజుడు, అనంగుడు, చైత్సఖుడు, పంచబాణుడు
లకుముకి పిట్ట : ఉత్కోషము, టిట్టిధకము, టిట్టిధము
నెమ్మి : ప్రేమ, అనుగు, అనురక్తి, ఇంపు, కూర్మి, గారాబము, ప్రీతి, ప్రేముడి, మమకారము, మమత
తెమ్మెర : గాలి, అనిలము, నింగి చూలి, మరుత్తు
కర్షకుడు : రైతు, కాపు, కృషీవలుడు, క్షేత్రకరుడు, వ్యవసాయదారుడు
శాంతి : శాంతము, ప్రశాంతము, నిరుద్వేగము, శమము
సమరము : యుద్ధము, సంగరము
కవిత : కవిత్వము, కవనము, కైత
అందము : అమరిక, ఒప్పిదము, చక్కదనము, చక్కన, మురిపెము, సౌరు, సొంపు, సొగసు, హవణిక
దీక్ష : పట్టుదల, అచలము, పట్టింపు, పంతము
నెత్తావి : పరిమళము, అధివాసము, క్రొత్తవి, గంధము, తావి, సువాసన, సౌగంధ్యము
పక్షులు : అభ్రగములు, ఖచరములు, గగన చరములు, ద్విజములు, దివౌకసములు, పతంగములు, వాజులు, శకుంతములు, సారసములు
నానార్థాలు :
ముకురము : పొగడ, అద్దము
మంజరి : పూగుత్తి, ఎఱ్ఱనేల
మంజులము : పొదరిల్లు, నాచు, మనోహరము
శిఖరము : శృంగము, కొన
మేఘము : మబ్బు, కపోలమదము
లత : తీగ, చీమ, సాలెపురుగు, కస్తూరి
ఆళి : తేలు, సమూహము
కన్ను : నేతము, కణుపు
నెమ్మి : నెమలి, సుఖము, సంతోషము, (పేమ, నిర్భయము, దయ, స్నేహము, ఆసక్తి, బండికట్టు
తెమ్మేర : గాలి, మలయమారుతము
కర్షకుడు :అంగారకుడు, రైతు
శాంతి : సుఖము, శమము, పార్వతి, సంయమము
అందము : చందము, విధము
దీక్ష : పట్టుదల, ఉపనయనము
పక్షి : విహంగము, బాణము
వ్యుత్పత్త్యర్థాలు :
- కర్షకుడు : భూమిని దున్నువాడు – రైతు
- పక్షి : రెక్కలు కలది – విహంగము
- ముకురము : దీనిచే అలంకరింపబడుదురు -అద్దము
- పికము – చాటున నుండి కూయునది – కోయిల
- వలరాజు – వలపునకు రాజు – మన్మథుడు
ప్రకృతి-వికృతులు :
- ప్రకృతి – వికృతి
- కందర – గ్రంత
- సంభ్రమము – సంబరమ
- నేము – నెమ్మి
- కన్య – కన్నె, కన్నియ
- పుష్పము – పువ్వు
- సంతోషము – సంతసము
- కవిత – కైత, కయిత
- రాత్రి – రేయి
సంధులు :
సమాసాలు :
కవి పరిచయం :
కవి : వై.సి.వి. రెడ్డి (పూర్తి పేరు యమ్మనూరు చిన వెంకటరెడ్డి)
జననం : వీరు వై.యస్.ఆర్. (కడప) జిల్లాలో బోనాల గ్రామంలో శ్రీమతి లక్ష్మమ్మ, శ్రీ కొండా రెడ్డి దంపతులకు ది. 26.03.1926లో జన్మించారు.
రచనలు : తొలకరి చినుకులు, మేనక, రంభ, సింధూర రేఖ, దక్షిణ నీలము, వైజయంతి, పారిజాతం మొదలైన కావ్యాలు, ‘గట్టి గింజలు’ కథల సంపుటి రచించారు. ప్రస్తుత పాఠ్యభాగం వీరి సమగ్ర సాహిత్యం నుండి స్వీకరించబడింది.
విశేషములు : వీరి సాహిత్యం సుకుమార భావ వ్యక్తీకరణకు, పదలాలిత్యానికి పేరు గాంచింది. వీరు పల్లె ప్రజల కష్టాలను, వ్యవసాయ జీవితాన్ని, రాయలసీమ జన జీవనాన్ని ప్రతిబింబించే రచనలు చేశారు. కొంతకాలం అభ్యుదయ రచయితల సంఘం బాధ్యులుగా కూడా వ్యవహరించారు.
ఉద్దేశం :
ప్రకృతి మానవునికి చక్కని పాఠశాల. అనాదిగా మానవుడు ప్రకృతి నుంచి ఎంతో నేర్చుకున్నాడు. నేటికీ నేర్చుకుంటున్నాడు. ప్రకృతిలోని చెట్టు, పుట్ట, ఇలా ప్రతిదీ మనిషికి ఎన్నో సందేశాలనిస్తుంది. వాటిని విద్యార్థులకు తెలియజేయడం, ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.
ప్రక్రియ – గేయం :
గేయ కవిత పాడడానికి, లయబద్దంగా చదవడానికి వీలైనది. గేయంలో లేదా గేయ కవితలో శబ్ద సంబంధమైన లయ ఉంటుంది. అందువల్ల గానయోగ్యంగా ఉంటుంది. గేయంలో మాత్రా గణాలుంటాయి. దీనిలో ఏ వస్తువునైనా వర్ణించి చెప్పవచ్చు. ‘ప్రకృతి సందేశం’ అను పాఠ్యభాగం గేయ ప్రక్రియకు చెందింది.
గేయాలు – అర్థాలు – భావాలు :
గేయం – 1
గిరిధరీముకుర కందర సరోవరములను
అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు;
వాసంతవేళ విభ్రమ కంచుకితమైన
సహకార మంజరీ సహకారములు పికము
లందించే సందేశముల్ – సంస్కృతి
సదన మంజులగానముల్
అర్థాలు :
- గిరి = కొండ
- దరి = తీరము, గట్టు
- ముకురము = అద్దము, పొగడ
- కందరము = గుహ
- సరోవరము = సరస్సు, కొలను
- అరవిచ్చువిరులు = అప్పుడే విచ్చుకుంటున్న పువ్వులు
- వాసంతం = వసంతకాలం
- మంజరి = చిగురించిన లేతకొమ్మ
- పికము = కోకిల
- కంచుకితం = కవచము కలది
- మంజుల = మనోహరము
భావం : పర్వత సానువుల్లో అద్దం వంటి నిర్మలమైన సరస్సు లున్నాయి. ఆ సరస్సులలో అప్పుడే విచ్చుకుంటున్న తామరలు తుమ్మెదలకు సంతోషం కలిగిస్తున్నాయి. వసంత కాలంలో కోకిలలు ఆశగా తిరుగుతున్నాయి. వాటికి మామిడిచెట్లు తమ లేత మావిచిగురులను అందిస్తున్నాయి. ప్రకృతి ప్రాణులకు సహకరిస్తుంది. ఇలా ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి అనే గొప్ప సందేశాన్ని ఇవి మనకు ఇస్తున్నాయి.
గేయం – 2
ఆవేశగమనలై ఆలింగనము సేసె
గిరి శిఖరముల సుందర మేఘమాలికలు;
కొండ కోనలలోన నిండుగా పుష్పించి
అల్లిబిల్లిగ చెట్లనల్లుకొన్న లతాళి
అనుశాసనము లిచ్చెరా – మధురమౌ
ఐక్యతను కాంక్షించెరా
అర్థాలు :
- మేఘ మాలికలు = మబ్బుల దొంతరలు
- లత = తీగ
- ఆళి = సమూహం, వరుస
- గమనం = వెళ్ళు, ప్రయాణం, నడక
- కాంక్ష = కోరిక
- అనుశాసనం = ఆజ్ఞ
భావం: అకాశంలో అందమైన మేఘాలు తమని తాము మరచి పోయినట్లు తిరుగుతున్నాయి. ఆ మబ్బులు పర్వత శిఖరాలపై వాలుతున్నాయి. ఆ కొండ కోనల నిండుగా పూలు పూచిన తీగలు చెట్లను ఆలంబనగా చేసుకుని అల్లుకున్నాయి. ఇవి మానవులంతా కలసి మెలసి ఉండాలని, ఐకమత్యతను చాటాలని చక్కని ఉపదేశాన్ని ఇస్తున్నాయి.
గేయం – 3
గగనకాంతకు వింతకాంతి కన్నులనింపి
పసరురెక్కల విప్పు వలరాజు తేజీలు;
గుసగుసలతో కొమ్మకొమ్మపై నివసించి
ముక్కులానించు లకుముకిపిట్ట దంపతులు;
అనురాగ సందేశముల్ – ప్రజలకై
అందించె సాకూతముల్
అర్థాలు :
- గగనకాంత = ఆకాశమనెడి కన్య
- వలరాజు తేజీ = మన్మథుని వాహనం
- సాకూతం = ఉపదేశం, సందేశం
- పసరు రెక్కలు = ఆకుపచ్చని రెక్కలు
భావం : మన్మథుడి వాహనమైన రామచిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఆకాశంలో ఎగురుతున్నాయి. అలా ఎగురుతూ ఆకాశమనే కన్నులలో కాంతి నింపుతున్నాయి. అక్కడ కొమ్మలపై లకుముకి పిట్టల జంటలు చాలా అన్యోన్యంగా గుసగుసలాడుతూ నివసిస్తున్నాయి. ఇవి మానవులంతా పరస్పరం ప్రేమానురాగాలతో జీవించాలనే మంచి సందేశాన్ని మనకు అందిస్తున్నాయి.
గేయం – 4
జరతారుణచ్ఛవులు కరిగి పోయెడి వేళ
పురివిప్పి నాట్యముల్ పోహలించెడి నెమ్మి;
పైనుండి మలకలై పారు సెలకన్నెలకు
ఆటపాటల నేర్పు అలసమౌ తెమ్మెరలు
సమయ దీక్షల నిచ్చెనూ – స్వేచ్ఛకై
సమత మమతల దెచ్చెనూ
అర్థాలు :
- జరఠ +అరుణచ్ఛవులు
- జరఠారుణచ్ఛవులు = ముదిరిన అరుణ కాంతులు
- దీక్ష = పట్టుదల
- నెమ్మి = నెమలి
- మలకలు = మెలికలు, వంకర
- తెమ్మెర = చల్లగాలి
భావం: ఆకాశంలో అందమైన మేఘాలు తమని తాము మరచి పోయినట్లు తిరుగుతున్నాయి. ఆ మబ్బులు పర్వత శిఖరాలపై వాలుతున్నాయి. ఆ కొండ కోనల నిండుగా పూలు పూచిన తీగలు చెట్లను ఆలంబనగా చేసుకుని అల్లుకున్నాయి. ఇవి మానవులంతా కలసి మెలసి ఉండాలని, ఐకమత్యతను చాటాలని చక్కని ఉపదేశాన్ని ఇస్తున్నాయి.
భావం : ఆకాశంలో మబ్బులు పట్టినవేళ నెమళ్ళు ఆనందంతో పురివిప్పి నాట్యమాడుతున్నాయి. కొండలపై నుండి దూకుతున్న సెలయేర్లు మలుపులు తిరుగుతూ, వయ్యారంగా సాగుతున్నాయి. ఆ సెలయేటి కన్యలకు చల్లని చిరుగాలులు ఆటపాటలు నేర్పు తున్నాయి. ఇవి మనుషులందరూ స్వేచ్ఛ, సమత, మమతలతో జీవించాలని సందేశమిస్తున్నాయి.
గేయం – 5
కష్టపడి నష్టపడి కలసికట్టుగ నడచి
తిండిగింజల తెచ్చితీరు చీమలబారు;
పువ్వుపువ్వున వ్రాలి పూదేనెలందెచ్చి
పొరుగు వారికి పంచిపోవు తేనీగలీ
క్రమశిక్షణల నిచ్చెనూ దీక్షతో
కలసి నడువగా చెప్పెనూ
అర్థాలు :
- చీమల బారు = చీమల పరంపరలు
- పూవు + తేనె – పూదేనె = మకరందము
- వ్రాలి = వాలిపోయి
- దీక్ష = పట్టుదల
- కలసికట్టుగ = ఒకే జట్టుగా, ఒకే విధంగా
భావం : సోమరితనం ఎరుగని చీమలు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కలసికట్టుగా తమ ఆహారాన్ని సేకరిస్తున్నాయి. తేనెటీగలు ప్రతి పువ్వు నుండి తేనెను సేకరించి కూడబెడతాయి. ఆ తేనెను ఇతరులకు పంచుతాయి. ఇవి మానవులు క్రమశిక్షణతో మెలగాలని, ఐకమత్యంగా ఉండాలని, ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయాలనే సందేశాన్ని మనకు ఇస్తున్నాయి.
గేయం – 6
కొండ నెత్తాలలో కోనలోతుల లోన
ప్రభవించి పుంజుకొని పల్లవించిన కావి
ఒక కొమ్మలోపుట్టి ఒక రెమ్మలోవిడిగి
అందాల చిందించు అరవిరుల నెత్తావి;
కదిలి పోయెను కవితలై – మానవుల
గతికి చక్కని బాటలై
అర్థాలు :
భావం: కొండల మధ్య లోయలలో ఎర్రని కాంతిపుట్టి వ్యాపిస్తుంది. ఆ కాంతి కొమ్మలలో, రెమ్మలలో అందాలు చిందిస్తూ, విచ్చుకున్న పూల సువాసనను కూడా వ్యాపింప జేస్తుంది. ఇది ఒక కవితలా సాగిపోతూ మానవ మనుగడకు చక్కటి దారులను చూపిస్తుంది.
అర్థాలు :
- నెఱ + తావి – నెత్తావి = నిండైన సువాసన
- ప్రభవించి = పుట్టి
- పల్లవం = చిగురు
- కావి = ఎరుపురంగు
- రెమ్మ = చిన్నకొమ్మ
- గతి = మార్గము, దారి
గేయం – 7
సర్వులకు అనురాగసార మందింపగా
మతము లన్నియు ఒక్క మమతకై పుట్టినవి
కుటిలబుద్ధులు కొంద రిటుబల్కి అటుబల్కి,
సమరాలు కల్పించి చంపినారిదివరకు
సాగిపోయిన జిత్తులూ – యికపైన
సాగనీయము ఎత్తులూ
అర్థాలు :
- సర్వులు = అందరు
- సమరము + లు – సమరాలు = యుద్ధాలు
- కుటిలబుద్ధులు = దుర్మార్గమైన మనస్సు కలవారు
- జిత్తులు = మోసాలు
భావం : మతాలనేవి ప్రజలందరికీ ప్రేమానురాగాలను పంచడానికే పుట్టాయి. కానీ కొందరు ఇతర మతాలను నిందిస్తుంటారు. తమ మత గ్రంథాలు చెప్పే విషయాలకు కూడా వక్రభాష్యం చెప్పి ప్రజలను రెచ్చగొడుతుంటారు. దీని కోసం వీరు ఎన్నో ఎత్తులు, జిత్తులు వేస్తారు. మత గొడవలు సృష్టించి ఎందరో అమాయకుల మరణానికి కారణమౌతారు. ఇక నుండి -ఇలాంటివి సాగవు. (ఇటువంటివి భవిష్యత్తులో జరగకూడదని, మతం మానవత్వాన్ని పరిమళింపజేసేదని కవి భావన)
గేయం – 8
నింగిపై జీరాడు నీలినీడల లోన
గాలిలో అందాలు కలబోయు పక్షులకు;
రేయనక పగలనక కాయకష్టము జేయు
కార్మికులు కర్షకులు కలిసి పలికిరి నేడు
అర్థాలు :
- జీరాడు = వ్రేలాడు
- కర్షకులు = రైతులు
- సౌఖ్యము = సుఖము
- సమత = సమానం
- కలబోయు = కలిపివేయు
- నింగి = ఆకాశము
భావం : ఆకాశంలో నీలి మేఘాలు కింద పక్షులు అందంగా, స్వేచ్ఛగా ఎగురుతుంటాయి. కార్మికులు, కర్షకులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఈ ప్రపంచంలో అన్ని ప్రాణులు, ప్రజలు స్వేచ్ఛగా సమానత్వం సాధించాలి. ప్రతి ఒక్కరు సమాజంలో శాంతి సౌఖ్యాలను నెలకొల్పాలి.
ఈ విధంగా కవి ప్రకృతిని, మానవుని అనుసంధానం చేసి ‘ప్రకృతి సందేశం’ మనకు చక్కని ఉదాహరణలతో
వివరించాడు.