Access to the AP 10th Class Telugu Guide 5th Lesson జలియన్ వాలా బాగ్ Questions and Answers are aligned with the curriculum standards.
జలియన్ వాలా బాగ్ AP 10th Class Telugu 5th Lesson Questions and Answers
చదవండి ఆలోచించి చెప్పండి.
ఆ. స్వేచ్ఛకై ఒరిగిన వీరాధివీరుల
చరితలన్ని నీవు చదువవలయు
ఉబుసుపోని కబురు లూరక వాగిన
ఫలిత మేమి కలదు తెలుగుబిడ్డ.
నార్ల చిరంజీవి
ప్రశ్నలు జవాబులు :
ప్రశ్న1.
ఎవరి చరిత్రలను చదవాలి ? ఎందుకు ?
జవాబు:
భరతమాత స్వేచ్ఛ కోసం పోరాడి, వీర మరణం పొందిన వారి చరిత్రలను మనం చదవాలి. భావితరాల బాగు కోసం
ప్రాణాలర్పించిన వారి చరిత్రను తెలుసుకోవల్సిన బాధ్యత మనదే కదా !
ప్రశ్న2.
భారతీయులు స్వేచ్ఛ కోసం ఎవరితో పోరాడాల్సి వచ్చింది ?
జవాబు:
భారతీయులు స్వేచ్ఛ కోసం ఆంగ్లేయులతో పోరాడాల్సి వచ్చింది.
ప్రశ్న3.
నీకు తెలిసిన స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు చెప్పండి.
జవాబు:
భారత స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు: మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్సింగ్, సర్దార్ వల్లభభాయి పటేల్, లాల్ బహుదూర్ శాస్త్రి, తిలక్, లాలాలజపతిరాయ్ మొదలగువారు.
అలోచించండి – చెప్పండి :
ప్రశ్న1.
బ్రిటిష్వాళ్ళు భారతీయుల్ని ఏ విధంగా భావించారు ?
జవాబు:
“భారతీయులు మాకు కేవలం సేవకులు” అని బ్రిటీష్ వారు భావించారు.
ప్రశ్న2.
భారత వీరుడి పరాక్రమం ఎటువంటిది ?
జవాబు:
అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైనా అవుతారేమోగాని, యుద్ధంలో వెనుతిరిగి పారిపోని పరాక్రమం కలవారు భారతీయులు.
ప్రశ్న3.
తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారు ?
జవాబు:
తెల్లదొరలనే రాక్షసగుంపు భారతీయులను అనేక చిత్ర హింసలకు గురి చేసింది. చిన్నారి పసిపిల్లలను తీవ్రమైన ఎండలో నడిపించి హింసించారు. నడుస్తూ వెళ్తున్న సామాన్య ప్రజలను కింద పడదోసి రోడ్లపై పాకుతూ పోవాలని ఆదేశించారు. అలా పొట్టతో పాకుతూ వెళ్తున్న వారిని అతిక్రూరంగా పదునైన ఆయుధాలతో పొడుస్తూ ఆనందించారు. ఏ విధమైన తప్పులు చేయని వారిని సైతం నిలబెట్టి వారి వెనుక భాగాలు చితికిపోయేటట్లు అత్యంత కిరాతకంగా లాఠీలతో కొట్టారు. ఇళ్ళలోకి జొరబడి కుటుంబ స్త్రీలను జుట్టుపట్టుకొని ఈడ్చుకొంటూ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారాలు చేశారు. వేలాదిమందిని తమ తుపాకి గుండ్లకు బలి ఇచ్చి వారి ప్రాణాలను, సంపదలను దోచుకున్నారు. ఇలా సభ్య సమాజం చెప్పుకోలేని విధంగా తెల్లదొరలు భారతీయుల్ని అనేక చిత్రహింసలకు గురి చేశారు.
ప్రశ్న4.
కాల్పుల సమయంలో జలియన్ వాలాబాగ్ లో పరిస్థితి ఏంటి ?
జవాబు:
జలియన్ వాలాబాగ్ లో వేలాది మంది ప్రజలు శాంతి యుతంగా సమావేశం నిర్వహించుకుంటున్నారు. వీరంతా సాధు స్వభావులైన శాంతి కాముకులు. వీరిపై డయ్యర్ అనే బ్రిటిష్ అధికారి విచక్షణరహితంగా కాల్పులు జరిపించాడు. ఆ కాల్పులలో ఎంతో మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ మరణించిన వారి రక్తం ఏరులై పారింది. ఎంతోమంది తలలు తెగి శరీరాలు నేలపై పడ్డాయి. తీవ్రమైన గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ చాలామంది పడి ఉన్నారు. అక్కడి ప్రజల ఆర్తనాదాలతో ఆ ప్రదేశం ప్రతిధ్వనించింది. ఈ సంఘటనకు ఉలిక్కి పడ్డ ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. తమ కుటుంబ సభ్యులను, ఆత్మీయులను గుర్తుపట్టలేని వారి శోకంతో ఆ ప్రాంతం కన్నీటి సంద్రమయింది.
ప్రశ్న5.
జలియన్ వాలా బాగ్ లో భారతీయుల్ని పొట్టన పెట్టుకున్న దెవరు ?
జవాబు:
జలియన్ వాలా బాగ్ లో భారతీయుల్ని పొట్టన పెట్టుకున్నది బ్రిటీష్ అధికారి జనరల్ డయ్యర్.
ప్రశ్న6.
రౌలట్ చట్టం ఎందుకు రూపొందించారు ?
జవాబు:
తిరుగుబాట్లను అణచడానికి బ్రిటీష్వారు ‘రౌలట్ చట్టాన్ని’ రూపొందించారు.
అవగాహన-ప్రతిస్పందన
అ) కింది అంశాల గురించి చర్చించండి.
ఇవి చేయండి :
ప్రశ్న1.
రౌలట్ చట్టాన్ని భారతీయులు ఎందుకు వ్యతిరేకించారు ?
జవాబు:
రౌలట్ చట్టం (నల్లచట్టం) 21 మార్చి 1919న ఢిల్లీలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించిన చట్టం. విప్లవ సమూహాలను అణచి వేయడం ద్వారా, భారతీయుల వ్యక్తిగత వ్యక్తీకరణ, స్వేచ్ఛ హక్కును హరించడం ద్వారా భారతీయులు తమకు వ్యతిరేకంగా లేవకుండా నిరుత్సాహపరచడానికి బ్రిటిష్వారు దీనిని అమలు చేశారు. అందువల్ల రౌలట్ చట్టాన్ని భారతీయులు వ్యతిరేకించారు.
ప్రశ్న2.
భారతీయుని శౌర్య పరాక్రమాలను వివరించండి.
జవాబు:
భారతీయుని శౌర్య పరాక్రమాలు : భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భారతీయుడు ఎక్కడా అలిసిపోలేదు. శత్రువుల చేతికి చిక్కినా దాసోహమనలేదు. యుద్ధ సమయంలో ఒక్కోసారి రాత్రింబవళ్ళు మంచురాళ్ళపై నిద్రిస్తాడు. ఉంటే ఆహారం తీసుకుంటాడు. లేకుంటే నీళ్ళు తాగి జీవిస్తాడు. మత్తుపానీయాల కోసం గతిమాలి శత్రువుల వైపుకు వెళ్ళడు. అవసరమైతే అగ్ని గోళాలకు ఆహుతైనా అవుతాడేమోగాని యుద్ధంలో వెనుతిరిగిపోడు. ఆంగ్లేయులు భారతీయ సమూహంపై తుపాకి గుళ్ళు వానలా కురిపించినా భారతీయులు తమ యుద్ధనైపుణ్యంతో శత్రువులను చీల్చి చెండాడుతూ వీరోచితంగా పోరాడారు. ఎప్పుడూ ఆహారం కోసం దేహీ అని ప్రార్థించలేదు. యుద్ధావేశంతో శత్రువులనే ఏనుగుల కుంభస్థలాలను సింహంలా చీల్చి పోరాటం సాగించాడు. శక్తివంచన లేకుండా యుద్ధంలో తన రక్తాన్ని చిందించాడు.
ప్రశ్న3.
ప్రళయపయోధముల్ ……………. మాటలేటికిన్ పద్యానికి భావం రాయండి.
జవాబు:
ప్రళయకాలంలో గర్జించి వర్షించే మేఘాల్లా ఆంగ్లేయులు భారతీయ సమూహంపై తుపాకిగుండ్ల వాన కురిపిస్తున్నారు. శ్వేతజాతి వాడి పిరంగి గుండ్ల శబ్దాలకు అక్కడివారి గుండెలదరిపోతున్నాయి. తుపాకి కాల్పులకు కొన్ని దేహాలు నేలకొరిగాయి. ఇంతటి ఘోరయుద్ధంలో కూడా భారతీయుడు ఎక్కడా అలసిపోలేదు. శత్రువుల చేతికి చిక్కినా దాసోహమనలేదు. శత్రువుపై భారతవీరుడు విజృంభించాడు. అట్టి భారతవీరుని పరాక్రమం గురించి ఏమని చెప్పగలం ?
ఆ) కింది గేయాన్ని చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
బంగరు పూవులు పూచే తల్లికి భారత ధాత్రికి వందనం 2
సింగారములు చెలువము చిలికే శీలవతికి మా వందనం బం||
జీవనదులతో సిరులొలికించే చిర యశస్వినికి వందనం – 2
పావన ఋక్కులు భవ్య కావ్యములు – 2 పలికిన మాతకు వందనం – బం||
హిమవదాది సుమహీధరాల విలసిల్లిన మాతకు వందనం – 2
అమర ఋషీంద్రుల విమల వాక్కులు – 2 అలరిన మాతకు వందనం బం||
సామగానముల జోలలు పాడుచు సాకెడు తల్లికి వందనం – 2
శత సహస్ర నర నారీసంస్తుత – 2 చరణ పంకజకు వందనం బం||
దివ్య శిల్పులను దివ్య గాయకుల తీర్చిన జననికి వందనం – 2
దేశదేశముల కాదర్శమ్ముల – 2 తెలిపిన మాతకు వందనం బం||
– కె. వీరరాఘవాచారి.
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న1.
పై గేయంలో కవి ఎవరికి వందనాలు సమర్పిస్తున్నారు ?
జవాబు:
పై గేయంలో కవి భారతమాతకు వందనాలు సమర్పిస్తున్నారు.
ప్రశ్న2.
గేయంలో దేశ గొప్పతనాన్ని చాటి చెప్పేవాటిని పేర్కొనండి.
జవాబు:
గేయంలో జీవనదులు, ఋక్కులు (వేదాలు), కావ్యాలు, హిమాలయాది పర్వతాలు, ఋషులు, శిల్పులు, గాయకులు
ఇవన్నీ దేశ గొప్పతనాన్ని చాటి చెప్పేవి.
ప్రశ్న3.
ఈ గేయాన్ని రాసిందెవరు ?
జవాబు:
ఈ గేయాన్ని కె. వీరరాఘవాచారి గారు రాశారు.
ప్రశ్న4.
పై గేయానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ గేయానికి శీర్షిక “భారతమాతకు వందనం”.
ఇ) కింది పేరాను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
సైనిక దాడులనైనా అరికట్టవచ్చునేమోగానీ ప్రజల హృదయాంతరాళాల నుండి పెల్లుబికి వచ్చే స్వతంత్ర భావతరంగాలను ఆపజాలరనేది చరిత్రలో రుజువైన సత్యం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు రెండువందలేండ్లకు పైబడి పంజరాల్లో మనల్ని పట్టి బంధించారు. ఆ శ్వేతజాతి భారతీయుల్ని ఎన్నో చిత్రహింసలకు గురి చేసింది. క్రమేణా మనకు జ్ఞానోదయమైంది. మన నేత్రాల చీకటి పొరలు విడిపోయి, కర్తవ్యోన్ముఖులమయ్యాము. మేధావులు మనకు వెలుగుబాట చూపారు. మన వ్యక్తిత్వాన్ని వికసింపజేశారు. ప్రజలు చైతన్యవంతులయ్యారు. విజ్ఞాపనలు విఫలంకాగా, ఆందోళనలు సాగించారు. ఉద్యమాలు నడిపారు. సత్య, అహింసలతో కూడిన పోరాట కార్యక్రమాల నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూసింది. ‘విభజించి పాలించే’ పద్ధతి అనుసరించింది. ఉద్యమాలు ఉధృతమైన కొద్దీ ఏవో స్వల్ప సంస్కరణలతో ప్రజలను బుజ్జగించ తలపెట్టింది. కాని, ఆ పాచికలేమీ పారలేదు. ప్రపంచంలో ప్రజా శత్రువులెవరూ విజయం పొందలేరు. నిర్బంధ విధానం, పరిష్కార మార్గం కాదని రుజువైంది. ఎట్టకేలకు దేశానికి స్వరాజ్యం సిద్ధించింది. బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వం మన దేశాన్ని వదలి వెళ్ళిపోక తప్పలేదు.
– మాదల వీరభద్రరావు (‘స్వరాజ్య సమరం.. మరువరాని సంఘటనలు”)
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న1.
చరిత్రలో రుజువైన సత్యమేది ?
జవాబు:
ప్రజల హృదయాంతరాళాల నుండి పెల్లుబికి వచ్చే స్వతంత్ర భావతరంగాలను ఆపజాలరనేది చరిత్రలో రుజువైన సత్యం.
ప్రశ్న2.
మేధావులు చేసిన పని ఏమిటి ?
జవాబు:
మేధావులు మనకు వెలుగుబాట చూపారు. మన వ్యక్తిత్వాన్ని వికసింపజేశారు.
ప్రశ్న3.
బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమాలను ఎలా అణచివేయాలని చూసింది ?
జవాబు:
బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూసింది.
ప్రశ్న4.
పై పేరా ఆధారంగా అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన పద్దతి ఏమిటి ?
ఈ) కింది వానికి అర్థ సందర్భాలను రాయండి.
ప్రశ్న1.
సీతజాతికి నీతియటంచు నున్నదే
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం డా॥ ఉమర్ ఆలీషా రచించిన ఖండకావ్యముల నుండి గ్రహించబడిన ‘జలియన్ వాలాబాగ్’ అనే పాఠంలోనిది.
సందర్భం : బ్రిటిష్ వాళ్ళు భారతీయుల స్వాతంత్ర్యోద్యమాలను అణచివేసేందుకు రౌలట్ చట్టాన్ని తెచ్చిన సందర్భాన్ని తెలియజేస్తూ కవి పల్కిన వాక్యమిది.
భావము : భారతీయుల తిరుగుబాట్లను అణచివేయడానికి రౌలట్ చట్టాన్ని రూపొందించారు. ఇటువంటి నిరంకుశ శాసనాన్ని తెచ్చిన ఈ తెల్లజాతికి అసలు నీతి అనేది ఉందా ? (లేదని భావం)
ప్రశ్న2.
కయ్యాల బెంచిన కఠినతముడు
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యము డా॥ ఉమర్ ఆలీషా రచించిన ఖండకావ్యముల నుండి గ్రహింపబడిన ‘జలియన్ వాలాబాగ్’
అనే పాఠంలోనిది.
సందర్భం : విభజించి పాలించు అనే విధానంతో భారతజాతి ఐక్యతను దెబ్బతీయాలని చూసిన ఆంగ్లేయుడి నిజ స్వరూపం వివరించే సందర్భంలో కవి ఈ వాక్యం పలికెను.
భావము : అన్యోన్యంగా ఉన్న భారతీయుల మధ్య తగవులను పెంచిన కఠినాత్ముడు ఆంగ్లేయుడని దీని భావం.
ఉ) కింది వానికి ఏకవాక్య సమాధానాలు రాయండి.
ప్రశ్న1.
జలియన్ వాలాబాగ్ లో అందరి కష్టాలకు కారకుడెవరు ?
జవాబు:
జలియన్వాలాబాగ్ అందరి కష్టాలకు కారకుడు బ్రిటీష్ అధికారి “జనరల్ డయ్యర్”.
ప్రశ్న2.
తిరుగుబాట్లను అణచడానికి బ్రిటీష్ వాళ్ళు తెచ్చిన శాసనమేది?
జవాబు:
తిరుగుబాట్లను అణచడానికి బ్రిటీష్వాళ్ళు తెచ్చిన శాసనం ‘రౌలట్ చట్టం’.
ప్రశ్న3.
భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసిందెవరు ?
జవాబు:
భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసింది ఆంగ్లేయులు.
వ్యక్తీకరణ – సృజనాత్మకత :
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న1.
భారత వీరుల పరాక్రమం గురించి సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
భారతీయ వీరులు తమ యుద్ధ నైపుణ్యంతో శత్రువులను చీల్చి చెండాడుతూ వీరోచితంగా పోరాడుతున్నారు. ఇంతటి ఘోర యుద్ధంలో కూడా భారతవీరులు ఎక్కడా అలసిపోలేదు. శత్రువుల చేతికి చిక్కినా దాసోహమనలేదు. శత్రువుపై భారతవీరుడు విజృంభించాడు. యుద్ధ సమయంలో ఒక్కోసారి రాత్రింబవళ్ళు మంచురాళ్ళపై నిద్రిస్తూ, దొరికినదానితో కడుపు నింపుకుంటాడు. అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైనా అవుతాడేమోగాని, యుద్ధంలో వెనుతిరిగిపోడు. అలాంటి పరాక్రమం కలిగి యుద్ధంలో విజయాన్ని సాధించి వచ్చిన వీరులు భారతీయులు.
ప్రశ్న2.
బ్రిటిష్ వాళ్ళు భారతీయుల మధ్య ఎటువంటి కలతలు సృష్టించారు ?
జవాబు:
భారతీయుల మధ్య తగవులను పెట్టి కలతలు సృష్టించారు బ్రిటిష్వాళ్ళు. భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసి, అన్నవస్త్రాలను దోచుకున్నారు. కరువుకు స్వాగతం పలికారు. భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించారు. బలవంతంగా భారతీయుల్ని అణచివేసే శాసనాలను తెచ్చారు. భరించలేని పన్నులు వేశారు. విదేశీ మత్తు వస్తువులను అమ్మి, మన సంపదలు దోచుకున్నారు. చెడును ప్రేరేపించారు. ప్రాణాలను హరించారు. మోసాలకు, విరోధాలకు, చెడుగుణాలకు, కుటిల బుద్ధికి పెట్టింది పేరై భారతీయులను అనేక ఇబ్బందుల పాలుజేశారు ఆంగ్లేయులు. భయపెట్టే భూతంలా ఆంగ్లేయులు, కలతలు సృష్టించి భారతీయుల్ని మోసం చేశారు.
ప్రశ్న3.
జలియన్ వాలాబాగ్ కాల్పుల సమయంలో భారతీయుల దుస్థితిని తెల్పండి.
జవాబు:
భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ‘జలియన్ వాలాబాగ్’ దురంతం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లోని ఒక ఉద్యానవనం జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునే ‘వైశాఖీ’ పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలా బాగ్ లో బహిరంగసభ జరుగుతుండటంతో అక్కడకు చేరుకున్నారు. తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరిపించాడు. ఎంతో మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. తలలు తెగిన శరీరాలతో, నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్తనాదాలు దిక్కులంతా ప్రతిధ్వనించాయి. కొందరు పౌరులు భయంతో అక్కడ నుండి పరుగెత్తారు.
ఆ) కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న1.
జలియన్ వాలాబాగ్ దురంతాన్ని సవివరంగా తెల్పండి.
జవాబు:
భారత స్వాతంత్ర్యోద్యమాన్ని అణచివేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ వేలాది మంది భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు. భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ‘జలియన్వాలాబాగ్’ దురంతం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో అమృతసర్ లోని ఒక ఉద్యానవనం జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునే ‘వైశాఖీ’ పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలాబాగ్ బహిరంగ సభ జరుగుతుండటంతో అక్కడకు చేరుకున్నారు.
తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపాల్సిందిగా తన సైనికులను ఆదేశించాడు. స్త్రీలు, పురుషులు, పిల్లల పై విచక్షణారహితంగా 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు అక్కడ ఏ మాత్రం లేవు. ఈ దుర్ఘటనలో 379 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది గాయపడ్డారు. స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక విషాదదినంగా, చీకటిరోజుగా మిగిలిపోయింది. మరణించిన వారి రక్తం ఏరులై పారింది.
తలలు తెగిన శరీరాలతో నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్తనాదాలు దిక్కులంతా ప్రతిధ్వనిస్తున్నాయి. తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వారు ‘రౌలట్ చట్టాన్ని’ ప్రవేశపెట్టారు. చేపల సమూహాన్ని పట్టే గాలంలా ఆ చట్టాన్ని డయ్యర్ జలియన్ వాలాబాగ్లో ప్రయోగించాడు. దుర్మార్గంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలను తీశాడు.
ప్రశ్న2.
ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలో భారతీయుల పరిస్థితిని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
‘జలియన్ వాలాబాగ్’ పాఠం ద్వారా కవి ఉమర్ ఆలీషా జనరల్ డయ్యర్ చేసిన దుర్మార్గపు చర్యను తెలియజేయడం, భారతవీరుల శౌర్య పరాక్రమాలను చాటిచెప్పడం, తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురిచేశారో మనకు తెలియజేశారు. సాధు స్వభావం కలిగిన వేలాదిమంది భారతీయుల్ని డయ్యర్ తన సైనికులచే కాల్చి చంపించాడు. దుర్మార్గంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలను తీశాడు.
భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసి, అన్నవస్త్రాలను దోచుకున్నారు. కరువు రక్కసికి ఆహ్వానం పలికి, ఆకలిచావులకు తెర తీశారు. భారతీయుల మధ్య కక్ష్యలను పెంచి పోషించాడు. తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్వాళ్ళు భారతీయుల మీద చట్టాల ఉక్కుపాదం మోపారు. భరించలేని పన్నులు వేశారు. మత్తు వస్తువులను అంటగట్టి మన సంపదలు దోచుకున్నారు. మన మధ్య కలతలు సృష్టించి విభజించి పాలించారు.
పసిపిల్లల్ని ఎండలో నడిపించారు. నడుచుకుంటూ వెళ్ళే వారిని కిందకి తోసి, వారి పొట్టలపై పాకించారు. అతిక్రూరంగా పదునైన ఆయుధాలతో పొడిచారు. ఎటువంటి తప్పులు చేయని వారిని నిలబెట్టి వారి పిఱ్ఱలు చితికిపోయేలా కిరాతకంగా కొట్టారు. స్త్రీలపై అత్యాచారాలు చేశారు. తలలు తెగిన శరీరాలతో, నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్తనాదాలు దిక్కులు ప్రతిధ్వనించాయి.
ప్రశ్న3.
స్వాతంత్య్ర ఉద్యమంలో తెలుగు నేలపై పోరాడిన యోధుల జీవితాలను ప్రస్తావించండి.
జవాబు:
ఎందరో మహనీయుల పోరాట ఫలితమే ఈనాటి మన స్వేచ్ఛ. వారి జీవితాలను పణంగా పెట్టి స్వాతంత్య్రం సాధించారు.
వారిలో కొందరిని మనం స్మరించుకుందాం. అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, టంగుటూరి ప్రకాశం, గూడూరి నాగరత్నమ్మ, కల్లూరి తులసమ్మ, దరిశి చెంచయ్య, దుర్వాసుల వెంకట సుబ్బారావు…. ఇలా ఎందరో మహానుభావుల త్యాగఫలం, మన నేటి స్వేచ్ఛకు మూలధనం.
అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో చాలా పరిమితి వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్నాడు.
1857 నాటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళముందే, బ్రిటిష్ దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. రాయలసీమలో రాయలకాలం నుంచి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అలాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకరు. కంపెనీ దొరతనాన్ని ఎదిరించి వీరమరణం పొందాడు. రేనాటి సూర్యుడుగా కొలవబడ్డాడు.
గూడూరి నాగరత్నమ్మ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరి స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ పిలుపును అనుసరించి హరిజనోద్ధరణ, ఖద్దరు ప్రచారం వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్వహించింది. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని కారాగార శిక్షను అనుభవించింది.
ఇ) కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి.
ప్రశ్న1.
ఆంగ్లేయుల దురాగతాలను వ్యతిరేకిస్తూ భారత వీరుడి ఏక పాత్రను రాసి, ప్రదర్శించండి.
జవాబు:
భారతవీరుడు – ఏకపాత్ర
ఓ విదేశీయుడా ! “భారతీయులు కేవలం మాకు సేవకులు” అని చెప్పడానికి నీకు నోరెలా వస్తుంది. వ్యాపారానికై వచ్చి, నమ్మించి, మాయచేసి, ఆశచూపి, అధికారాన్ని చేపట్టి, కలతలు సృష్టించి, నయవంచకులైన మీరెక్కడా ? మంచితనానికి మారుపేరుగా నిలిచిన, శత్రువులకు చిక్కినా దాసోహమనని మా భారతవీరయోధులెక్కడ ? నిరంకుశ శాసనం చేసి, ఈ దుర్మార్గపు పనికి పూనుకున్న నీ శ్వేతజాతికి అసలు నీతి ఉందా ? చేపల సమూహాన్ని పట్టే కాలంలా రౌలట్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని జలియన్ వాలాబాగ్ దుర్మార్గంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలను తీశారు.
ఇంతకన్నా కృతఘ్నత ఇంకేముంటుంది ? ప్రపంచయుద్ధాలలో ఆంగ్ల కిరీట రక్షణకై శక్తివంచన లేకుండా మా రక్తం చిందించాము. యుద్ధ సమయాల్లో మంచురాళ్ళ పైనే నిద్రించామా ! ఆహారం, నీరు తిన్నామా, తాగామా అని లెక్క చేయకుండా ఉన్నాం. అవసరమైతే అగ్ని గోళాలకు ఆహుతైనా అవుతామేమోగాని, యుద్ధంలో వెన్నుచూపం. అలాంటి మమ్మల్ని, మావాళ్ళను పొట్టన పెట్టుకోవడం చాలా దారుణం. అన్న వస్త్రాలను దోచుకున్నా సహించాం. మా భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించావు. భరించలేని పన్నులు విధించావు. మీదేశ మత్తు పదార్థాలకు మమ్మల్ని బానిసలను చేశావు. చెడును ప్రేరేపించే కలివైనావు.
మా ప్రాణాలను హరించే కాలయముడివైనావు. మోసం చేసావు. కుటిలబుద్ధితో వంచన చేశావు. ఇన్ని కలతలు సృష్టించి, మాలో మేము గొడవలు పడుతుంటే పైశాచిక ఆనందాన్ని పొందావు. పసిపిల్లల్ని, స్త్రీలను బాధించావు, అవమానించావు. పాపమన్న భావన ఏమాత్రం లేకుండా ఈ దురాగతాలన్నీ చేశావు. ఈ పాపం ఊరికే పోదు. భారతీయులపట్ల మీరు చేసిన పాపఫలితం అనుభవించక తప్పదు. ఏదో ఒకనాడు కాళికాదేవి మా భారతీయుని ఇంట చేరి మహాప్రళయాన్ని సృష్టిస్తుంది. ఈ విషయాలను బాగా గుర్తించుకో.
వందేమాతరం, వందేమాతరం, జైహింద్.
ప్రశ్న2.
మీకు నచ్చిన స్వాతంత్య్ర సమరయోధుడిని ప్రశంసిస్తూ, అభినందన పత్రం రాయండి.
జవాబు:
నాకు నచ్చిన స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్పాండేను ప్రశంసిస్తూ
అభినందన పత్రం
ప్రప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడా మంగళ్పాండే ! భరతమాత ముద్దుబిడ్డా! మీకు జోహార్లు. ఈస్ట్ ఇండియా కంపెనీ, బెంగాల్ రెజిమెంట్ యందు సిపాయివి. రెండు శతాబ్దాలు మనదేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని పరిపాలించిన బ్రిటిష్వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడా మంగళ్పాండే ! నీవు అమరుడవు. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో నీకంటూ కొన్ని పుటలు పదిలపరచుకున్న శూరుడా మంగళ్పాండే ! బ్రిటిష్వారు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధనవైపు మళ్ళించిన ఘనత నీదే.
మంగళ్పండే ! నీ అనుచరులు దాదాపు 700 మంది సైనికులను ఫిరంగి గుళ్ల ద్వారా శరీరాన్ని ముక్కలుగా చేసి హింసించి చంపితే….. మీ అందరి త్యాగాల ప్రతిఫలం మేము అనుభవిస్తున్న స్వాతంత్ర్యం ! మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. భవనపు అందాలను, పునాదులు చూడనట్లే ; స్వాతంత్ర్య స్వేచ్ఛా ఫలాల రుచిని చూడకుండానే వీరమరణం పొందిన భారత ప్రప్రథమ స్వాతంత్య్ర సమరయోధుడా మంగళ్పాండే ! మీకిదే మా అక్షర నీరాజనం. జైహింద్.
ఇట్లు,
నవభారత నిర్మాణ సంఘం,
విజయవాడ.
భాషాంశాలు :
పదజాలం
అ) కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి, వాటిని సొంతవాక్యాల్లో ప్రయోగించండి.
1. వర్షాలు లేక పంటలు పండక కాటకం విలయతాండవం చేస్తుంది.
జవాబు:
కాటకం = కరువు.
సొంతవాక్యం : కరువు అనే రాక్షసిని తెచ్చిన పిరికివాడు ఆంగ్లేయుడు.
2. అల్లూరి సీతారామరాజు సితజాతి వారిని గడగడ లాడించాడు.
జవాబు:
సితజాతి = శ్వేతజాతి (తెల్లదొరలు)
సొంతవాక్యం : గాంధీని దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతీయులు పీటర్ మారిట్జ్బర్గ్ లో రైలు నుండి దించారు.
3. తులువలతో స్నేహం మంచిది కాదు.
జవాబు:
తులువ = నీచుడు
సొంతవాక్యం : నీచులతో సహవాసం తప్పక కీడును కలిగిస్తుంది.
4. కురుక్షేత్ర సంగ్రామంలో రుధిరం ఏరులై పారింది.
జవాబు:
రుధిరం – రక్తం
సొంతవాక్యం : రక్తం ఎర్రగా ఉండడానికి కారణం హిమోగ్లోబిన్.
ఆ) కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.
జవాబు:
1. పయోధరం = మబ్బు, మేఘం, అంబుదం
2. ఆర్తి = బాధ, దుఃఖం
3. రణం = యుద్ధం, సమరం, సంగ్రామం
4. ఉదకం = నీరు, జలం
ఇ) కింది పదాలకు నానార్థాలు రాయండి.
జవాబు:
1. హరి = విష్ణువు, కోతి, సింహం
2. గజం = సమూహం, శైవగణం, ఒకపాదం (ఛందస్సు)
3. మోక్షం = కైవల్యం, అందం, మరణం
ఈ) కింది పదాలకు వ్యుత్పత్యర్థాలు రాయండి.
1. నీహారము = దట్టమైనది (మంచు)
2. పాతకము = పతనానికి కారణమయ్యేది (పాపం)
3. పానీయము = పానము చేయదగినది (నీరు)
ఉ) కిందిప్రకృతులకు సరైన వికృతులను జతపరచండి
జవాబు:
ఈ) కింది జాతీయాలను ఏ సందర్భాలలో వాడతారో వివరించండి.
1. అంగలార్చు = ‘దుఃఖించు’. ‘భయంతో అరచు’ లేదా ‘మిక్కిలి బాధపడు’ అని చెప్పే సందర్భంలో ఈ పదాన్ని ప్రయోగిస్తారు.
2. వెన్నుచూపు వెనుకకు మరలు. ‘వెనుకకుపోవు’ లేదా ‘పారిపోవు’ అని చెప్పే సందర్భంలో ఈ పదాన్ని ప్రయోగిస్తారు.
3. ఉగ్గుపాలతో పెట్టు – చిన్నతనం నుంచి వచ్చిన విద్య. ‘పుట్టినప్పటి నుండే నేర్పు’ లేదా ‘చిన్నతనము నుండి అలవరచు’ అని చేప్పే సందర్భంలో ఈ పదాన్ని వాడతారు.
అదనపు భాషాంశాలు :
పర్యాయపదాలు
- సముద్రం : సాగరం, అంభోది
- అగ్ని : చిచ్చు, జ్వలనం, వహ్ని, అనలం
- రణం : యుద్ధం, సమరం, పోరు
- ధ్వజం : పతాకం, జెండా, కేతనం
- నృపాలుడు : రాజు, భూపాలుడు, ప్రభువు, నరపాలుడు
- రుధిరం : రక్తం, నెత్తురు
- వైరి : విరోధి, శత్రువు
- దేహము : తనువు, కాయము, శరీరం
- గజము : ఏనుగు, కరి
- వీరుడు : ధీరుడు, యోధుడు, మేటి, బంటు
- పాతకుడు : పాపాత్ముడు, దుర్మార్గుడు, ద్రోహి
- పద్ధతి : తీరు, రీతి, విధం
- చెలికాడు : మిత్రుడు, స్నేహితుడు, హితుడు
- రుధిరం : రక్తము, నెత్తురు, శోణితము
- శాసనం : శాస్త్రం, చట్టం, ఆజ్ఞ
- ఉదకము : జలము, నీరు, నీరము, తోయము
ప్రకృతి-వికృతులు :
ప్రకృతి – వికృతి
- దుఃఖము – దూకలి
- శాస్త్రం – చట్టం
- పిశాచి – పిసాసి
- సముద్రము – సంద్రము
- అగ్ని- అగ్గి
- ఆహారం – ఓగిరం
- దోషి – దోసి
- కలహము – కయ్యము
- రాక్షసి – రాకాసి
- భక్తి – బత్తి
- రాత్రి – రేయి
నానార్థాలు :
- రక్తం – రుధిరం, ఎరుపువర్ణం
- అరుణము -కాషాయవర్ణం, సూర్యుడు
- పంజరం – ఎముకల గూడు, పక్షుల గూడు, శరీరం
- చిక్కడం – దొరకడం, సన్నబడటం
- వ్యాపారం – వాణిజ్యం, పని
- పాలు – క్షీరము, భాగము, వశం
- వేళ – సమయం, రోజు
- గణము – అక్షరసముదాయం, సైన్యము, సమూహం
- మానము – కొంచెము, గర్వము, మనోగౌరవం
- ఫలము – పండు, ప్రయోజనం
- శాసనము – ఆజ్ఞ, తీర్పు, శాస్త్రము
- కుంభము – ఏనుగు కుంభస్థలం, అన్నపురాశి, కడవ, ఒక రాశి
- వరుడు – పెండ్లికొడుకు, రాజు, శ్రేష్ఠుడు
- కుంభం – కుండ, వీపు
- ఆహారం – కూడు, ఆభరణం, అపహరణం
వ్యాకరణాంశాలు :
అ) కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
జవాబు:
1. కవటాకులు : కవట + ఆకులు = సవర్ణదీర్ఘ సంధి
2. ప్రాణార్థములు : ప్రాణ + అర్థములు = సవర్ణదీర్ఘ సంధి
3. పాలుఁజేసి : పాలున్ + చేసి = సరళాదేశసంధి
4. ధ్వజమెత్తి : ధ్వజము + ఎత్తి = ఉత్వసంధి
ఆ) పాఠంలోని జశ్యసంధిని గుర్తించి రాయండి.
1. వాగ్వాదం = వాక్ + వాదం = (క్) వర్గ ప్రథమాక్షరానికి + స్థిరం (వ) పరమైనది. కనుక ఇది జశ్వసంధి.
2. హృద్వారం = హృత్ + ద్వారం = వర్గప్రథమాక్షరానికి (త్) + వర్గతృతీయం (ద) పరమైంది. కనుక ఇది జశ్వసంధి.
3. దిగంతం = దిక్ + అంతం =(క్) వర్గప్రథమాక్షరానికి + అచ్చు (అ) పరమైనది. కనుక ఇది జశ్వసంధి.
ఇ) కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసనామం తెల్పండి.
జవాబు:
1. శౌర్యపరాక్రమములు : శౌర్యమును, పరాక్రమమును – ద్వంద్వ సమాసం
2. శుద్ధాంతకాంత : శుద్ధాంతము నందలి కాంత – సప్తమీ తత్పురుష సమాసం
3. పాపఫలం : పాపము యొక్క ఫలం – షష్ఠీతత్పురుష సమాసం
4. దేహపంజరం : దేహమనెడి పంజరం – రూపక సమాసం
5. రాకాసిమూక : రాకాసుల యొక్క మూక – షష్ఠీతత్పురుష సమాసం
6. ఘోరరణం : ఘోరమైన రణం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) పాఠంలోని మరికొన్ని సమాస పదాలను గుర్తించి వాటికి విగ్రహవాక్యాలు, సమాసనామాలు రాయండి.
ఉ) కింది పద్యపాదంలోని అలంకారాలను గుర్తించండి.
1. దుఃఖసముద్రము భారతీయ హృద్వారము సొచ్చి యగ్నిపలె జ్వాలలు వీచుచునున్న దెంతయున్.
జవాబు:
ఇందులో ఉపమాలంకారము, రూపకాలంకారములు ఉన్నాయి.
ఉపమాలంకారం లక్షణం : ఉపమాన ఉపమేయములకు చక్కని పోలిక చెప్పినచో ఉపమాలంకారమగును. ఇందు ‘దుఃఖము’ ఉపమేయము, ‘అగ్ని’ ఉపమానం, ‘వలె’ ఉపమావాచకం ‘జ్వాలలు వీచడం’ సమానధర్మం:
ఇక్కడ ఉపమేయమైన దుఃఖమునకు, ఉపమానమైన అగ్నికి చక్కని పోలిక చెప్పబడినది కనుక ఇది ఉపమాలంకారం. రూపకాలంకారం లక్షణం : ఉపమేయ, ఉపమానములకు అభేదము పాటించినచో లేదా ఉపమాన ధర్మాన్ని ఉపమేయము నందు ఆరోపించుట రూపకాలంకారం.
ఈ ఉదాహరణలో ఉపమేయమైన ‘దుఃఖము’నకు, ఉపమానమైన ‘సముద్రం’నకు అభేదం చెప్పబడింది. ఉపమానమైన సముద్రం ధర్మాన్ని ఉపమేయమైన ‘దుఃఖం’ నందు ఆరోపింపబడినది కావున ఇది రూపకాలంకారమగును.
ఈ) కింది పద్యపాదాలకు గురువు, లఘువులు గుర్తించి, గణవిభజన చేసి, ఏ పద్యపాదమో రాయండి.
1. రౌలటుశాసనంబు సమరంబునగెల్చిన దాని కంకుగా
జవాబు:
ఇందులో భ,ర,న,భ,భ,ర,వ అను గణాలు వరుసగా వచ్చాయి. కనుక ఇది ‘ఉత్పలమాల’ పద్యపాదం.
2. జలియనుబాగులో జనుల జంపిన రక్తము వర్షపాతముం
ఇందులో న, జ, భ, జ, జ, జ, ర అను గణాలు వరుసగా వచ్చాయి కనుక ఇది ‘చంపకమాల’ పద్యపాదం.
ఋ) సీసపద్య లక్షణాలను పరిశీలిద్దాం.
సీసపద్యంలో ప్రతిపాదం రెండు భాగాలుగా ఉంటుంది. ప్రతి భాగంలో నాల్గోసి గణాల చొప్పున ఒక్కొక్క పాదంలో ఎనిమిది గణాలుంటాయి. ఈ 8 గణాల్లో మొదటి ఆరు ఇంద్రగణాలు. చివరి రెండు సూర్యగణాలు. (పాదం మొదటి భాగంలో 4 ఇంద్రగణాలు, 2వ భాగంలో వరుసగా రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలుంటాయి).
ఉదా :
1. యతి ప్రతి పాదంలోనూ 3వ గణం మొదటి అక్షరంతో సరిపోతుంది. యతిలేని చోట ప్రాసయతి చెల్లుతుంది.
2. ప్రాస నియమం లేదు.
3. సిసపద్యం నాలుగు పాదాల తర్వాత తేటగీతి గాని, ఆటవెలది గాని తప్పనిసరిగా ఉంటుంది.
ఈ క్రింది పద్యపాదాలకు గణవిభజన చేసి లక్షణ సమన్వయం చేయండి.
1. బానిసత్వము నుగ్గుపాలబోసినదోషి అన్నవస్త్రము లాచి కొన్న ఖలుడు
జవాబు:
మొదటిపాదంలో ర,సల,ర,సల అను నాలుగు ఇంద్రగణాలున్నాయి. రెండవపాదంలో ర,సల (ఇంద్రగణాలు), హ, న (సూర్యగణాలు) ఉన్నాయి. మొదటిపాదంలో “బా,పాలకు యతిమైత్రి చెల్లింది. రెండవపాదంలో “అన్న, కొన్న” పదాలకు ప్రాసయతి చెల్లింది. కనుక ఇది సీస పద్యమునకు చెందినది. .
2. ఒకచోట నీహార నికరంపురాలపై బవళించు రణము రే బవలు సలిపి
జవాబు:
ఇందులో మొదట 6 ఇంద్రగణములు, తరువాత 2 సూర్యగణాలు వచ్చాయి కనుక ఇది సీసపద్య పాదం.
మొదటిపాదంలో సల, త, సల, ర అను నాలుగు ఇంద్రగణాలున్నాయి. రెండవ పాదంలో సల, నగ, రెండు ఇంద్రగణాలు న, న, అను రెండు సూర్యగణాలున్నాయి. మొదటిపాదంలో ఒక నిక్ష లకు ప్రాసయతి, రెండవ పాదంలో బవ, బవ లకు యతి మైత్రి చెల్లింది.
ప్రాజెక్టు పని :
మీ ప్రాంతంలోని స్వాతంత్య్ర సమరయోధుల వివరాలు సేకరించి, ఒక నివేదిక రూపొందించండి. దానిని తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
నివేదిక
మా ప్రాంతం ఎందరో మహనీయుల జీవితాలతో ముడిపడి ఉంది. వారు కాలం చేసినా, వారి గుర్తులు మా నేలపై చిరస్థాయిగా నిలిచిపోయాయి. వారిలో ఉన్నవ లక్ష్మీనారాయణ (1877, డిశంబరు 4 – 1958, సెప్టెంబరు 25, అప్పటి గుంటూరు జిల్లా వేములూరుపాడు జన్మస్థలం) ఒకరు. ఈయన గాంధేయవాదిగా, సంఘసంస్కర్తగా, స్వాతంత్య్ర సమరయోధుడుగా, తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొంది, సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన ప్రముఖ న్యాయవాది. వీరి నవల ‘మాలపల్లి’ తెలుగు సాహితీ చరిత్రలోనూ, సామాజిక దృక్పథంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం. గుంటూరులో ఈయన స్థాపించిన శ్రీశారదానికేతన్ స్త్రీ విద్యను ప్రోత్సహించడంలో మంచి కృషి
చేసింది.
కొండా వెంకటప్పయ్య (22.02.1866 – 15.08.1949) ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ‘దేశభక్త’ బిరుదాంకితుడు. ఈయన గాంధీజీ ఉపసేనానుల తొలి జట్టుకు చెందినవాడు. సహాయనిరాకరణ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో ముందుండి నడిపించాడు. ఈయన పాతగుంటూరులో జన్మించాడు.
స్వాతంత్ర్య సమరయోధుల్లో ప్రముఖుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య (02.06.1889 – 10.06.1928). ఈయన గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు. ఆంధ్రరత్న బిరుదు పొందాడు. ఈయన నాయకత్వంలో నడిచిన ‘చీరాల పేరాల సమరం’ సుప్రసిద్ధం.
వావిలాల గోపాలకృష్ణయ్య (17.09.1906 – 29.04.2003) భారత స్వాతంత్య్ర సమరయోధుడు. గాంధేయవాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు, ‘పద్మభూషణ’ పురస్కార గ్రహీత. ‘కళాప్రపూర్ణ’ బిరుదు గ్రహీత. ఖాదీ దుస్తులతో చేతిలో ఖాదీ సంచితో నిరాడంబరంగా కనిపించే అజాతశత్రువు. ఆజన్మ బ్రహ్మచారి.
ఇలా ఎందరో మహనీయుల పాదస్పర్శతో మా ప్రాంతం పునీతం అయింది. వారి మార్గంలో నడిచి, రాష్ట్ర, దేశాభివృద్ధికి పాటుపడడమే మేము వారికిచ్చే నివాళి.
పాఠ్యాంత పద్యం :
సీ. ఎవ్వారి రణగాథ లింత రచింప, స
త్కవుల కలాలు సార్థకత నందు;
ఎవ్వారి జయగాథలించుక పాడ, గా
యకుల కంఠములు ధన్యత గడించు;
ఎవ్వారి రూపులొక్కింత రూపింప, శి
ల్పుల కళాకృతి మహోజ్జ్వలత గాంచు;
ఎవ్వారి పదధూళి రవ్వంత సోకిన
భూదేవి నిలువెల్ల పులకరించు;–
తే. నభము మార్మోగు విజయదుందుభులు వారు ;
త్యాగధనులైన సత్యవర్తనులు వారు ;
జాతిరత్నాలు వారు; శాశ్వతులు వారు;
పావనులు వారు; ధన్యజీవనులు వారు!
– కరుణశ్రీ
భావం : ఎవరి యుద్ధ (వీర గాథలను రచించడం వల్ల కవుల కలాలు సార్థకమవుతాయో, ఎవరి విజయగాథలను ఆలపించడం వల్ల గాయకుల కంఠాలు ధన్యమవుతాయో, ఎవరి రూపాలను నిర్మించడం వల్ల శిల్పుల కళాకృతులు ఉజ్జ్వలంగా వెలుగుతాయో, ఎవరి పాదధూళి సోకినంత మాత్రాన భూదేవి నిలువెల్లా పులకిస్తుందో – వాళ్లు ఆకాశం మార్మోగే విజయ దుందుభులు, త్యాగధనులు, సత్యసంధులు, జాతిరత్నాలు, శాశ్వతులు, పుణ్యులు, ధన్యులైన (దేశభక్తులు)
– దేశం కోసం ప్రాణాలిచ్చిన మహనీయులు.
సూక్తి : “స్వాతంత్ర్యం చాలా సున్నితమైన పువ్వు, వాడియైన కత్తి, విలువైన వజ్రం.” – శ్రీశ్రీ
కవి పరిచయం :
కవి : డాక్టర్ ఉమర్ ఆలీషా
జననం : తూర్పుగోదావరి జిల్లా (ప్రస్తుతం కాకినాడ జిల్లా) పిఠాపురంలో జన్మించాడు.
తల్లిదండ్రులు : చాంబ్బీబి, మొహియ్యుద్దీన్ బార్న్స్
రచనలు : మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైన నాటకాలు, ఖండకావ్యాలు, బ్రహ్మవిద్యావిలాసం, సూఫీ వేదాంత దర్శము, మహమద్ రసూల్ వారి చరిత్ర మొదలగు పద్య గ్రంథాలు, ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధన పథం మొదలగు గద్య రచనలు, ఏకాంకికలు, ప్రహసనాలు, నవలలు, కథల సంగ్రహం, అనువాదాలు మొదలగు రచనలు చేశారు.
బిరుదులు, పురస్కారాలు : ఈయన ‘పండిట్’, ‘మౌల్వీ’ బిరుదులు పొందారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో సత్కరించింది.
విశేషములు : ఈయన మహాకవిగా, వక్తగా, అవధానిగా, ఆధ్యాత్మికవేత్తగా, బహుభాషా పండితునిగా, పార్లమెంట్
సభ్యునిగా ప్రసిద్ధి చెందారు. ఈయన గురు పీఠం ‘జ్ఞాన సభ’ పేరిట ప్రసిద్ధి చెందింది.
ఉద్దేశం :
భారత స్వాతంత్ర్యోద్యమాన్ని అణచి వేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ వేలాదిమంది భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు. ఈ దుర్మార్గపు చర్యను తెలియజేయడం, భారత వీరుల శౌర్య, పరాక్రమాలను చాటి చెప్పడం, తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురిచేశారో తెల్పుతూ, విద్యార్థుల్లో దేశభక్తిని, స్వాతంత్య్ర స్ఫూర్తిని, త్యాగ నిరతిని పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం.
ప్రక్రియ – ఖండకావ్యం :
మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకుని రాసింది ‘ఖండకావ్యం’. చారిత్రక ఘట్టాలను, స్వీయ అనుభవాలను, సన్నివేశాలను విడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యం అవుతుంది. ఇందులో ఆత్మాశ్రయ రీతి ఉంటుంది. వస్తువులోనూ, భావంలోను, శైలిలోను నవ్యత ఉంటుంది.
నేపథ్యం :
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ‘జలియన్ వాలాబాగ్’ దురంతం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లోని ఒక ఉద్యానవనం జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునే ‘వైశాఖీ’ పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలా బాగ్లో బహిరంగ సభ జరుగుతుండటంతో అక్కడకు చేరుకున్నారు. తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపాల్సిందిగా తన సైనికులను ఆదేశించాడు.
స్త్రీలు, పురుషులు, పిల్లలపై విచక్షణారహితంగా 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు అక్కడ ఏ మాత్రం లేవు. ఈ దుర్ఘటనలో 379 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది గాయపడ్డారు. స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక విషాద దినంగా, చీకటి రోజుగా మిగిలిపోయింది.
పద్యాలు – ప్రతిపదార్థ భావాలు :
1వ పద్యం :
ఉ. పారుల శస్త్రశాస్త్రముల పద్ధతివేరనివారి సాధుసం
పారులఁ బట్టి డయ్యరు పిశాచము జల్యను వాలబాగులో
దూరి వధించెఁ దద్రుధిర దుఃఖసముద్రము భారతీయ హృ
ద్వారము సొచ్చి యగ్నివలె జ్వాలలు వీచుచునున్న దెంతయున్.
ప్రతిపదార్థం :
శస్త్రం = ఆయుధం గురించి
శాస్త్రముల = (ఆయుధ ప్రయోగముల గురించిన) నియమబద్ధమైన గ్రంథముల గురించి
పద్ధతిన్ = ఆయుధాలను ప్రయోగించే
నేరనివారి = తెలియనివారైన
సాధుసంసారులు = సాధుస్వభావం కలిగిన వేలాది మంది అమాయకుల్ని
జల్యనువాలబాగులో = అమృతసర్ పట్టణంలో జల్యనువాలాబాగులో సమావేశం కాగా
డయ్యరు పిశాచము = భారతీయుల ఐక్యత నచ్చని డయ్యర్ అనే ఆంగ్ల పిశాచం
దూరి = జలియన్ వాలాబాగ్ లోకి ప్రవేశించి
వధించెన్ = తన సైనికులచే కాల్చి చంపించాడు
తత్ + రుధిర = అమాయక ప్రజల రక్తంతో
దుఃఖసముద్రము = ఉప్పొంగిన దుఃఖసముద్రం
భారతీయ హృద్ +
ద్వారము = భారతీయ హృదయ ద్వారాల్లోకి
చొచ్చి = ప్రవేశించి
అగ్ని వలె జ్వాలలు = అది అక్కడి వారి హృదయాలలో అగ్నిలా మంటల్ని
ఎంతయున్ = ఎంతగానో
వీచుచున్ + ఉన్నది = రేపుతోంది
భావం: ఆయుధాలను ప్రయోగించడం తెలియని ప్రజలు జలియన్ వాలా బాగ్ వేడుకకు సమావేశమయ్యారు. ఇదే అదనుగా భావించి బ్రిటిష్ అధికారి డయ్యరనే ఆంగ్లపిశాచం అందులోకి ప్రవేశించాడు. సాధుస్వభావం కలిగిన వేలాదిమంది అమాయకుల్ని తన సైనికులచే కాల్చి చంపించాడు. ఆ రక్తంతో ఉప్పొంగిన దుఃఖ సముద్రం భారతీయ హృదయ ద్వారాల్లోకి ప్రవేశించింది. అది అక్కడివారి హృదయాంతరాల్లో అగ్నివలె మంటల్ని రేపుతుంది.
2వ పద్యం :
ఉ. యూరపు దేశ మెక్క డల హూణకిరాటపుళిందు లేడ ? యా
ఘోరరణంబునం దరులఁ గూల్చి జయధ్వజ మెత్తినట్టి మా
భారతవీరయోధు లొక పాటె నిరంకుశ శాసనాగ్ని సం
స్కారముచేసినారు; సీత జాతికి నీతియటంచు నున్నదే.
ప్రతిపదార్థం :
అలయూరపు
దేశము + ఎక్కడ = ఆ యూరపు దేశమెక్కడ ?
హూణకిరాట
పుళిందులు + ఏడ = ఆంగ్లదేశం నుండి వ్యాపారానికై వచ్చిన క్రూరులైన తెల్లదొర లెక్కడ ?
ఆ ఘోర రణంబునందు = ఆ భయంకరమైన యుద్ధంలో
అరులన్ + కూల్చి = శత్రువులను చంపి
జయధ్వజము + ఎత్తి
నట్టి = విజయపతాకాన్ని ఎగురవేసిన
మా భారత వీర
యోధులు = మా భారత వీరయోధులు
ఒకపాటె = సమానమౌతారా ?
నిరంకుశ = కఠిన వైఖరి గల
శాసన + అగ్ని
సంస్కారము చేసినారు – (రౌలత్) చట్టం పేరుతో కాల్చారు
సిత జాతికి = ఇటువంటి దుర్మార్గపు పనికి పూనుకున్న తెల్లజాతికి (ఆంగ్లేయులకు)
నీతి + అటంచున్ + ఉన్నదే = అసలు నీతి అనేది ఉందా ! (లేదని భావం)
భావం: ఆ యూరపు దేశమెక్కడ ? వ్యాపారానికై వచ్చి, భారతీయుల్ని వేటాడి వేధిస్తున్న తెల్లదొరలెక్కడ ? భయంకరమైన యుద్ధంలో శత్రువులతో పోరాడి విజయం కోసం నెత్తురోడిన మా భారత వీరయోధులెక్కడ ? నిరంకుశ శాసనం (రౌలట్ చట్టం) చేసి వారు ఈ దుర్మార్గపు పనికి పూనుకున్నారు. ఈ శ్వేతజాతికి అసలు నీతి అనేది ఉందా ?
3వ పద్యం :
ఉ. రౌలటు శాసనంబు సమరంబున గెల్చినదాని కంకుగా
గాలము మీనజాలమున గై యొనరించినరీతి హూణభూ
పాలు రొసంగినారు పడి పంథినృపాలురు నవ్వునట్టు ల
య్యో! లవమైన ప్రేమమగునోయి కృతఘ్నత వేఱయున్నదే.
ప్రతిపదార్థం :
రౌలట్లు శాసనంబు = భారతీయుల తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్వారు ప్రవేశపెట్టిన రౌలటు శాసనము
సమరంబున గెల్చిన
దానికి = భారతీయులు తమకు వ్యతిరేకంగా లేవకుండా నిరుత్సాహపరచడానికి బ్రిటిష్ కౌన్సిల్ ఆమోదం పొందామని సంతోషిస్తున్న ఆంగ్లేయులు
అంకుగా = లభించిన అవకాశంగా భావించి
మీనజాలమునకై
ఒనరించిన = చేపల సమూహాన్ని పట్టుకోవడానికి ఉపయోగించే
గాలము = గాలంలాగా ఆ చట్టాన్ని
హూణభూపాలురు + ఒసంగినారు = డయ్యర్ జలియన్ వాలాబాగ్ ప్రయోగించాడు
పరిపంథినృపాలురు = ఆంగ్లేయులకు తొత్తులుగా ఉన్న (భారతీయులకు శత్రు సామంతరాజులు)
నవ్వున్ + అట్టుల = ఈ మారణ హోమం చూసి) నవ్వుతున్నారు
అయ్యో ! = ఏ మాత్రం జాలిలేని
లవము + ఐన = ఆంగ్లేయులకు
ప్రేమము + అగునోయి = భారతీయులపై కొద్దిగా కూడా ప్రేమ కలుగు తుందా (కలుగదని భావం)
కృతఘ్నత = చేసిన మేలును మరచిపోవడం
వేఱ + ఉన్నది + ఏ = అంటే ఇంతకన్నా వేరే ఉందా (లేదని భావం).
భావం : తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వారు ‘రౌలట్ చట్టాన్ని’ ప్రవేశపెట్టారు. చేపల సమూహాన్ని పట్టే గాలంలా ఆ చట్టాన్ని డయ్యర్ జలియన్ వాలాబాగ్ ప్రయోగించాడు. దుర్మార్గంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలను తీశాడు. దీనిని చూసి సామంతరాజులు నవ్వు తున్నారు. అయ్యో ! ఆంగ్లేయులకు భారతీయులపై కొద్దిగా కూడా ప్రేమ లేదు. ఇంతకన్నా కృతఘ్నత ఇంకేముంటుంది ?
వ్యుత్పత్త్యర్ధం : సమరం: మరణంతో కూడినది – యుద్ధం.
4వ పద్యం :
ఉ. యూరపు దేశ మట్టిటుల నూగగ శౌర్యపరాక్రమంబులన్
భారతవీరకోటి రణ పాండితి వైరులఁ జీల్చి రక్తసి
కొరుణమూర్తులై నిజజయధ్వజముల్ నెలకొల్పినప్పు డీ
దారుణ మెచ్చెఁ దద్రుధిర ధారలు భోరునఁ బొర్లి పారఁగన్.
ప్రతిపదార్థం :
శౌర్యపరాక్రమంబులన్ = భారతవీరుల శౌర్య పరాక్రమాలతో
యూరపుదేశము = లండన్ మాత్రమేకాక ఐరోపా ఖండం మొత్తం
అట్టి + ఇటులన్ + ఊగగ = భయంతో వణికిపోయింది
భారతవీరకోటి = భారతీయ వీరులు
రణపాండితిన్ = తమ యుద్ధ నైపుణ్యంతో
వైరులన్ + చీల్చి = శత్రువులను చీల్చి చెండాడుతూ
రక్తసిక్త + అరుణ
మూర్తులు + ఐ = ఇరుపక్షాలవారు రక్తసిక్తులై ఎర్రని రూపెత్తి పోరాడు తుండగా
ఈ దారుణము + ఎచ్చెన్ = ఈ రక్తపాతము మితిమీరు తుండగా
నిజజయధ్వజముల్ = జై, జై అంటూ జయధ్వానాలు, జెండాలు
నెలకొల్పినప్పుడు = మారుమోగుతుండగా, రెపరెప లాడుతుండగా
తత్ + రుధిర ధారలు = అక్కడి వారి రక్తధారలు
భోరునన్ + పొర్లి = ఉవ్వెత్తున పొంగి పొర్లి
పారఁగన్ = ప్రవహిస్తున్నాయి (ఆ ప్రాంత మంతా రక్తంతో తడిసిందని భావం.)
భావం : భారతవీరుల శౌర్యపరాక్రమాలతో లండన్ మాత్రమే కాక ఐరోపాఖండం మొత్తం భయంతో వణికిపోయింది. భారతీయ వీరులు తమ యుద్ధ నైపుణ్యంతో శత్రువులను చీల్చి చెండాడుతూ ఇరుపక్షాలవారు రక్తసిక్తులై ఎర్రని రూపెత్తి పోరాడుతుండగా ఈ రక్తపాతము మితిమీరుతుండగా జై, జై అంటూ జయధ్వానాలు, మారుమోగుతుండగా, జెండాలు రెపరెప లాడుతుండగా అక్కడి వారి రక్తధారలు ఉవ్వెత్తున పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. (ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసిందని భావం. )
5వ పద్యం :
చం. ప్రళయపయోధముల్ గురియు భంగి ఫరంగి పిరంగిగుండ్ల, గుం
డెలదర దేహపంజరము డిల్లఁగ జల్లెడరీతి మార్చినన్
సాలసియు నిన్సురుస్సురని స్రుక్కఁడు చిక్కఁడు వైరిచేతికిన్
బలవదరిప్రభంజనుఁడు భారతవీరుఁడు మాటలేటికిన్.
ప్రతిపదార్థం:
ప్రళయ పయోధముల్ = ప్రళయకాలంలోని మేఘాలు
కురియు భంగిన్ = వర్షించిన విధంగా
ఫరంగి = ఫిరంగివాడు (యూరప్ దేశస్థులను మనదేశంలో అలా ఒకప్పుడు పిలిచేవారు)
‘ఫిరంగిగుండ్ల = మనపై పిరంగిగుండ్లను కురిపించగా
గుండెలు + అదర = గుండెలు అదరిపోతున్నాయి
దేహపంజరము = శరీరమనే ఈ ఎముకల గూడు
డిల్లగ = నీరసించి పడిపోయెను
జల్లెడ రీతిన్ మార్చినన్ = తుపాకీ గుండ్లతో తూట్లుపడి నేలకు ఒరిగెను
సొలసియున్ = యుద్ధంలో అలసిపోయినా
ఇసురు + ఉసురు + అని = ఆయాసాన్ని సూచించే నిట్టూర్పు లతో
స్రుక్కఁడు = భయపడడు
వైరిచేతికిన్ = శత్రువుల చేతికి
చిక్కఁడు = దొరకడు, చిక్కినా దాసోహం అనడు
మాటలు + ఏటికిన్ = ఇన్ని మాటలు ఎందుకు ?
బలవత్ + అరి = బాగా బలం కలిగిన శత్రువుల పాలిట
ప్రభంజనుడు = విధ్వంసకుడు కాదా
భారతవీరుఁడు = మా భారతవీరుడు
భావం : ప్రళయకాలంలోని మేఘాలు వర్షించిన విధంగా ఫిరంగివాడు (యూరప్ దేశస్థులను మనదేశంలో అలా ఒకప్పుడు పిలిచేవారు) మనపై పిరంగిగుండ్లను కురిపించగా గుండెలు అదరిపోతున్నాయి. శరీరమనే ఈ ఎముకల గూడు నీరసించి పడిపోయెను. తుపాకీ గుండ్లతో తూట్లుపడి నేలకు ఒరిగెను. యుద్ధంలో అలసిపోయినా ఆయాసాన్ని సూచించే నిట్టూర్పులతో భయపడడు. శత్రువుల చేతికి దొరకడు, చిక్కినా దాసోహం అనడు. ఇన్ని మాటలు ఎందుకు ? బాగా బలం కలిగిన శత్రువుల పాలిట విధ్వంసకుడు కాదా మా భారతవీరుడు. విశేషం : పయోధము (వ్యు) = నీటిని ఇచ్చునది – మబ్బు
6వ పద్యం :
శా. ఆహారంబున కంగలార్పఁడు, రణవ్యాపారపారాయణుం
డై హర్యక్షమురీతి వైరిగజకుంభానీకముల్ చీల్చి సం
దేహం బందక యాత్మరక్త మొలికించెన్ భారతీ సైనికుం
డాహా! ఆంగ్లకిరీటరక్షణ సముద్యదృక్తిసంయుక్తుఁడై.
ప్రతిపదార్థం:
భారతీయ సైనికుండు = భారతీయ సైనికుడు
ఆంగ్లకిరీట రక్షణ = ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంగ్లేయుల అధికార రక్షణకై
సమ + ఉద్యత్ + భక్తిన్ = భక్తిశ్రద్ధలతో పూనుకున్నాడు. (అది ఎలా అంటే)
ఆహారంబునకు + అంగలార్పడు = ఆహారం కోసం బాధపడుతూ దేహి అని ప్రార్థించడు
రణవ్యాపార పారాయణుండు + ఐ = యుద్ధమనే పనిలో శ్రద్ధ కలవాడై
హరి + అక్షము రీతి = సింహంలా యుద్ధావేశంతో
వైరిగజ కుంభ + అనీకముల్ = శత్రువులనే ఏనుగుల కుంభ స్థలాలను
చీల్చి = చీల్చాడు
ఆహా ! = ఆహా ! (భారతీయుల స్వామి భక్తి ఏమని చెప్పాలి)
సందేహంబు+అందక = శక్తివంచన లేకుండా (ఆంగ్లేయుల తరుఫున పోరాడి)
ఆత్మరక్తము + ఒలికించెన్ = తన రక్తాన్నే చిందించాడు.
భావం : భారతీయ సైనికుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంగ్లేయుల అధికార రక్షణకై భక్తిశ్రద్ధలతో పూనుకున్నాడు. (అది ఎలా అంటే) ఆహారం కోసం బాధపడుతూ దేహి అని ప్రార్థించడు. యుద్ధమనే పనిలో శ్రద్ధ కలవాడై సింహంలా యుద్ధావేశంతో శత్రువులనే ఏనుగుల కుంభస్థలాలను చీల్చాడు. ఆహా ! (భారతీయుల స్వామిభక్తి ఏమని చెప్పాలి) శక్తివంచన లేకుండా (ఆంగ్లేయుల తరుఫున పోరాడి తన రక్తాన్నే చిందించాడు.
విశేషం : హర్యక్షం (వు): కపిలవర్ణము గల (పచ్చని) కన్నులు కలది – సింహం
7వ పద్యం:
సీ. ఒకచోట నీహార నికరంపురాలపైఁ,
బవళించు రణము రే బవలు సలిపి
ఉన్నచోఁదిని యున్న యుదకముల్ ద్రావి జీ
వించుఁ బోరును విని ర్జించుచుండు
ఆసవపాన దుర్వ్యసనసంసక్తుఁడై
గతి మాలి వైరివంకలకుఁజనఁడు
అగ్ని గోళములకు నాహుతియగుఁ గాని,
వెన్నిచ్చి పాఱఁ డే వేళఁ గాని
అట్టిశౌర్యంబు వెచ్చించి ఆవహమున
విజయ మార్జించి వచ్చిన వీరవరులు
భారతీయులు వట్టిసేవకు లటంచుఁ
జెప్ప నోరాడెనే విదేశీయులార ?
ప్రతిపదార్థం :
విదేశీయులార ? = ఓ ఆంగ్లేయులారా !
రణమున్ సలిపి = యుద్ధం చేసేటప్పుడు భారతీయ వీరులు
ఒకచోట నీహార
నికరంపురాలపై = ఒక్కోసారి దట్టమైన మంచు రాళ్ళపై
రే + పవలు + పవళించు = రాత్రింబవళ్ళు నిద్రిస్తారు
ఉన్నచోన్ + తిని = ఆహారం ఉంటే తింటారు
ఉన్న + ఉదకముల్ + త్రావి = లేకపోతే నీళ్ళు తాగి
జీవించున్ = జీవిస్తారు
పోరునన్ = యుద్ధంలో
వినిర్జించుచు + ఉండు = విజేతగా నిలుస్తారు
ఆసవపాన దుః + వ్యసన సంసక్తుఁడు + ఐ = మత్తుపానీయాల వంటి చెడు
అలవాట్లపై ఆసక్తి కలవాడై
గతిమాలి = దిక్కుమాలి (దారితప్పి)
వైరి వంకలకున్ + చనఁడు = శత్రువులవైపుకు వెళ్ళరు
అగ్నిగోళములకున్ + ఆహుతి + అగున్ + కాని = అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైనా అవుతాడేమోగానీ,
వెన్ను + ఇచ్చి పాఱఁడు + ఏవేళన్ + కాని = ఏ సమయంలోనైనా యుద్ధంలో వెనుతిరిగి పారిపోరు
అట్టి శౌర్యంబు వెచ్చించి = అలాంటి పరాక్రమం కలిగి
ఆవహమున విజయము + ఆర్జించి = యుద్ధంలో విజయాన్ని సాధించి
వచ్చిన వీరవరులు = వచ్చిన గొప్ప వీరులైన
భారతీయులు = భారతీయులను
వట్టిసేవకులు + అటంచున్ = కేవలం మాకు సేవకులు అంటూ
చెప్పనోరు + ఆడెను + ఏ = చెప్పడానికి మీకు నోరెలా వచ్చింది
భావం : ఓ ఆంగ్లేయులార ! యుద్ధం చేసేటప్పుడు భారతీయ వీరులు ఒక్కోసారి దట్టమైన మంచురాళ్ళపై రాత్రింబవళ్ళు నిద్రిస్తారు. ఆహారం ఉంటే తింటారు. లేకపోతే నీళ్ళు తాగి జీవిస్తారు. యుద్ధంలో విజేతగా నిలుస్తారు. మత్తుపానీయాల వంటి చెడు అలవాట్లపై ఆసక్తి కలవాడై దిక్కుమాలి (దారితప్పి) శత్రువుల వైపుకు వెళ్ళరు. అవసరమైతే అగ్నిగోళాలకు ఆహుతైనా అవుతాడేమోగానీ, ఏ సమయంలోనైనా యుద్ధంలో వెనుతిరిగి పారిపోడు. అలాంటి పరాక్రమం కలిగి యుద్ధంలో విజయాన్ని సాధించి వచ్చిన గొప్ప వీరులైన భారతీయులను కేవలం మాకు సేవకులు అంటూ చెప్పడానికి మీకు నోరెలా వచ్చింది.
విశేషం :ఆసవము = చెరుకురసముతో చేయబడిన మద్యము.
8వ పద్యం :
ఉ. ఈ యఘ మూరకే విడువదీ విపరీతము దారుణంబు; నే
దో యొకనాఁడు చండి యిలు దూరి మహా ప్రళయంబులీల రా
జేయుము భారతీయునెడ జేసిన పాపఫలంబుమీకు; కా
జేయుధనంబు వడ్డిగ్రసీ యించినరీతి; గ్రహింపుడెంతయున్.
ప్రతిపదార్థం :
ఈ + అఘము = ఈ పాపం
ఊరకే విడువదు = ఊరికే పోదు
ఈ విపరీతము = ఇంతమంది భారతీయుల్ని పొట్టన పెట్టుకోవడం
దారుణంబును = చాలా దుర్మార్గమైన పని
కాజేయు ధనంబు = దోచుకున్న ధనాన్ని
వడ్డీ గ్రసియించిన రీతిన్ = వడ్డీతో సహా మింగినట్లు
భారతీయుని + ఎడన్ = భారతీయుల పట్ల
చేసిన పాపఫలంబు = మీరు చేసిన పాపఫలితం అనుభవించక తప్పదు
మీకు = ఆంగ్లేయులైన మీకు
ఏదో + ఒకనాఁడు = ఏదొక రోజున
చండి = కాళికామాత
ఇలదూరి = భారతీయుని ఇంట చేరి
మహాప్రళయంబులీలన్ = గొప్ప ప్రళయాన్ని
రాజేయును = సృష్టిస్తుంది
ఎంతయున్ = ఈ విషయాలను బాగా (మిక్కిలి)
గ్రహింపుడు = గుర్తుంచుకోండి
భావం : ఈ పాపం ఊరికే పోదు. ఇంతమంది భారతీయుల్ని పొట్టన పెట్టుకోవడం చాలా దారుణం. మీరు చేసిన పాపఫలితం అనుభవించక తప్పదు. ఏదో ఒకనాడు దోచుకున్న ధనాన్ని వడ్డీతో సహా మింగినట్లు భారతీయుల పట్ల చండి (కాళికా) భారతీయుని ఇంట చేరి మహాప్రళయాన్ని సృష్టిస్తుంది. ఈ విషయాలను బాగా గుర్తుంచుకోండి.
9వ పద్యం :
సీ. బానిసత్వము నుగ్గు పాలఁ బోసిన దోషి
అన్నవస్త్రము లాచి కొన్న ఖలుఁడు
కాటకం బనెడు రక్కసిని దెచ్చినపంద
కక్షలఁ బెంచిన రాక్షసుండు
నిర్బంధ శాసన నిచయమార్చినజాణ
పన్ను వేసిన మహా పాతకుండు
మత్తువస్తువు లమ్మి విత్తముఁ గొనుద్రోహి
కయ్యాలఁ బెంచిన కఠినతముఁడు.
తే. కలికిఁ జెలికాఁడు యమునకు వలపుకాఁడు
మోసములకు ఠావు, విరోధములకు ప్రోవు
దుర్గణంబులకాణాచి తులువ, బూచి.
ఈ చికాకుల నించె మా యించెతేఁడు.
ప్రతిపదార్థం :
బానిసత్వమున్ + ఉగ్గుపాలన్ + పోసిన దోషి = భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసిన పాపాత్ముడు ఆంగ్లేయుడు,
అన్నవస్త్రములు + ఆచికొన్న ఖలుఁడు = అన్నవస్త్రాలను దోచుకున్న దుర్మార్గుడు
కాటకంబు + అనెడు రక్కసినిన్ + తెచ్చిన పంద = కరువనే రాక్షసిని తెచ్చిన పిరికివాడు,
కక్షలన్ + పెంచిన రాక్షసుండు = భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించిన రాక్షసుడు,
నిర్ + బంధ శాసన నిచయము + ఆర్చిన జాణ = బలవంతంగా భారతీయుల్ని అణచివేసే శాసనాలు తెచ్చిన నేర్పరి,
పన్ను వేసిన మహాపాతకుండు = భరించలేని పన్నులను వేసిన మహాపాపాత్ముడు
మత్తు వస్తువులు + అమ్మి విత్తమున్ + కొనుద్రోహి = విదేశీ మత్తు వస్తువులనమ్మి మన సంపదనంతా దోచుకున్న ద్రోహి
కయ్యాలను + పెంచిన కఠినతముఁడు = భారతీయుల మధ్య తగవులను పెంచిన కఠిన హృదయుడు
కలికిన్ + చెలికాఁడు = చెడును ప్రేరేపించే కలి పురుషుడికి వీడు చెలికాడు.
యమునకు వలపుకాఁడు = ప్రాణాలను హరించే యమునకు ఇష్టమైనవాడు
మోసములకు రావు = ఈ ఆంగ్లేయుడు మోసాలకు స్థానం
విరోధములకు ప్రోవు = విరోధాలకు నిలయం
దుర్గుణంబుల కాణాచి = చెడుగుణాలకు మూలకేంద్రం
తులువ = కుటిలమైన బుద్ధి కలవాడు
బూచి = భారతీయులను భయపెట్టు భూతం వంటివాడు
ఈ చికాకుల నించె = ఇలాంటి కలతలను కలిగించి
మా యించె తేఁడు = భారతీయుల్ని మోసం చేసిన వాడు ఆ ఆంగ్లేయుడు
భావం : భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసినటువంటి పాపాత్ముడు ఆంగ్లేయుడు. అన్నవస్త్రాలను దోచుకున్న దుర్మార్గుడు. కరువనే రాక్షసిని తెచ్చిన పిరికివాడు. భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించిన రాక్షసుడు. బలవంతంగా భారతీయుల్ని అణచివేసే శాసనాలను తెచ్చిన నేర్పరి. భరించలేని పన్నులను వేసిన మహాపాపాత్ముడు. విదేశీ మత్తువస్తువులనమ్మి మన సంపదనంతా దోచుకున్న ద్రోహి. భారతీయుల మధ్య తగవులను పెంచిన కఠిన హృదయుడు. చెడును ప్రేరేపించే కలిపురుషుడికి వీడు స్నేహితుడు. ప్రాణాలను హరించే యమునకు ఇష్టమైనవాడు. ఈ ఆంగ్లేయుడు మోసాలకు స్థానం. విరోధాలకు నిలయం. చెడు గుణాలకు మూల కేంద్రం. కుటిలమైన బుద్ధి కలవాడు. భారతీయులను భయపెట్టు భూతం వంటివాడు. ఇలాంటి కలతలను సృష్టించి భారతీయుల్ని మోసం చేసినవాడు ఆ ఆంగ్లేయుడు.
10వ పద్యం :
సీ. కవటాకులను భోలఁ గల పసిబాలుర
నెండలో నడిపి హింసించినారు
నడచిపోయెడు వారిఁ బడఁద్రోసి, ప్రజలను
బొట్టపైఁ బ్రాఁకించి పొడిచినారు
నిరపరాధుల నెల్ల నిలఁబెట్టి పిట్టలు
చితుకునట్టులఁగొట్టి చెనకినారు
శుద్ధాంతకాంతలఁ జొచ్చి, కొప్పులఁ బట్టి
మానభంగము జేసి మరలినారు
వేల ప్రజల తుపాకుల పాలు జేసి
కోసి, ప్రాణార్ధములు లాగి వేసినారు
తెలిసి పంజాబు పరువును దీసినారు
కలుషమని జంకఁబోక రాకాసిమూక.
ప్రతిపదార్థం :
కవట + ఆకులను + పోలన్ గల పసిబాలురన్ = లేత ఆకుల్లాంటి పసిపిల్లలను
ఎండలో నడిపి హింసించినారు = ఎండలో నడిపించి తీవ్రంగా హింసించి
నడచిపోయెడు వారిన్ + పడన్ + త్రోసి = నడుచుకుంటూ వెళ్ళేవారిని. కిందకు తోసి
ప్రజలను + పొట్టపైన్ + ప్రాఁకించి = వారి పొట్టలపై పాకించారు
పొడిచినారు = అతిక్రూరంగా పదునైన ఆయుధాలతో పొడిచేవారు
నిః + అపరాధులన్ + ఎల్లన్ నిలఁబెట్టి = ఏ తప్పులు చేయని వారిని కూడా నిలబెట్టి
పిఱ్ఱలు చితుకునట్టులన్ + కొట్టి, చెనకినారు = వారి పిఱ్ఱలు చితికిపోయేలా కొట్టి, బాధించారు
శుద్ధాంతకాంతలన్ + చొచ్చి = స్త్రీలు ఏకాంతంగా నివసించే అంతఃపురాలలోకి ప్రవేశించి,
కొప్పులన్ + పట్టి, మానభంగము + చేసి = వారి జుట్టు పట్టి ఈడ్చి, వారి మానాన్ని (అత్యాచారం చేసి) హరించి
మరలినారు = వెళ్ళిన దుర్మార్గులు
వేలప్రజలన్ తుపాకుల పాలు + చేసి = వేలాది మంది ప్రజలను తమ తుపాకులతో కాల్చి చంపి
కోసి = కత్తులతో కోసి
ప్రాణ + అర్థములు లాగి వేసినారు = వారి ప్రాణాలనే సంపదలను తీసుకున్నారు
కలుషము + అని తెలిసి జంకన్ + పోక = చేయడం పాపమని తెలిసి కూడా ఏ బెదురు లేక
రాకాసిమూక = ఈ తెల్లదొరలనే రాక్షసగుంపు
పంజాబు పరువును తీసినారు = పంజాబు పరువును తీసింది
భావం: తెల్లదొరలనే రాకాసిగుంపు భారతీయుల్ని అనేక చిత్రహింసలకు గురిచేసింది. లేత ఆకులలాంటి పసిపిల్లలను ఎండలో నడిపించి తీవ్రంగా హింసించారు. నడుచుకుంటూ వెళ్ళేవారిని కిందకు తోసి, వారి పొట్టలపై పాకించారు. అతిక్రూరంగా పదునైన ఆయుధాలతో పొడిచేవారు. ఎటువంటి తప్పులు చేయనివారిని సైతం నిలబెట్టి వారి వెనుకభాగాలు చితికిపోయేలా అత్యంత కిరాతకంగా కొట్టారు. స్త్రీలు ఏకాంతంగా నివసించే అంతఃపురాలలోకి ప్రవేశించి వారి జుట్టుపట్టి ఈడ్చి వారి గౌరవానికి భంగం కలిగించి వెళ్ళేవారు. వేలాది మంది ప్రజలను తమ తుపాకులతో కాల్చి చంపి, వారి ప్రాణాలనే సంపదలను తీసుకున్నారు. పాపమన్న భావన ఏ మాత్రం ‘లేకుండా ఈ తెల్లదొరలనే రాక్షసగుంపు పంజాబు పరువును తీసింది.
11వ పద్యం:
చం. జలియనుబాగులో జనలఁ జంపిన రక్తము వర్షపాతముం
బలెఁబ్రవహించె; మొండెములఁ బ్రాణము లుండివవారి యార్తిసం
కలితరవంబు గర్జనము కైవడి మ్రోసె దిగంతభూములన్;
ప్రళయము వచ్చెనో యనుచు పౌరులు పారిరి ప్రాణభీతులై.
ప్రతిపదార్థం :
జలియనుబాగులో
జనులన్ + చంపిన = డయ్యరు జలియన్ బగులో ఎంతో మంది భారతీయులను చంపగా
రక్తము వర్షపాతమున్ బలెన్ = వారి రక్తము, వర్షంలాగా పడి
ప్రవహించెన్ = ఏరులై పారింది
మొండెములన్ = తలలు తెగిన శరీరాలతో
ప్రాణములు + ఉండిన = నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న
ఆర్తి సంకలిత రవంబు = వారి ఆర్తనాదాలు
గర్జనముకైవడి మ్రోసె దిగంత భూములన్ = దిక్కులంతటా ప్రతిధ్వనిస్తున్నాయి
ప్రళయము వచ్చెనో + అనుచు = ఈ భయంకర గర్జనలకు ఏదో వినాశం వచ్చిందేమోనని
పౌరులు = కొందరు పౌరులు
ప్రాణభీతులు + ఐ = ప్రాణభయంతో
పారిరి = అక్కడి నుండి పరుగులు తీశారు
భావం: డయ్యరు దురంతానికి జలియన్ వాలా బాగ్ ఎంతో మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారి రక్తం ఏరులైపారింది. తలలు తెగిన శరీరాలతో, నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్తనాదాలు దిక్కులంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ భయంకర గర్జనలకు ఏదో వినాశం సంభవిస్తుందేమోనని కొందరు పౌరులు భయంతో అక్కడి నుండి పరుగులెత్తారు.