Access to the AP 10th Class Telugu Guide 12th Lesson సూక్తి సుధ Questions and Answers are aligned with the curriculum standards.
సూక్తి సుధ AP 10th Class Telugu 12th Lesson Questions and Answers
చదవండి ఆలోచించి చెప్పండి.
దాక్షిణాత్య భాషల్లో ప్రథమ వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు. అన్నమయ్య తెలుగులో పద కవితా రచనకు శ్రీకారం చుట్టడం తెలుగుజాతి అదృష్టం. “వాచం గేయంచ కురుతే యః స వాగ్గేయకారకః” అని సంస్కృత లాక్షణికుని నిర్వచనం. అంటే వాగ్గేయకారుని రచన ధాతుమాతువుల సంయోగం కలదన్నమాట. ధాతువు అంటే సంగీతం, మాతువు అంటే సాహిత్యం. ఒక్క వాక్యంలో కుదించి చెప్పాలంటే ఎవరు స్వయంగా గీత రచన చేసి స్వరాలు కూర్చి గానం చేస్తారో వారు వాగ్గేయకారులు. అన్నమయ్య 32 వేల కీర్తనలను రచించాడని చారిత్రకుల అంచనా. అన్నమయ్య పదాల్లో భావపుష్టి, రాగదృష్టి సమాంతరంగా సాగిపోతాయి. అన్నమయ్య కృతుల్లో ఒకవైపు ఆధ్యాత్మిక దృష్టి మరొకవైపు సామాజిక దృష్టి హృదయంగమఫణితిలో అగుపిస్తాయి అత్యంత పరిణత పద్య కవుల రచనలతో సరితూగే పదాలతో పాటు నాటి జానపద గీతాల బాణీల్లో అన్నమయ్య ఆణిముత్యాల్లాంటి పాటలు రచించారు. – (డా||సి. నారాయణ రెడ్డి)
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1.
దాక్షిణాత్య భాషలలో ప్రథమ వాగ్గేయకారుడు ఎవరు?
జవాబు:
దాక్షిణాత్య భాషలలో ప్రథమ వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు.
ప్రశ్న 2.
వాగ్గేయకారులు అని ఎవరిని అంటారు?
జవాబు:
ఎవరు స్వయంగా గీత రచన చేసి స్వరాలు కూర్చి గానం చేస్తారో వారు వాగ్గేయకారులు.
ప్రశ్న 3.
అన్నమయ్య కృతుల్లో ఏమి కనిపిస్తుంది?
జవాబు:
అన్నమయ్య కృతుల్లో ఆధ్యాత్మిక, సామాజిక దృష్టి హృదయానికి హత్తుకునే రీతిలో కనిపిస్తాయి.
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
మనసు ఎటువంటిది?
జవాబు:
మనసు చంచలమైనది. స్థిరంగా ఉండదు. రకరకాల ఆలోచనలను కలిగిస్తుంది.
ప్రశ్న 2.
మానవుడు ఎప్పుడు ఉన్నతుడౌతాడు?
జవాబు:
పేద, ధనిక, కుల, మత తేడాలు లేకుండా మనిషి ఉండాలి. స్వార్థం ఉండకూడదు. సమాజాన్ని, జీవితాన్ని బాగా పరిశీలించి, నిజాలు తెలుసుకొని బ్రతికిన మానవుడు ఉన్నతుడు అవుతాడని కవి అంటున్నాడు.
ప్రశ్న 3.
ఎటువంటి దుర్గుణాలను వదిలివేయాలి?
జవాబు:
మానవ సహజమైన ఈర్ష్య, ద్వేషం, అసూయ, కామం, కోపం, లోభం, గర్వం మొదలైన దుర్గుణాలను వదిలి వేయాలి.
ప్రశ్న 4.
మానవులకు సద్గతి ఎప్పుడు కలుగుతుంది?
జవాబు:
మానవుడు ఆత్మనిగ్రహం కలిగి ఉండాలి. అంతః శత్రువులను జయించాలి. ఆత్మ పరిశీలన చేసుకుంటూ జీవిస్తే సద్గతి కలుగుతుంది. ఇతరులను దూషించ కూడదు. మంచిని పెంచుకుంటూ వెళ్లాలి.
అవగాహన – ప్రతిస్పందన
ఇవి చేయండి
అ) కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. రాయండి.
ప్రశ్న 1.
పాఠంలోని సంకీర్తనలను రాగయుక్తంగా పాడండి. వాటి భావాలు చెప్పండి.
జవాబు:
విద్యార్థి
ప్రశ్న 2.
విరసవర్తనం అంటే ఏమిటి? దానిని ఎందుకు విడనాడాలి?
జవాబు:
పరధనాపేక్ష కలిగి ఉంటూ, నిందలపాలు అవుతూ బతకడమే విరసవర్తనం. దానిని విడనాడాలి. కష్టపడి ధనం సంపాదించుకోవాలి. అవమానాలకు, అనుమానాలకు చోటు లేకుండా బతకాలి. దోపిడి, దొంగతనం ద్వారా వచ్చే సంపద కోసం ఎదురు చూడకూడదు. విరసవర్తనాన్ని విడనాడినప్పుడు జీవితం సుఖవంతం అవుతుంది.
ప్రశ్న 3.
ఏది జీవిత లక్ష్యం కావాలని అన్నమయ్య ప్రబోధించాడు?
జవాబు:
అన్నమయ్య కులమూ, జాతి, మతమూ ఇలాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వొద్దని అన్నారు. స్వార్థం లేకుండా జీవించాలని అంటున్నారు. పేద, ధనిక భేదాలు లేకుండా, అంతస్తులు తేడా లేకుండా సుఖంగా బతకాలని అంటున్నారు చదువు చదివినా, ఎన్ని వేషధారణలు వేసినా, అందులో నీతిని గ్రహించి మసలుకోవాలని సందేశం ఇచ్చారు. మనుషుల్లో ఎక్కువ, తక్కువ తేడాలు లేకుండా, అందరిని సమానంగా చూసేవాడు మహాత్ముడని చెప్పారు. అలాంటి గుణాలతో నీతిగా బ్రతకడమే జీవిత లక్ష్యం కావాలని తెలిపారు.
ఆ) కింది గద్యం చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
మన దేశంలో ఏ ఊరిలోనైనా, ఏ గుడిలోనైనా, ఏ ఇంట్లో నైనా ప్రభాత వేళల్లో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గళం నుంచి వెలువడే విష్ణు సహస్రనామాలు, సుప్రభాత గీతాలు, భజనలు వినపడుతూనే ఉంటాయి. మన దేశీయుల్నే కాదు విదేశీయుల్ని సైతం పరవశింపచేసిన మధురమైన కంఠం ఆమెది. కర్ణాటక శాస్త్రీయ సంగీత సాగరాన్ని మధించి అమృతోపమానమైన రాగ ఝరులను అశేష జనావళికి అందించిన అమరమూర్తి ఆమె.
త్యాగయ్య కృతులు, శంకరాచార్యుల శ్లోకాలు, ఆండాళ్ తిరుప్పావై భక్తి గీతాలు, అనేక మంది వాగ్గేయకారుల కీర్తనలు, ఆమె గళసీమ నుంచి జాలువారి శ్రవణానందాన్ని కలిగించాయి. సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం, హిందీ మొదలైన భాషలలో ఆమె గానం చేశారు. దేశవిదేశాల్లో ఎన్నో కచేరీలు చేసి తన గంధర్వగానంతో శ్రోతలను సమ్మోహితులను చేశారు. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా వంటి వివిధ దేశాల్లో లెక్కకు మించి కచేరీలు నిర్వహించి, కళలకు ఎల్లలు లేవని రుజువు చేశారు. 1937 నుంచి నాలుగేళ్లలో సేవా సదన్, శకుంతల, సావిత్రి, మీరా వంటి చలన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఆ తర్వాత తన పూర్తికాలాన్ని, జీవిత పర్యంతం సంగీత రంగానికే అంకితం చేశారు. సంగీత కళానిధి, సప్తగిరి సంగీత విద్వన్మణి వంటి బిరుదులు, పద్మ విభూషణ్, భారతరత్న, రామన్ మెగసెసే వంటి పురస్కారాలు ఆమెకు లభించాయి.
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
సుబ్బులక్ష్మి స్వర ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
ఆమె స్వరం మన దేశీయుల్నే కాదు, విదేశీయుల్ని సైతం పరవశింపజేసింది.
ప్రశ్న 2.
సుబ్బులక్ష్మి ఏ రకమైన పాటలు పాడారు?
జవాబు:
సుబ్బులక్ష్మి త్యాగయ్య కృతులు, శంకరాచార్యుల శ్లోకాలు, ఆండాళ్ తిరుప్పావై భక్తిగీతాలు, అనేకమంది వాగ్గేయకారుల కీర్తనలు పాడారు.
ప్రశ్న 3.
సుబ్బులక్ష్మికి వచ్చిన బిరుదులు, అవార్డులు ఏవి?
జవాబు:
సంగీత కళానిధి, సప్తగిరి సంగీత విద్వన్మణి వంటి బిరుదులు, పద్మ విభూషణ్, భారతరత్న, రామన్ మెగసెసే వంటి పురస్కారాలు సుబ్బులక్ష్మికి లభించాయి.
ప్రశ్న 4.
పై పేరాకు ఒక శీర్షిక పెట్టండి.
జవాబు:
సంగీత విద్వన్మణి సుబ్బులక్ష్మి.
ఇ) కింది కీర్తన చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప. శాంతము లేక సౌఖ్యము లేదు
సారసదళనయన ||శాం||
అ.ప. దాంతునికైన వేదాంతునికైన ||శాం||
చ. దార సుతులు ధన ధాన్యములుండిన
సారెకు జపతప సంపద గల్గిన ||శాం||
యాగాది కర్మములన్నియుఁబేరైన
బాగుగ సకలహృద్భావముఁదెలిసిన ||శాం||
ఆగమశాస్త్రము లన్నియు జదివిన
భాగవతులను బాగుగ జేఁసిన ||శాం||
రాజాధిరాజ శ్రీ రాఘవ త్యాగ
రాజ వినుత సాధురక్షక తనకుప ||శాం||
– త్యాగరాజ కీర్తనలు
ప్రశ్నలు – జవాబులు :
ప్రశ్న 1.
శాంతము లేకపోతే ఏమి ఉండదు?
జవాబు:
శాంతము లేకపోతే సుఖము ఉండదు.
ప్రశ్న 2.
త్యాగయ్య ఈ కృతిలో ఎవరిని, ఏమని సంబోధించాడు?
జవాబు:
త్యాగయ్య ఈ కృతిలో శ్రీరాముడిని సారసదళనయన, రాజాధిరాజ, సాధురక్షక అని సంబోధించారు.
ప్రశ్న 3.
ఏవి ఉన్నా సుఖము ఉండదు?
జవాబు:
భార్య, పిల్లలు, ధనం, ధాన్యం ఉన్నా సుఖము ఉండదు.
ప్రశ్న 4.
కీర్తన ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
ఈ కీర్తన రాసిన కవి ఎవరు?
ఈ) పాఠం ఆధారంగా కింది వాక్యాలకు అర్థసందర్భములు రాయండి.
ప్రశ్న 1.
నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే!
జవాబు:
కవిపరిచయం: ఈ వాక్యం ఆచార్య ఎస్. గంగప్ప గారు రచించిన “సాహిత్యాను శీలన” అనే గ్రంథం నుండి గ్రహించిన ‘సూక్తిసుధ’ అనే పాఠ్యాంశంలోనిది.
సందర్భం : భగవంతుని సృష్టిలో హెచ్చుతగ్గులు ఉండవు. అందరూ సమానమే అని అన్నమయ్య అన్నాడని చెబుతున్న సందర్భంలోనిది.
అర్థం: హాయిగా నిద్రబోయే రాజు నిద్ర ఒక్కటే?
భావం : సమాజంలో అందరూ సమానమే. దేవుడి సృష్టిలో అందరూ ఒక్కటే. పట్టు పాన్పుల మీద నిద్రించే రాజు నిద్ర, నేల మీద పడుకునే సేవకుడి నిద్ర ఒక్కటే, ఇద్దరూ హాయిగా నిద్రపోతారని భావం.
ప్రశ్న 2.
పరధనముల యాస పాసినగాక
జవాబు:
కవిపరిచయం: ఈ వాక్యం ఆచార్య ఎస్. గంగప్ప గారు రచించిన “సాహిత్యాను శీలన” అనే గ్రంథం నుండి గ్రహించిన ‘సూక్తి సుధ’ అనే పాఠ్యాంశంలోనిది.
సందర్భం : పరనింద పనికిరాదు. ఆత్మ ప్రశంస మంచిది కాదు. మనసు చంచలమైనది, మనిషి మంచిని పెంచుకొని సద్ధతి వైపు వెళ్లాలని కవి చెబుతున్న సందర్భంలోనిది.
అర్థం: పరధనాపేక్ష పనికిరాదు.
భావం : సమాజంలో కొందరు సులభంగా డబ్బు సంపాదించడానికి అడ్డదారులు తొక్కడం, దోపిడీలు చేయడం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. పరధనాపేక్ష లేకుండా జీవించాలని భావం.
ప్రశ్న 3.
ఈ విశ్వంలో కులము, జాతి, మతాలకు ఏనాడూ ప్రాధాన్యం లేదు.
జవాబు:
కవిపరిచయం: ఈ వాక్యం ఆచార్య ఎస్. గంగప్ప గారు రచించిన “సాహిత్యాను శీలన” అనే గ్రంథం నుండి గ్రహించిన ‘సూక్తిసుధ’ అనే పాఠ్యాంశంలోనిది.
సందర్భం: కవి, సమాజంలోని కొందరు స్వార్థపరులు చూపించే భేదాలు గురించి చెబుతున్న సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం: ఈ లోకంలో కుల, మత, జాతి భేదాలకు ఎప్పుడూ ప్రాధాన్యం లేదు.
భావం: కొందరు స్వార్ధపరులు కుల, మత, జాతి భేదాలు కల్పించి, సుఖంగా సాగే జీవితాలలో చిచ్చు పెడతారు. మానవులంతా ఒక్కటే, అందరూ ఈ భేదాలను వదిలి ఉత్తమ జీవితాన్ని గడపాలని, అలాంటి భేదాలకు ఏనాడూ ప్రాధాన్యం లేదని కవి భావన.
ఉ) కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
అన్నమయ్యకు గల బిరుదులేవి?
జవాబు:
పద కవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడని అన్నమయ్యకు బిరుదులు ఉన్నాయి.
ప్రశ్న 2.
ధన సంపాదన గురించి కవి ఏమన్నాడు?
జవాబు:
ఇతరుల ధనం మీద ఆశ పడకూడదు. కష్టపడి ధనాన్ని సంపాదించాలి.
ప్రశ్న 3.
ఏది ఉత్తమ జీవితం?
జవాబు:
స్వార్ధం లేకుండా, నిందలపాలు కాకుండా, ఆత్మ పరిశీలన చేసుకుంటూ జీవించడమే ఉత్తమ జీవితం.
ప్రశ్న 4.
ఏడుగడలు అని వేటిని అంటారు?
జవాబు:
గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవం, దాత వీటిని ఏడుగడలు అంటారు.
వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
అరిషడ్వర్గాల గురించి అన్నమయ్య ఏమన్నాడు?
జవాబు:
మానవుడు బయటి శత్రువులను జయించే ముందు తన అంతశ్శత్రువులైన (లోపలి) అరిషడ్వర్గాల్ని జయించవలసి ఉంటుందని అన్నమయ్య అన్నాడు. అరిషడ్వర్గాలు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీటిని మానవులు జయించాలి. లేదంటే ఇవి మనపై అధికారం చేసి, మనల్ని వశపరుచుకుంటాయి. అరిషడ్వర్గాలను జయించడానికి ఆత్మ నిగ్రహం అవసరమని అన్నమయ్య చెప్పారు. ఈ అరిషడ్వర్గాలను జయించకలిగే శక్తి, ఆ భగవంతుడు మనకు ఇచ్చాడు. అరిషడ్వర్గాలను సాధన ద్వారా జయించాలి.
ప్రశ్న 2.
అన్నమయ్య ఎవరిని అసహ్యించుకున్నాడు? ఎందుకు?
జవాబు:
ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఇతరులలోని దుర్గుణాలను వేలెత్తి చూపేవారిని, సోమరిపోతులను అన్నమయ్య అసహ్యించు కుంటున్నాడు. ఇంకా అసూయ, ద్వేషంతో ఉంటూ పరుల సొమ్ముని ఆశించేవారిని కూడా అసహ్యించుకున్నాడు. ఇతరుల నీడలో ఆధారపడి బ్రతకడం మంచిది కాదన్నారు. అలాంటి వారికి దూరంగా ఉంటూ, మనలోని నిజశక్తిని గ్రహించి ఆత్మ విశ్వాసం పెంచుకోవాలన్నారు. మానవ ప్రయత్నంతో ఏదైనా సాధించవచ్చు గానీ విజయగర్వం పనికిరాదన్నాడు. అలాంటి అసహ్యించుకునే గుణాలు కలిగిన వారికి దూరంగా ఉండాలన్నాడు.
ప్రశ్న 3.
మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు?
జవాబు:
ఇతరుల ధనాన్ని ఆశించకూడదు. సులభ ధనం కోసం వెంపర్లాడకూడదు. దోపిడి ద్వారా సంపాదించకూడదు. నిందల పాలు కాకూడదు. స్వార్ధం ఉండకూడదు. జాతి, మత, కులాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. సుఖమయ జీవితాలలో చిచ్చు పెట్టే ఆలోచనలు ఉండకూడదు. మనుషులను ఎక్కువ, తక్కువ భేదాలతో చూడకూడదు. మన చేష్టల ద్వారా ఇతరులకు దుఃఖం కలిగించకూడదు. ఏం చదువుకున్నా, ఏ పనిచేసినా అందులో నీతిని గ్రహించి బతకాలి. ఇలాంటి లక్షణాలతో ఉన్న మనిషి ఉన్నతుడవుతాడు.
ఆ) కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
పాఠం ద్వారా మీరు గ్రహించిన విలువలను మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు:
పరిచయం:
“సూక్తి సుధ” అనే ఈ పాఠ్యాంశాన్ని ఆచార్య ఎస్. గంగప్ప గారు రచించారు. ఇందులో అన్నమయ్య తన కీర్తనల ద్వారా మానవ జీవితాన్ని ఎలా సార్ధకం చేసుకోవాలో, మనిషి ఎలా ఉన్నతుడు కావాలో చెప్పిన విధానాన్ని కవి, మనకు తెలియజేస్తున్నాడు.
పాఠం ద్వారా గ్రహించిన విలువలు:
మానవుడు ఎన్ని చదువులు చదువుకున్నా, ఎంత పాండిత్యాన్ని సంపాదించినా, పెద్దల మాటలు ఎన్ని విన్నా పాపపు పనులు చేయకూడదు. మంచి శీల సంపదని పెంపొందించుకోవాలి.
ఇట్లాంటి విషయాలు తెలిసికూడా మానవులు తప్పులు చేస్తూనే ఉన్నారు.
పరనింద పనికిరాదు. మనల్ని మనమే పొగుడుకోరాదు. దీనినే ‘ఆత్మ ప్రశంస’ అన్నాడు అన్నమయ్య, మనస్సు స్థిరంగా ఉండదు. నిమిష నిమిషానికి బుద్ధి చలిస్తూనే ఉంటుంది. మనలో దోషాలు పెట్టుకుని కూడా ఇతరుల్ని దూషించడం. మంచిది కాదు. ఇతరుల సంపద పట్ల ఆశ ఉండకూడదు. సులభ సంపాదన కొరకు వెంపర్లాట వద్దు. కష్టపడి ధనాన్ని సంపాదించుకోవాలి. అవమానాలు, అనుమానాలు, నిందలపాలు కాకుండా జీవించడం ఉత్తమ లక్షణం అనిపించు కుంటుంది. మంచి నడవడిక కలిగి ఉన్నప్పుడే జీవితం సుఖమయమవుతుంది. దీనినే అన్నమయ్య సరసవర్తనం అంటున్నాడు. సరసవర్తనం సమాజానికంతటికీ ఉపకరిస్తుంది.
జాతి, మత, కుల భేదాలు ఉండకూడదు. పేద, ధనిక తేడాలు చూపకూడదు. ఎక్కువ, తక్కువ భేదాలు కొందరు కల్పించుకున్నా, వీటిలోని సత్యాన్ని తెలుసుకున్నవాడు మహాత్ముడు అవుతాడు. మానవుడు బానిసగా బతకడం కంటే భగవంతునికి దాసుడుగా ఉండటం మంచిది. స్వలాభం కోసం ఇతరులను మెచ్చుకోవడం, ఇతరులను యాచించడం మనల్ని, మనం తక్కువ చేసుకోవడమే అని అన్నమయ్య చెప్తారు. పక్షిగా పుట్టినా మంచిదే కానీ, ఇతరులకు ఊడిగం (బానిసత్వం) చేయడం మానవ లక్షణం కాదు.
అసలు భగవంతుని సృష్టిలో హెచ్చు, తక్కువలు లేవు. రాజు నిద్ర, సేవకుడి నిద్రా ఒక్కటే. ఏనుగు మీద, కుక్క మీద కాసే ఎంద ఒకటే ధనవంతుడికి, పేదవాడికి పగలు, రాత్రి ఒకటే అని చెప్తూ “అందరూ సమానులే” అని భావాన్ని పలికించాడు.
మానవులకు ఏ పనిలోనైనా ఆత్మ పరిశీలన ముఖ్యం. ఇతరులను నిందించే ముందు ఆలోచించుకోవాలి. ఇతరులను దూషించే ముందు, మనలోని దుర్గుణాలను పరిశీలించుకోవాలి. మానవ సహజమైన ఈర్ష్య, ద్వేషం, అసూయలను వదిలివేయాలి. దేనికైనా ప్రయత్నం చేయాలి. ప్రయత్నంలో గెలుపు రాగానే గర్వించకూడదు. ఒకవేళ ఓటమి ఎదురైతే ఇతరుల మీద నిందలు వేయకూడదు.
సోమరితనం మంచిది కాదని తెలియజేశారు. ఒకరిమీద ఆధారపడి బ్రతికేవారిని అసహ్యించుకున్నారు. మనలోని శక్తిసామర్ధ్యాలతో దేన్నైనా సాధించగలగాలని గొప్ప సందేశం ఇచ్చారు. ఇతరుల సొమ్ముతో గొప్పవారు కావాలనే ఆలోచన నీచమైందని తెలిపారు. మన నిజశక్తి మీద ఆధారపడాలి. ఆత్మ విశ్వాసంతో జీవితంలో ముందుకు వెళ్లాలి.
మనలోని అంకశుత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు (అరిషడ్వర్గాల)ను జయించాలి. బయట శత్రువుల కంటే ఇవి మనల్ని వశపరుచుకుంటాయి. వాటిని జయించడానికి ఆత్మనిగ్రహం కావాలి. ఈ శక్తిని భగవంతుడు మనకు ఇచ్చాడు. అరిషడ్వర్గాలకు మనమే అధిపతులం. వీటిని సాధన ద్వారా జయించాలని తెలిపాడు. సమయాన్ని, వయస్సు (ప్రాయం)ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ముగింపు: మానవ జీవితం ఒక నాటకం. మనం ఎంత శాస్త్రాన్ని, విజ్ఞానాన్ని సంపాదించినా జీవితంలో రెండే రెండు ఘట్టాలు ఉంటాయి. అవి పుట్టడం, గిట్టడం (చనిపోవడం). మిగిలినదంతా నాటకమే. ఈ నాటకం అనే బతుకు నుంచి విముక్తి పొందాలని అన్నమయ్య అందరికీ అర్థమయ్యే రీతిలో జీవితతత్త్వాన్ని తెలిపారు.
ప్రశ్న 2.
పరనింద, పరధనాపేక్ష, సేవ, కులమతాలు, ఆత్మ పరిశీలనలను గురించి వ్యాఖ్యానించండి.
జవాబు:
కవిపరిచయం :
‘సూక్తి సుధ’ అనే ఈ పాఠ్యాంశాన్ని ఆచార్య ఎస్. గంగప్ప గారు రచించారు. ఇందులో అన్నమయ్య తన సంకీర్తనలలో పరనింద, పరధనాపేక్ష, సేవ, కులమతాలు, ఆత్మ పరిశీలన మొదలైన విషయాల గురించి ఏమేమి చర్చించారో తెలిపారు.
1) పరనింద :
‘పరనింద’ అంటే ఇతరులను నిందించడం. మనలో దోషాలు ఉన్నా సరే వాటి గురించి, ఆలోచించకుండా ఇతరుల్ని దూషించడం మానవ సహజమని అన్నమయ్య అన్నారు. ఎంత చదువు చదువుకున్నా, ఎంత పాండిత్యం పొందినా పాపపు చర్యలు చేయకూడదు. పరనింద పనికిరాదు అలా అని ఆత్మ ప్రశంస (మనల్ని మనమే పొగుడు కోవడం) కూడా మంచిది కాదు. మనసుకు చలించే స్వభావం ఉంటుంది. బుద్ధిని స్థిరంగా ఉంచుకుని, ఇతరులను నిందించకుండా, మంచిని పెంచుకోవాలని అన్నమయ్య తన కీర్తన ద్వారా తెలిపారు.
ఎంత చదివిన నేమి వినిన తన
చింత యేల మాను సిరులేల కలుగు
ఇతర దూషణములు యెడసినగాక
మతి చంచలము గొంతు మానిన గాక
గతియేల కలుగు దుర్గతులేల మాను
2) పరధనాపేక్ష :
పరధనాపేక్ష అనగా ఇతరుల సంపద పట్ల ఆశ కలిగి ఉండటం. ఈనాడు సమాజంలో కొందరు సులభదనం (Easy Money) కోసం, అడ్డదార్లు తొక్కుతూ, తప్పులు చేస్తున్నారు. ఎలాంటి కష్టం లేకుండా ధనం ‘సంపాదించాలని అనుకోవడం సరియైన మార్గం కాదు. అలాంటి మార్గంలో ప్రయాణం చేస్తే జీవితం దుఃఖమయం అవుతుందని, అన్నమయ్య సందేశం ఇస్తున్నారు.
పరధనముల యాస పాసినగాక
అరిది నిందలు లేని యప్పుడు గాక
విరస వర్తనము విడిచినగాక
పరమేల కలుగు నాపద లేల మాను
3) సేవ : సేవ చేయడం మంచిదే. కానీ ఇక్కడ అన్నమయ్య ‘సేవ’ను ఊడిగం అన్నాడు. అంటే ఇతరులను వేడుకోవడం ద్వారా, స్వలాభం కోసం ఇతరులను యాచించడం, కొలవడం ద్వారా బానిసలుగా ఉంటూ ‘బతకడం’ అనేది మంచిది కాదని తెలిపారు. అడవిలో పక్షులు, జంతువులు ఎవరికి ఊడిగం చేయకుండా, ప్రయత్నం ద్వారా బతుకుతాయని ఉదాహరణగా చూపారు.
చీచీ నరుల దేటి జీవనము
కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక
అడవిలో మృగజాతియైన గావచ్చుగాక
వడి నితరుల గొలువగా వచ్చునా
వుడి వోయిన పక్షియై వుండనై వచ్చుగాక
విడువ కెవ్వరికైనా వేడవచ్చునా
4) కులమతాలు :
ఈనాటి సమాజంలో జాతి, మత, కులభేదాలు ఉన్నాయి. కానీ వీటికి ఏనాడూ ప్రాధాన్యం లేదని అన్నమయ్య అన్నారు. కుల, మత భేదాలు కల్పించి స్వార్ధపరులైన వారు సుఖమయ జీవితాలలో చిచ్చు రేపుతారు. సమాజంలో అశాంతిని కలిగిస్తారు. కుల, మత, చిన్న, పెద్ద తేడాలు లేని వాళ్ళు మహాత్ములని, వారు ఉన్నతంగా ఎదుగుతారని తెలుసుకోవాలి. భగవంతుని సృష్టిలో హెచ్చు, తక్కువలు లేవు. అందరూ సమానమే.
నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే !
అండనే బంటు నిద్ర అదియు నొకటే.
దినమహెూరాత్రములు తెగి ధనాఢ్యున కొకటే
వనర నిరుపేదకును వొక్కటే అవియు
5) ఆత్మ పరిశీలన :
‘ఆత్మ పరిశీలన’ అనగా తనని తాను పరిశీలించుకుని ప్రవర్తనను బేరీజు వేసుకోవడం. మానవులకు ఏ పనిలోనైనా ఆత్మ పరిశీలన ముఖ్యం. ఏదైనా మనం సాధించగానే మన విజయంగా భావించి, గర్విస్తాము. ఓటమి కలిగినప్పుడు ఇతరులను, ఓటమికి బాధ్యులను చేసి నిందిస్తాం. కానీ గెలుపు, ఓటమికి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాగే మనలో ద్వేషం, అసూయ, ఈర్ష్య వంటివి పెట్టుకుని ఇతరులను ద్వేషించడం, అసహ్యించుకోవడం చేయకూడదు. ఇటువంటి దుర్గుణాలు మనలో ఉంటే ఆత్మ పరిశీలన ద్వారా తొలగించుకోవాలి. ఇదే అన్నమయ్య సందేశం.
చదివితి తొల్లి కొంత చదివేనింకా కొంత
ఎదిరి నన్నెరుగను యెంతైన నయ్యో
వొరుల దూషింతు గాని వొక మారైన నా
దురిత కర్మములను దూషించను
ప్రశ్న 3.
పాఠం ఆధారంగా అన్నమయ్య సంస్కరణాభిలాషను గురించి రాయండి.
జవాబు:
కవిపరిచయం:
‘సూక్తి సుధ’ అనే ఈ పాఠ్యాంశాన్ని ఆచార్య ఎస్. గంగప్ప గారు రచించారు. ఇందులో అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా కోరుకున్న సంస్కరణాభిలాషను తెలిపారు.
సూక్తి సుధ – సంఘ సంస్కరణాభిలాష:
సంఘ సంస్కరణ అనగా సంఘాన్ని సంస్కరించడం. ఒకనాటి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, జాతి, కుల, మత భేదాలు, హెచ్చు తగ్గులు గురించి తెలియజేసి ప్రజలను చైతన్యపరిచే పనులను కవులు, కళాకారులు చేశారు. అన్నమయ్య తన సంకీర్తనల్లో సందర్భోచితంగా సంఘంలోని దురాచారాల గురించి ప్రస్తావించారు.
పరధనాపేక్ష :
పరధనాపేక్ష అనగా ఇతరుల సంపద పట్ల ఆశ కలిగి ఉండటం, ఆ ధనాన్ని, సంపదని దోచుకోవడానికి, దోపిడీని మార్గంగా కొందరు ఎంచుకుంటారు. ఇది సమాజంలోని ‘అవినీతి’కి సాక్ష్యంగా నిలుస్తుంది. అవినీతి లేని సమాజాన్ని కోరుకోవడం సంఘసంస్కరణలో భాగమే. ఆస్తి పాస్తులు కష్టపడి సంపాదించుకోవాలి గానీ అవినీతి ద్వారా కాదు. కనుక మానవులు పరధనాపేక్షను విడవాలని అన్నమయ్య ప్రబోధం చేశారు.
కుల, మత భేదాలు:
ఈ సమాజంలో కుల, మత భేదాలు ఉన్నాయి. కానీ వీటికి ప్రాధాన్యం ఇవ్వకూడదని అన్నమయ్య అంటున్నాడు. కొందరు స్వార్థపరులు, విచ్ఛిన్న శక్తులు సమాజాన్ని వర్ణాలుగా, వర్గాలుగా చీల్చే కుట్రలు చేస్తారు. ఈ కుట్రల వలన సమాజంలో అశాంతి ఏర్పడుతుంది. సుఖమయ జీవితాలలో చిచ్చు ఏర్పడుతుంది. ‘కులము కన్నా గుణము మిన్న’ అనే విషయాన్ని తెలుసుకోవాలి.
బానిసత్వ జీవనం :
మానవుడు బానిసగా బతకడం కంటే భగవంతునికి దాసుడిగా బ్రతకడం మంచిదని అన్నమయ్య అన్నారు. ఏదో ఆశించి ఒక మానవుడు, మరో మనిషికి ‘ఊడిగం’ చేయడం ‘బానిసత్వం’తో సమానమే. స్వలాభం కోసం ఇతరులను యాచించడం మంచిదికాదు. బతకడం కోసం ఇతరులకు సేవలు చేయవలసిన అవసరం లేదు. సభ్య సమాజంలో అందరూ సమానమే. మన ప్రయత్నం ద్వారా, కష్టం ద్వారా నీతివంతమైన జీవనం సాగించాలని సందేశం ఇచ్చారు.
హెచ్చు, తక్కువలు భగవంతుని సృష్టిలో హెచ్చు, తక్కువలు లేవు, అందరూ సమానమే. అయినా కొన్ని స్వార్థపర శక్తులు సమాజాన్ని పీడిస్తూ ఉంటాయి. కానీ అన్నమయ్య హెచ్చు, తక్కువల గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో తెలిపారు. రాజు నిద్ర, బంటు నిద్ర ఒకటే. పేదవాడికి, ధనవంతుడికి పగలు, రాత్రి ఒకటే. రకరకాల రుచులతో ‘తినేవారి ఆకలి, పచ్చడి మెతుకులు తినేవారి ఆకలి ఒక్కటే. దుర్వాసనను తీసుకెళ్లే గాలి, సువాసనను మోసుకెళ్లే గాలి కూడా ఒకటే. ఏనుగు మీద కాసే ఎండ, కుక్క మీద కాసే ఎండ ఒకటే అని చెబుతూ సర్వమానవ సమానత్వ భావనను తెలిపారు.
ముగింపు : ఈ విధంగా అన్నమయ్య తన సంకీర్తనలలో వీలు ఉన్నచోట తరుచుగా ‘సంఘసంస్కరణ’ అభిలాషను వెల్లడి చేశారు. మానవులంతా ఒక్కటే, అని ప్రబోధం చేశారు. ప్రతీ వ్యక్తి హెచ్చు తగ్గుల్ని, అవినీతి మార్గాన్ని వదిలి నీతివంతంగా జీవనం సాగించాలని సందేశం ఇచ్చారు.
ఇ) కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
అన్నమయ్య ఆరాధనోత్సవాలను గురించి తెలుపుతూ గోడపత్రిక తయారుచేయండి.
జవాబు:
అన్నమయ్య ఆరాధనోత్సవాలు.
ఆహ్వానం
పద కవితా పితామహుడు అన్నమయ్య జయంతి సందర్భంగా మే 16, 2024 నుండి మే 23, 2024 వరకు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా వారంరోజుల పాటూ అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, హరికథా | సప్తాహం నిర్వహించబడును.
తేది : 16-5-2024 నుండి 23-5-2024
వేదిక : శ్రీరామ మందిరం, ఓజిలి రాచపాళెం (గ్రామం), తిరుపతి జిల్లా.
నిర్వహణ: శ్రీ శ్రీనివాస యువజన సంఘం.
విచ్చేయుచారందరికీ అల్పాహారం అందించబడును.
ఇట్లు,
శ్రీ శ్రీనివాస యువజన సంఘం,
ఓజిలి రాచపాళెం.
ప్రశ్న 2.
మీ పాఠశాలలో జరిగే భాషోత్సవాలకు ప్రముఖ కవి వచ్చారు. తెలుగు కవుల గురించి తెలుసుకోవడానికి ప్రశ్నావళిని తయారుచేయండి.
జవాబు:
విద్యార్థి : నమస్కారం, కవిగారు. మీ నుండి తెలుగు కవుల సమాచారం తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతాను.
కవి : అలాగే నాయనా.
ప్రశ్నావళి
- నన్నయకు పూర్వం ఉన్న కవుల సమాచారం చెప్పండి.
- తిక్కనను “కవిబ్రహ్మ” అని ఎందుకు అంటారు ?
- రామాయణం రాసిన తెలుగు కవుల గురించి తెలపండి.
- ‘అష్టదిగ్గజాలు’ అంటే ఎవరు ?
- అన్నమయ్య లాగా కీర్తనలు రాసిన వారి వివరాలు తెలుపండి.
- ‘సంఘసంస్కరణ’ కోసం రచనలు చేసిన కవులు ఎవరు?
- స్వాతంత్ర్య ఉద్యమ కాలంనాటి కవుల గురించి తెలపండి.
- వచన కవిత్వంలో గొప్ప రచనలు చేసిన వారు ఎవరు?
- గేయ కవిత్వం రాసిన కవుల జాబితా చెప్పండి.
- ఇప్పటి కవుల గురించి, కవిత్వం గురించి సమాచారం ఇవ్వండి.
భాషాంశాలు
పదజాలం
అ) కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి, సొంత వాక్యాలు రాయండి.
1. అన్నమయ్య తెలుగు పద కవిత్వానికి ఆద్యుడు.
ఆద్యుడు = మొదటివాడు
సొంతవాక్యం : మహాభారతాన్ని తెలుగులో రాసిన వారిలో నన్నయ మొదటివాడు.
2. మానవులకు ధనంపై ఆపేక్ష మంచిది కాదు.
ఆపేక్ష = కోరిక
సొంతవాక్యం : ఇతరుల సంపదపై కోరిక ఉండకూడదు.
3. మంచి పనులు చేయడం వలనే సద్గతి పొందగలం.
సద్గతి = మోక్షం
సొంతవాక్యం పరోపకారం వలన మోక్షం కలుగుతుంది.
4. వాగ్గేయకారులలో అన్నమయ్య ఘనత ఎనలేనిది.
ఘనత = గొప్ప
సొంతవాక్యం : నేపథ్య గాయకులలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు గొప్పవారు.
5. ఇతరులను ఆరడి చేయడం తగదు.
ఆరడి = నింద
సొంతవాక్యం : ఎవరినీ నిందించడం తగదు.
ఆ) కింది పదాలకు సరైన పర్యాయ పదాలను పట్టికలో వెతికి రాయండి.
1. ప్రాణ = జీవం, సర
2. కోరిక = వాంఛ, ఈప్సితం
3. ఒరులు = పరులు, ఇతరులు
4. మేను = శరీరం, దేహం
5. చింత = దిగులు, బెంగ
6. స్వర్గం = దివి, నాకం
ఇ) కింది పదాలకు సరిపోయే నానార్థాలు పట్టికలో ఉన్నాయి. వాటిని గుర్తించి, రాయండి.
1. మతి = ఎఱుక, తెలివి, బుద్ధి
2. కులం = వంశం, జాతి, ఇల్లు
3. గుణం = స్వభావం, వింటినారి
4. సుధ = పాలు, అమృతం
ఈ) కింది పట్టికలో ప్రకృతి – వికృతి పదాలు కలిసి ఉన్నాయి. వాటిని వేరుచేసి పట్టిక రూపంలో రాయండి.
ప్రకృతి – వికృతి
1. భక్తి – బత్తి
2. స్థిరం – తిరం
3. ప్రాణం – పానం
4. గుణం – గొనం
5. భాష – బాస
6. నిజం – నిక్కం
వ్యాకరణాంశాలు
అ) కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
1. సంకీర్తనాచార్యుడు : సంకీర్తన + ఆచార్యుడు = సవర్ణదీర్ఘ సంధి
2. వైరాగ్యపు పద్ధతి : వైరాగ్యము + పద్ధతి = పుంప్వాదేశ సంధి
3. నట్టనడుమ : నడుమ + నడుమ = ఆమ్రేడిత సంధి
4. పరమాత్ముడు : పరమ + ఆప్తుడు = సవర్ణదీర్ఘ సంధి
ఆ) కింది పదాలను కలిపి రాసి, సంధి పేరు రాయండి.
1. పరధన + అపేక్ష : పరధనాపేక్ష – సవర్ణదీర్ఘ సంధి
2. దోషాలు + ఉన్న : దోషాలున్న – ఉత్వసంధి
3. సత్ + గతి : సద్గతి – జశ్త్వసంధి
4. మహ + ఆత్ముడు : మహాత్ముడు – సవర్ణదీర్ఘ సంధి
5. దీపము + ఉండగ : దీపముండగ – ఉత్వసంధి
శ్చుత్వ సంధి:
1. తపస్ + చర్య = తపశ్చర్య
2. సత్ + చిత్ = సచ్చిత్
3. జగత్ + జనని = జగజ్జనని
పై ఉదాహరణలను గమనించండి. మొదటి పదం చివర ‘స’ కార తవర్గాక్షరాలలో ఏదో ఒకటి ఉంది. రెండవ పదం మొదట ‘శవర్ణం కానీ, చవర్గాక్షరాలలో ఏదో ఒకటి గానీ ఉంది. సంధి కలిసినపుడు శవర్ణం కానీ, చవర్గాక్షరం కానీ ఆదేశమయ్యింది. ఇలా జరగడాన్ని శ్చుత్వసంధి అంటారు.
సూత్రం : సకార, తవర్గాక్షరాలకు శవర్ణ చవర్గాక్షరాలు పరమైతే శవర్ణ, చవర్గాక్షరాలే ఆదేశంగా వస్తాయి.
1. సజ్జనులు : సత్ + జనులు – శ్చుత్వ సంధి
2. తపశ్శక్తి : తపస్ + శక్తి – శ్చుత్వ సంధి
సమాసములు
ఇ) కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
1. మధుర భక్తి : మధురమైన భక్తి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. పరుల సొమ్ము : పరుల యొక్క సొమ్ము – షష్ఠీ తత్పురుష సమాసం
3. అసహ్యం : సహ్యము కానిది – నఞ తత్పురుష సమాసం
4. మధురమంజులం : మధురము, మంజులము – ద్వంద్వ సమాసం
5. సరస వర్తనం : సరసమైన వర్తనం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) కింది విగ్రహ వాక్యాలను, సమాస పదాలుగా మార్చి రాయండి.
1. మానవుని యొక్క ప్రయత్నం = మానవ ప్రయత్నం – షష్ఠీ తత్పురుష సమాసం
2. శక్తియును, సామర్ధ్యమును = శక్తిసామర్థ్యాలు – ద్వంద్వ సమాసం
3. వివేకము లేనివాడు = అవివేకి – నఞ తత్పురుష సమాసం
4. ఉత్తమమైన లక్షణం = ఉత్తమ లక్షణం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
5. పరధనము కొరకు అపేక్ష = పరధనా పేక్ష – చతుర్థీ తత్పురుష సమాసం
అలంకారం – ముక్తపదగ్రస్తం:
కింది పద్యాన్ని పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి.
కం. మన వేటికి నూతనమా !
తన మానిని బ్రేమ ? తనకు దక్కితిననుమా
ననుమానక దయ దనరం
ధనరంతులు మాని నరసధవు రమ్మనవే
పై పద్యంలోని ప్రత్యేకతను గమనించారు కదా!
ఒక పద్యపాదంగానీ వాక్యంగానీ ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పాదం / వాక్యం మొదలవుతుంది. దీన్నే ముక్తపదగ్రస్త అలంకారం అంటారు. (ముక్తపదం = విడిచిన పదాన్ని, గ్రస్త = తిరిగి గ్రహించడం అని అర్థం)
ఉదా : సుదతీ నూతన మదనా
మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదనా
సదనామయ గజరదనా
రదనాగేంద్ర నిభకీర్తి రసనరసింహా
ఇందులో మదనా, సదనా, రచనా అనే పదాలు గమనించండి. పద్యపాదం చివర మరియు ప్రారంభంలో వచ్చాయి.
ప్రాజెక్టు పని
* అన్నమయ్య సంకీర్తనలు సేకరించి తరగతి గదిలో ప్రదర్శించి, చర్చించండి.
జవాబు:
1. కటకటా కర్మమా కాలములో మర్మమా
మాట మాయై పోతివంటా మది నమ్మి వుంటిగా
పాప బుద్ధి యాడనుండె. పాయము రానినాడు
కోప మేడ నుండె గర్భ గోళమున నున్నవాడు
దీపన మేడ నుండె దేహధారి గాని నాడు
యేపున భూమి బుట్టితే నేడ నుండి వచ్చెనో ॥ కట ॥
నగు సంసార మెందుండె నరకాన నుండు నాడు
తగిలి మరణదెస ధన వాంఛ లెందుండె
వాగి లోభ మేడ నుండె వొంటి నున్ననాడు
వెగటై నేడెట్టు నన్ను వెదకి పై కొనెనో ॥ కట ॥
బహు బంధాలేడ నుండె ప్రళయకాలము నాడు
మహి గోరికె లెందుండె మతి మఱచిన నాడు
యిహమున శ్రీ వేంకటేశు శరణంటి నేడు
విహితమై మాకు చెట్టు వెచెనో తాము ॥ కట ॥
2. జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ
ప్రియరాలపై హరికి బెరసితినమ్మ
పాల జలనిధిలోని పసనైన మీగడ
మేలిమి తామెరలోని మించు వాసన
నీల వర్ణునురముపై నిండిన విధానమలై
ఏలేవు లోకములు మమ్మేలవమ్మ
చందురుతోడ బుట్టిన సంపదల మెఱుగవో
కందువ బ్రహ్మలగాచే కల్పవల్లివో
అందిన గోవిందునికి అండనే తోడు నీడై
వుందానవు మాయింటనే వుండవమ్మ
3.ప. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత ।
పెడ మరలి నవ్వీనె పెండ్లి కూతురు ॥
చ. పేరుకల జవరాలె పెండ్లి కూతురు । పేరుల
ముత్యాల మెడ పెండ్లి కూతురు ॥
పేరంటాడ్ల నడిమి పెండ్లి కూతురు విభు |
పేరుకుచ్చ సిగ్గుపడి బెండ్లి కూతురు ॥
చ. బిరుదు పెండము వెట్టి బెండ్లి కూతురు నెర
బిరుదు మగని కంటె బెండ్లి కూతురు
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి | బెరరేచీ
నిదివో పెండ్లి కూతురు ॥
చ. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె
పెట్టెడు చీరలు గట్టి పెండ్లికూతురు ॥
గట్టిగ వేంకటపతి కౌగిటను వాడి | పెట్టిన
నిధానమయిన పెండ్లి కూతురు ॥
పాఠ్యాంత పద్యం
“దయ ప్రేమ యొక్క రూపము
దయ పట్టగజాల దవ్వుత్రవ్వంగ వలయున్
దయ పుట్టినేని రాక్షస
చయమైనను వేల్పులగుట సమకూదుకదా
భావం : ప్రేమయొక్క రూపమే దయ. దయకలగాలంటే చాలా లోతుగా ఆలోచించాలి. దయ పుడితే రాక్షసమూక కూడా దేవతలవ్వడం జరుగుతుంది.
సూక్తి : ‘పుస్తక పఠనం లెక్కలేనంత మంది అనుభవాలను ఆలోచనలను తెలియజేస్తుంది.’
అదనపు భాషాంశాలు
నానార్థాలు
ఆత్మ : మనస్సు, తన యొక్క స్వభావం
పలుకు : మాట, తునక
గుణం : స్వభావం, వింటినారి
మతి : తెలివి, ఎఱుక, బుద్ధి
కులం : వంశం, జాతి, వెల్లు
సుధ : అమృతం, పాలు, నెయ్యి
తగవు : గొడవ, న్యాయం, యుక్తం
కలుగు : రంధ్రం, కలిగి ఉండటం
ఎండ : వెలుగు, ఆతపం
జాడ : దారి, అచూకీ, విధం
కాయం : శరీరం, గురి, స్వభావం
హరి : విష్ణువు, సింహము, కిరణం, కోతి
పురం : పట్టణం, ఇల్లు, శరీరం
కాలం : సమయం, నలుపు
రాజు : ప్రభువు, క్షత్రియుడు, ఇంద్రుడు
అశ : దిక్కు కోరిక
ఛాయ : నీడ, పార్వతి, పోలిక
దోసము : పాపము, తప్పు, లోపం
వ్యుత్పత్యర్థములు
కరి : కరము (తొండం కలది) ఏనుగు
పక్షి : పక్షములు కలది విహంగం
మోక్షం : జీవుడిని పాశం నుండి విడిపించేది – ముక్తి
జనని : సంతానం ఉత్పత్తి చేయునది – తల్లి
ఈశ్వరుడు : స్వభావం చేత ఐశ్వర్యం కలవాడు – శివుడు
ధరణి : విశ్వాన్ని ధరించేది – భూమి
మానవుడు : మనువు నుండి పుట్టినవాడు – మనిషి
పంకజం : బురద నుండి పుట్టినది – తామర
శరీరం : శుష్కించునది – కాయం
గురువు : అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే వాడు – ఉపాధ్యాయుడు
అసూయ : గుణముల యందు దోషారోపణం చేయడం.
ద్రవ్యం : పొందదగినది – ధనం
హృదయం : హరింపబడేది – గుండె
సంధులు
సచ్చీలుడు – సత్ + శీలుడు – శ్చుత్వ సంధి
ఉన్నతుడౌతాడు – ఉన్నతుడు + ఔతాడు – ఉత్వ సంధి
సంపన్నుడై – సంపన్నుడు + ఐ (అయి) – ఉత్వ సంధి
చింతయేల – చింత + ఏల – యడాగమ సంధి
విడిచినగాక – విడిచిన + కాక – గసడదవాదేశ సంధి
స్వలాభాపేక్ష – స్వలాభ + ఆపేక్ష – సవర్ణదీర్ఘ సంధి
చోటివ్వకుండా – చోటు + ఇవ్వకుండా – ఉత్వ సంధి
మనమావిషయం – మనము + ఆ విషయం – ఉత్వ సంధి
ఎందొకటే – ఎండ + ఒకటే – అత్వ సంధి
ఆకలొకటే – ఆకలి + ఒకటే – ఇత్వ సంధి
వాయువొకటే – వాయువు + ఒకటే – ఉత్వ సంధి
ధనాఢ్యుడు – ధన + ఆధ్యుడు – సవర్ణదీర్ఘ సంధి
పాపపుతలారులు – పాపము + తలారులు – ఉత్వ సంధి
నట్టనడిమి – నడిమి + నడిమి – ఆమ్రేడిత సంధి
మానవాళి – మానవ + ఆళి – సవర్ణదీర్ఘ సంధి
ప్రాణాపాయం – ప్రాణ + అపాయం – సవర్ణదీర్ఘ సంధి
శిష్టాన్నములు – శిష్ట + అన్నములు – సవర్ణదీర్ఘ సంధి
సమాసాలు
పాప పంకిలం – పాపమనెడి పంకిలం – రూపక సమాసం
ఆత్మ ప్రశంస – ఆత్మ యొక్క ప్రశంస – షష్ఠీ తత్పురుష సమాసం
పరధనములు – పరుల యొక్క ధనములు – షష్ఠీ తత్పురుష సమాసం
జీవిత లక్ష్యం – జీవితం యొక్క లక్ష్యం – షష్ఠీ తత్పురుష సమాసం
ఆత్మనిగ్రహం – ఆత్మ యొక్క నిగ్రహం – షష్ఠీ తత్పురుష సమాసం
మానవ ప్రయత్నం – మానవుని యొక్క ప్రయత్నం – షష్ఠీ తత్పురుష సమాసం
విరస వర్తనం – విరసమైన వర్తనం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
సులభ ధనం – సులభమైన ధనం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
తేట తెలుగు – తేటయైన తెలుగు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
చంచల బుద్ధ్చి – చంచలమైన బుద్ధి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పావన మతి – పావనమైన మతి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
హెచ్చుతక్కువలు – హెచ్చు, తక్కువ – ద్వంద్వ సమాసం
దినరాత్రములు – దినము, రాత్రి – ద్వంద్వ సమాసం
ఈర్ష్యాద్వేషాలు – ఈర్ష్య, ద్వేషం – ద్వంద్వ సమాసం
శక్తి సామర్థ్యాలు – శక్తి, సామర్థ్యం – ద్వంద్వ సమాసం
పాపపుణ్యాలు – పాపము, పుణ్యము – ద్వంద్వ సమాసం
అరిషడ్వర్గాలు – ఆరు అనే సంఖ్య కలిగిన శత్రువులు – ద్విగు సమాసం
ఏడుగడలు – ఏడు అనే సంఖ్య గలిగిన గడలు – ద్విగు సమాసం
స్వలాభాపేక్ష – స్వలాభం కొరకు అపేక్ష – చతుర్థీ తత్పురుష సమాసం
మహాత్ముడు – గొప్ప ఆత్మ కలిగినవాడు – బహువ్రీహి సమాసం
కవి పరిచయం
కవి: ఆచార్య ఎస్. గంగప్ప. ఆయన పూర్తి పేరు శ్రీరామప్పగారి గంగప్ప
జన్మస్థలం: ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్లగొండ్రాయని అనే గ్రామంలో జన్మించారు. 08.11.1936వ తేదీన వెంకటప్పు, కృష్ణమ్మ దంపతులకు జన్మించారు.
రచనలు: సాహిత్య సుధ, సాహిత్యానుశీలన, తెలుగులో పదకవిత, క్షేత్రయ్య పద సాహిత్యం, అన్నమాచార్యులు -ఇతర ప్రముఖ వాగ్గేయకారులు తులనాత్మక అధ్యయనం, జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం మొదలైన గ్రంథాలు రచించారు.
పురస్కారాలు: 1972, 1981 సం॥రాలలో ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అవార్డులు పొందారు. ప్రస్తుత పాఠ్యాంశం వీరు రచించిన “సాహిత్యాను శీలన” గ్రంథం నుండి స్వీకరించబడింది.
పదాలు – అర్థాలు
పాండిత్య౦ = జ్ఞానం
పంకిలం = బురద
సంపన్నుడు = ఉన్నతుడు, ధనవంతుడు
చింత = బాధ, దిగులు
మతి = మనస్సు
దూషణం = తిట్టడం
పరులు = ఇతరుల
సద్గతి = మోక్షం, పుణ్యం
విరసవర్తనం = చెడు నడవడిక
ఆపేక్ష = కోరిక, ఆశ
చిచ్చు = మంట
నిక్కము = నిజము
అధికం = ఎక్కువ
హీనం = తక్కువ
దైన్యం = దీనత్వ
నరులు = మానవులు
శ్రీవారి = విష్ణువు
బంటు = సేవకుడు
ప్రాకారం = గోడ
పౌజు = సైన్యము
పరిమళం = సువాసన
శునకం = కుక్క
శిష్టాన్నము = రుచికరమైన భోజనం
దుష్టాన్నము = రుచిలేని భోజనం
పుడమి = భూమి
ధనాఢ్యుడు = ధనవంతుడు
వాయువు = గాలి
అన్యులు = ఇతరులు
ఛాయ = నీడ
మంజులం = అందమైన
కాయం = శరీరం
గద్దె = సింహాసనం
చిత్తం = మనసు
దళవాయి = సేనాధిపతి
తలం = భూమి
ప్రాయం = వయస్సు
కైవల్యం = మోక్షం
పూరి = ఊరు
పుట్టువులు = జన్మలు
కాముడు = మన్మథుడు
జొత్తుల = అధికముగా
అరి = శత్రువు
తలారులు = తల నరికి వేసే అధికారులు