AP 10th Class Telugu 11th Lesson Questions and Answers యుద్ధ విజేత

Access to the AP 10th Class Telugu Guide 11th Lesson యుద్ధ విజేత Questions and Answers are aligned with the curriculum standards.

యుద్ధ విజేత AP 10th Class Telugu 11th Lesson Questions and Answers

చదవండి ఆలోచించి చెప్పండి.

తల్లీ చల్లని శాంతి
ధారుణి పండించవమ్మా
తల్లీ వెన్నెల కాంతీ
ధారుణి నిండించవమ్మా!
పసిపాపలు నీ బిడ్డలు
పాలకడలి తరంగాలు
పసి హృదయం శశివదనం
విషతుల్యం చేయకమ్మ
మానవతా మందిరాన
మంటలు రగిలించకమ్మ
పుడమితల్లి పురిటియిల్లు
బూడిదగా మార్చకమ్మ
ఆశాకుసుమములు మాల
అనురాగ పుటుయ్యాల
అవనీ గర్భంలోపల
అగ్నిధార నింపకమ్మ
ఈ సుందర లోకంలో
వసంతం కురిపించుము
ఈ చంద్రుని హాసంలో
హేమంతం ఒలికించుము
తల్లీ చల్లని శాంతీ
ధారుణి పండించవమ్మ
తల్లీ వెన్నెల కాంతీ
దారుణి నింపించవమ్మ – శ్రీ రెంటాల గోపాలకృష్ణ

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పై కవితలో కవి ఎవరిని ప్రార్థించాడు?
జవాబు:
కవి ‘శాంతిని’ ప్రార్థిస్తున్నాడు. శాంతిని తల్లిగా, చల్లని వెన్నెలగా భావిస్తున్నాడు.

ప్రశ్న 2.
కవి పసి పాపల గురించి ఏం చెప్పాడు?
జవాబు:
పసిపాపలకు ‘శాంతి’ తల్లి వంటిది. వాళ్లు పాల సముద్రంలోని అలల వంటివారు. వారి హృదయం చంద్రుని మోము లాంటిదని కవి చెప్పాడు.

AP 10th Class Telugu 11th Lesson Questions and Answers యుద్ధ విజేత

ప్రశ్న 3.
కవి ఈ లోకం ఎలా ఉండాలని కోరుతున్నాడు?
జవాబు:
ఈ లోకంలో వసంతం కురవాలి. పచ్చగా ఉండాలి. హేమంత ఋతువు కాలంనాటి చంద్రుని చల్లని వెన్నెల వెల్లి విరియాలని కవి కోరుతున్నాడు.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
యుద్ధాలు ఎందుకు జరుగుతాయి?
జవాబు:
యుద్ధాలు రాజ్య విస్తరణ కోసం జరుగుతాయి. ఒక దేశం మీద మరో దేశం ఆధిపత్యం సాధించడానికి జరుగుతాయి. ఆర్యుల కాలంలో పశు సంపద కోసం యుద్ధాలు జరిగాయి. రాజపుత్ర స్త్రీల కోసం కూడా యుద్ధాలు జరిగాయి. పదవుల కోసం, పౌరుషాల కోసం యుద్ధాలు జరుగుతున్నాయి.

ప్రశ్న 2.
యుద్ధాల వల్ల ప్రకృతికి జరిగే నష్టం ఏమిటి?
జవాబు:
ప్రకృతి అందవిహీనంగా తయారౌతుంది. పచ్చని మొక్కలు, చెట్లు బూడిద అవుతాయి. పచ్చగా ఉన్న నేల రక్తపు మడుగులో భయంకరంగా కనిపిస్తుంది. ప్రకృతిలో కాలుష్యం పెరుగుతుంది. తాగే నీరు కూడా కలుషితం అవుతుంది. అందంగా కనిపించే ప్రకృతి, వికృతం అయిపోతుంది.

ప్రశ్న 3.
వీరత్వం కానిదేది?
జవాబు:
మానవ జాతిని, ప్రకృతిని, సమస్త లోకాన్ని వినాశనం చేసే ‘యుద్ధం’ అనే ఆటలో గెలవడం వీరత్వం కాదు.

ప్రశ్న 4.
యుద్ధాన్ని గెలవడం అంటే ఏమిటి?
జవాబు:
లక్షల మంది చావులకు, ప్రకృతిలో భీభత్సానికి కారణం అయ్యే యుద్ధాన్ని తిరస్కరించడమే అసలైన గెలుపు అవుతుంది.

ప్రశ్న 5.
పశ్చాత్తాపం అంటే ఏమి?
జవాబు:
తాను చేసిన తప్పుని తెలుసుకొని, మరోసారి అలాంటి తప్పు చేయకుండా, ఉండటం. దేవుడిని క్షమాపణ కోరడం పశ్చాత్తాపం అనిపించుకుంటుంది.

ఇవి చేయండి

అవగాహన – ప్రతిస్పందన

అ) కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. రాయండి.

ప్రశ్న 1.
“యుద్ధంలో గెలవటం వీరత్వం కాదు” అనడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జవాబు:
రెండు రాజ్యాల మధ్యగానీ, దేశాల మధ్యగానీ జరిగే యుద్ధంలో ధన, ప్రాణనష్టం ఉంటుంది. సమస్త ప్రకృతి ధ్వంసం అయిపోతుంది. ప్రకృతిలో ఉన్న పక్షులు, జంతువులు, మొక్కలు, చెట్లు నాశనం అవుతాయి. వీటి విలువ తెలిసి కూడా ‘యుద్ధం’ చేసి గెలవడం వీరత్వం కాదని కవి అంటున్నాడు. ప్రాణాలు తీయడం కన్నా నిలబెట్టడమే అసలైన వీరత్వమని, మానవత్వమని కవి ఉద్దేశం.

AP 10th Class Telugu 11th Lesson Questions and Answers యుద్ధ విజేత

ప్రశ్న 2.
శాంతిని ప్రబోధించిన మహనీయుల గురించి చెప్పండి.
జవాబు:
భారతదేశం వేదకాలం నుండి ‘శాంతి’ని కోరుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేల మీద పుట్టిన సిద్ధార్థుడు యుద్ధాన్ని తిరస్కరించాడు. తన రాజ్యాన్ని త్యాగం చేశాడు. ‘శాంతి’ యొక్క గొప్పతనాన్ని నలుదిశలా వ్యాపింపజేశాడు. అలాగే మహాత్మాగాంధీ శాంతి, సత్యం, అహింసలను అస్త్రాలుగా చేసుకొని, మనకు స్వాతంత్య్రం కానుకగా ఇచ్చాడు.

ఆ) కింది పద్యం చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

మ. మహితంబైన స్వతంత్రభారతము నిర్మాణంబు సేయంగ దు
స్సహ కష్టంబుల కోర్చి వీరులయి స్వచ్ఛందంబుగా బోరి శ
త్రుహత ప్రాణులుగా ధరంబడిన నిత్యుల్ నాకు సాక్షాత్కరిం
త్రు హితాశీస్సులు నింత్రుగాక భవమందున్ భావలోకంబులన్ – పుట్టపర్తి నారాయణాచార్యులు (సిపాయిపితూరి)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కవి ఎటువంటి దేశాన్ని నిర్మించాలని కోరుకున్నాడు?
జవాబు:
కవి గొప్పదైన స్వతంత్ర భారతదేశాన్ని కోరుకున్నాడు.

ప్రశ్న 2.
కవి ఎవరి ఆశీస్సులు కోరుకున్నాడు?
జవాబు:
కవి వీరులైన వారి ఆశీస్సులు కోరుకున్నాడు.

ప్రశ్న 3.
జాతీయోద్యమంలో ప్రాణత్యాగం చేసిన వీరుల స్వభావం గురించి తెల్పండి.
జవాబు:
ఆ వీరులు ప్రాణాలను లెక్కచేయని వారని కవి అంటున్నాడు.

ప్రశ్న 4.
పద్యం ఆధారంగా ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
‘దుస్సహ కష్టంబులు’ అనగా అర్థం ఏమిటి?

ఇ) కింది పేరా చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రపంచవ్యాప్తంగా నేడు నెలకొనివున్న హింసాతత్వవాదానికి స్వస్తిచెప్పి, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటుతున్న సంస్థ ‘అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ’. జాతి, కుల, మత, సాంస్కృతిక తారతమ్యాలు లేకుండా మానవతా దృక్పథంతో తోటి మానవులకు ఈ సంస్థ సేవలందిస్తుంది. స్విట్జర్లాండ్ దేశానికి ‘చెందిన జీన్ హెన్రీ డ్యూనాంట్ కేవలం ఐదుగురు స్నేహితులతో 9 ఫిబ్రవరి 1863వ సం॥లో ‘రెడ్ క్రాస్ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం 137 దేశాలు దీనిలో సభ్యులుగా వున్నాయి.

నేడు సభ్యుల సంఖ్య 25,00,00,000 మందికి చేరింది. మానవత, నిష్పాక్షికత, తటస్థత, స్వతంత్రత, స్వచ్ఛందసేవ, ఐక్యత, విశ్వజనీనత ప్రధానమైన ప్రాథమిక సూత్రాలుగా ఈ సంస్థ ప్రారంభమైంది. ఈనాడు 600 పైగా ప్రాదేశిక సూత్రాలున్నాయి. రెడ్ క్రాస్ సంస్థలో సభ్యులైన ప్రతి దేశం, ప్రతి వ్యక్తి ఎలాంటి విభేదాలు లేకుండా ఈ ప్రతి దేశం, ప్రతి వ సూత్రాలకు కట్టుబడి, తమ వంతు సేవలందిస్తున్నారు. రెడ్ క్రాస్ చిహ్నం అధికారికంగా 1863లో జెనీవాలో ఆమోదించబడింది. గాయపడిన పోరాట యోధుల రక్షణ మరియు సైనిక వైద్య సౌకర్యాల కోసం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రమాణాలను స్థాపించడంలో స్విస్ పౌరుల మార్గదర్శక కృషికి గుర్తింపుగా ఈ చిహ్నం ఉంది.

ఆపదలలో ఉన్నవారికి కావలసిన ఔషధాలు, ఆహార వస్తువులు, దుస్తులు సరఫరా చేయడమేగాక, వారి పరిరక్షణ బాధ్యత కూడా చూస్తుంది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొని, శాంతి సమయాల్లో కూడా పీడిత ప్రజలకు కోట్లాది ధనం వెచ్చిస్తూ, వారిని ఆదుకుంటుంది. రెడ్ క్రాస్ సంస్థ మానవత దృక్పథంతోనే తోటి మానవులకు సేవలందిస్తూ ఉంది. యుద్ధంలో గాయపడినవారికే కాకుండా, భూకంపాల్లో, తుఫానుల్లో, అగ్ని ప్రమాదాల్లో, అంటువ్యాధులతో బాధితులైనవారికి రెడ్ క్రాస్ చేసే సేవలు ప్రశంసనీయాలు. – సాలిఫర్నో జ్ఞాపకాలు

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
రెడ్ క్రాస్ సంస్థ సేవా కార్యక్రమాలు ఏవి?
జవాబు:
ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు లాంటి విపత్కర పరిస్థితులలో ఆపదలో ఉన్నవారికి, ఆహారం, ఔషధాలు, దుస్తులు అందించడమే గాక, వారి పరిరక్షణ బాధ్యత కూడా చూస్తుంది.

ప్రశ్న 2.
రెడ్ క్రాస్ ను ఎవరు ఎప్పుడు స్థాపించారు?
జవాబు:
జీన్ హెన్రీ డ్యూనాంట్ ఫిబ్రవరి 9, 1863వ సం॥లో రెడ్ క్రాస్ సంస్థను స్థాపించారు.

ప్రశ్న 3.
రెడ్ క్రాస్ సంస్థ చిహ్నం ఎప్పుడు ఆమోదించారు?
జవాబు:
రెడ్ క్రాస్ సంస్థ చిహ్నం 1863, జెనీవాలో ఆమోదించబడింది.

AP 10th Class Telugu 11th Lesson Questions and Answers యుద్ధ విజేత

ప్రశ్న 4.
పై పేరా ఆధారంగా ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
రెడ్ క్రాస్ సంస్థలోని సభ్యదేశాల సంఖ్య ఎంత? (లేదా) ‘రెడ్ క్రాస్’ సంస్థ ప్రాథమిక సూత్రాలు ఏమిటి?

ఈ) కింది వాటికి అర్థ సందర్భములు రాయండి.

ప్రశ్న 1.
పచ్చని నేలకు నెత్తుటి తిలకం దిద్దవలసి వచ్చింది.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం నేతల ప్రతాప్కుమార్ రచించిన ‘సమతా వసంత గానం’ అనే కవితా సంపుటి నుండి గ్రహించిన ‘యుద్ధ విజేత’ అనే పాఠ్యభాగంలోనిది..

అర్థం : పచ్చగా ఉన్న నేల రక్తపాతంతో ఎర్రగా మారుతోంది.

సందర్భం: కవి యుద్ధం వలన జరిగే పర్యవసానాలను గురించి చెబుతూ, మనిషికి, మనిషికి మధ్య యుద్ధం మొదలయ్యాక సాటి మనిషికి శత్రువు అనే ముద్ర వేయాల్సి వస్తోంది. యుద్ధం కారణంగా పచ్చగా ఉన్న నేల రక్త పంకిలం అవుతోందని చెప్పే సందర్భంలోనిది.

ప్రశ్న 2.
చిరుదరహాసాలను చెరిపేయడమే యుద్ధం.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం నేతల ప్రతాప్కుమార్ రచించిన ‘సమతా వసంత గానం’ అనే కవితా సంపుటి నుండి గ్రహించిన ‘యుద్ధ విజేత’ అనే పాఠ్యభాగంలోనిది.

అర్థం : యుద్ధం చిరునవ్వుల్ని చెరిపేస్తుంది.

సందర్భం: ఇప్పుడు యుద్ధాలు బాంబులతో జరుగుతున్నాయి. యుద్ధం అంటే ఒకరినొకరు చంపుకోవడంగా మారింది. మానవజాతికి నివాసయోగ్యమైన భూమిని మాంసపు ముద్దలుగా మార్చేసింది. అభం, శుభం తెలియని అమాయకపు బాలల మోముపై చిరునవ్వుల్ని చెరిపేసిందని కవి బాధపడే సందర్భంలోనిది.

ఉ) కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పూర్వం యుద్ధాలు దేనికోసం జరిగేవి?
జవాబు:
రాజ్యకాంక్ష, రాణివాసం పట్ల వ్యామోహం, పదవులు, పౌరుషాల ప్రదర్శన కోసం జరిగేవి.

ప్రశ్న 2.
పశ్చాత్తాపం ప్రకటించిన రాజు ఎవరు?
జవాబు:
పశ్చాత్తాపం ప్రకటించిన రాజు అశోకుడు.

ప్రశ్న 3.
రాజ్యసుఖాలను వదిలివెళ్ళింది ఎవరు?
జవాబు:
సిద్ధార్థుడు రాజ్య సుఖాలను వదిలి వెళ్లాడు.

ప్రశ్న 4.
యుద్ధాన్ని గెలవటం అంటే ఏమిటి?
జవాబు:
యుద్ధాన్ని తిరస్కరించడమే యుద్ధాన్ని గెలవటం.

వ్యక్తీకరణ సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు లఘు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ప్రజల హృదయాల్లో విజేతగా నిలిచేది ఎవరు?
జవాబు:
యుద్ధం అనేది వినాశకర చర్య. ఒక రాజ్యం మీదో, దేశం మీదో యుద్ధం చేసి గెలవడం అనేది గెలుపు కానేకాదు. మానవజాతిని, ప్రకృతిని, సమస్త విశ్వాన్ని యుద్ధం చిన్నాభిన్నం చేస్తుంది. యుద్ధాన్ని తిరస్కరించిన వారే ప్రజల హృదయాల్లో విజేతగా నిలుస్తారు. శాంతి, త్యాగం ద్వారా సాధించినది మాత్రమే అసలైన విజయంగా నిలబడుతుంది. యుద్ధాన్ని జయించినవాడే నిజమైన విజేత. అలాంటి వారిని కాలం మరచిపోదు.

AP 10th Class Telugu 11th Lesson Questions and Answers యుద్ధ విజేత

ప్రశ్న 2.
కవి ప్రకృతిని ధ్వంసం చేయడం కూడా ఉన్మాద చర్యగా ఎందుకు భావించాడు?
జవాబు:
ప్రకృతిలో చెట్లు, పక్షులు, జంతువులు, పూలు భాగంగా ఉంటాయి. యుద్ధం జరిగితే ఇవన్నీ నాశనం అయిపోతాయి. విచ్చుకున్న పూలను కోసి పారేస్తారు. పక్షులకు రెక్కలు విరిగిపోతాయి. మేఘాలను చూసి సంబరపడి, పురివిప్పి నాట్యం, చేస్తున్న నెమళ్ళ కాళ్లు తొలగిస్తున్నారు. చెంగు చెంగున గెంతే జింక పిల్లల కాళ్లు నరికేస్తున్నారు. ఇలా సమస్త జీవులకు నివాసయోగ్యంగా ఉన్న అందమైన ప్రకృతిని పాడుచేయడం కూడా యుద్ధంగా భావించవలసిన పరిస్థితి దాపురించింది. అందువలన కవి ప్రకృతిని ధ్వంసం చేయడం కూడా ఉన్మాద చర్యగా భావించాడు.

ప్రశ్న 3.
యుద్ధంలో గెలిచిన వాడికంటే యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత అని కవి ఎందుకు అన్నాడు?
జవాబు:
యుద్ధం అంటూ జరిగాక గెలుపు ఎవరో ఒకరి పక్షాన నిలుస్తుంది. ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోవడమూ ఉంటుంది. కానీ కవి యుద్ధంలో గెలిచిన వాడికంటే యుద్ధాన్ని గెలిచినవాడు నిజమైన విజేత అంటున్నాడు. ఎందుకంటే యుద్ధం చేయడం పౌరుషం అనిపించుకోదు. అది పనికిమాలిన స్వభావం అవుతుంది. యుద్ధం జరిగితే మానవజాతి, ప్రకృతి, సమస్త విశ్వం వినాశనం అవుతాయి. నిజమైన విజేత ‘శాంతి’ని కోరుకుంటాడు. పచ్చని నేలను రక్త పంకిలం చేయాలనుకోడు. యుద్ధాన్ని తిరస్కరించి యుద్ధాన్ని గెలిచిన వాడే నిజమైన విజేత. యుద్ధాలు చేయడం మానేసిన అశోకుడు చరిత్రలో నిలిచిపోయాడు. రాజ్యాన్ని త్యాగం చేసి, యుద్ధాన్ని తిరస్కరించిన సిద్ధార్థుడు ప్రజల హృదయాలను గెలిచి, నిజమైన విజేతగా నిలిచాడు.

ఆ) కింది ప్రశ్నలకు వ్యాసరూప సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
కవిపరిచయం : ఈ ప్రశ్న నేతల ప్రతాప్కుమార్ రచించిన ‘యుద్ధ విజేత’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది.

సారాంశం : ‘యుద్ధం’ లో గెలుపు, ఓటమిలు ఉంటాయి. యుద్ధంలో గెలుపు ఎవరో ఒకరి పక్షాన నిలుస్తుంది. మరో పక్షం ఓడిపోతుంది. ఒక్కోసారి ఎందుకూ కొరగాని వాడు కూడా యుద్ధంలో గెలుస్తాడు. కానీ యుద్ధంలో విజేత అయిన వాడికంటే యుద్ధాన్ని జయించినవాడే నిజమైన విజేత అవుతాడు. కాలం గడిచిపోయినా అలాంటి వారిని ప్రజలు ఎప్పటికీ హృదయ విజేతగా గుర్తు పెట్టుకుంటారు.

బలహీనుడి మీద బలవంతుడు గెలుస్తాడు. బలవంతుడి దగ్గర పటిష్ఠమైన సైన్యం, తగినంత సంపద ఉంటాయి. బలవంతుడు యుద్ధాన్ని మంచి తెలివితో, ప్రణాళికతో చేస్తాడు. ఇలాంటి వాళ్లు అలాంటివి ఏమీ తెలియని వారి బలహీనులపై గెలవడం విజయం కాదు. యుద్ధం ముసుగులో ఇరుపక్షాలు రణరంగంలోకి దూకిన తరువాత బలమైన ప్రత్యర్థి విజయగర్వాన్ని చూపుతాడు. ఇలాంటివారు ఉన్మాదులుగా లోక నాశనానికి కారణం అవుతున్నారు. మనిషికి, మనిషికి మధ్య యుద్ధం మొదలయ్యాక ‘సాటి మనిషి’ని కూడా శత్రువుగా భావించవలసి వస్తుంది.

యుద్ధం కారణంగా పచ్చగా ఉన్న నేల, రక్త పంకిలంగా మారుతుంది. రాజ్యంపై కాంక్ష, రాణివాసం పట్ల వ్యామోహం, పదవుల కోసం ఆరాటం, తన పౌరుష ప్రదర్శన మొదలైన కారణాల వలన ‘యుద్ధం’ అనే పిచ్చిని బుర్రలోకి ఎక్కించుకున్నారు. మానవజాతి నాశనానికి కారణమౌతున్నారు. యుద్ధం కారణంగా మరణాన్ని త్వరగా చవి చూడాల్సి వచ్చింది. రాజ్య విస్తరణ కోసమో, ‘శత్రుదేశమనో బూచిగా చూపి, ఇప్పుడు యుద్ధాలలో బాంబులను ప్రవేశపెడుతున్నారు. గతంలో బాణాలతో ప్రాణాలు తీసేవాళ్లు. ఇప్పుడు యుద్ధమంటే ఒకరినొకరు చంపుకోవడంగా మారింది. మానవజాతికి నివాసయోగ్యమైన భూమిని మాంసపు ముద్దలుగా మార్చేస్తున్నారు.

యుద్ధం అభం శుభం తెలియని, అమాయక బాలల మోముపై చిరునవ్వుల్ని చెరిపేసింది. విచ్చుకున్న పూలను కోసి పారేస్తున్నారు. ఎగిరే పక్షుల రెక్కలు విరిచేస్తున్నారు. మేఘాలను చూసి సంబరపడి, పురివిప్పి ఆడే నెమళ్ళ కాళ్లు తొలగిస్తున్నారు. చక్కగా ఆడుకుంటున్న జింక పిల్లల కాళ్లు నరికేస్తున్నారు. ఇలా సమస్త జీవులకు నివాసయోగ్యంగా ఉన్న అందమైన ప్రకృతిని పాడుచేయడమే యుద్ధంగా భావించవలసిన పరిస్థితి దాపురించింది.

మానవజాతిని, ప్రకృతిని, సమస్త లోకాన్ని వినాశనం చేసే యుద్ధమనే ఆటలో గెలవడం వీరత్వం కాదు. అది పశు స్వభావం. యుద్ధం చేయడం పౌరుషం అనిపించుకోదు. అశోకుడు కొన్ని వేలమంది చావుకు కారణమై యుద్ధంలో గెలిచినప్పటికీ పశ్చాత్తాప హృదయంతో యుద్ధాలు చేయడం మానేశాడు. యుద్ధాన్ని తిరస్కరించి సిద్ధార్థుడు భార్యా.. బిడ్డలను, రాజ్యాన్ని త్యాగం చేసి, ప్రజల హృదయాలను గెలిచి నిజమైన విజేతగా నిలిచాడు. అసలైన విజయం ఏమిటో, విజేత ఎవరో నిరూపించాడు.

ప్రశ్న 2.
యుద్ధాలను నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి ఏం చేయాలి?
జవాబు:
“గీతలు గీసుకున్నావ్ సరే
కొలతలు వేసుకున్నావ్ సరే
నీ హద్దుల్లో నువ్ ఉండటానికి మించిన ప్రపంచ శాంతి ఏముంది?” అని ఓ కవి అన్నాడు. యుద్ధం ఎప్పుడు జరిగినా ప్రకృతితో పాటూ, మానవాళి, సమస్త లోకము నాశనం అయిపోతాయి. యుద్ధాలను నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి ఈ క్రింది విధానాలు పాటించాలి.

  1. ప్రపంచ దేశాలన్నీ ఒకదానితో ఒకటి సహకరించుకుంటూ, సమగ్రమైన అభివృద్ధికి మార్గాలు వేసుకోవాలి.
  2. ప్రపంచ దేశాలు శాంతి ఒడంబడికలు చేసుకొని, కచ్చితంగా పాటించాలి.
  3. దేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను పరిగణింపక సోదరులుగా భావించాలి.
  4. చిన్న దేశమైనా, పెద్ద దేశమైనా పొరుగు దేశం యొక్క ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోరాదు.
  5. అణు ఆయుధాల తయారీపై నియంత్రణ ఉండాలి.
  6. అణ్వాయుధాల తయారీ, సరఫరా నిలిపి వేయాలి.
  7. ఐక్యరాజ్యసమితి (U.N.O) ఆదేశాలను, ఆశయాలను అన్ని దేశాలు పాటించాలి.
  8. ప్రపంచశాంతికి గౌతమబుద్ధుడు, మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా వంటి మహనీయులు చూపిన మార్గాలను అనుసరించాలి.
  9. ఆయుధాల నియంత్రణ ఉండాలి.
  10. శాంతియుత జీవన విధానాల పట్ల ప్రచారం కలిగించాలి.
  11. పరస్పర సహకారం – ప్రగతికి సోపానమని తెలుసుకోవాలి.
  12. అహింసాయుత జీవన శైలిని అలవరచుకోవాలి.

ఇ) కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
యుద్ధాల వలన వచ్చే నష్టాలను, శాంతి వలన చేకూరే ప్రయోజనాలను పట్టిక రూపంలో రాయండి.
జవాబు:

యుద్ధ నష్టాలు శాంతి ప్రయోజనాలు
1. యుద్ధం వలన జన నష్టంతో పాటూ, ఆర్థిక వ్యవస్థలో గందరగోళం ఏర్పడుతుంది. 1. శాంతియుతమైన జీవనం ద్వారా సమాజం ఆనందంగా ఉంటుంది.
2. సామాన్య జనంపైన ప్రగాఢమైన ప్రభావం చూపిస్తుంది. 2. ప్రాణ, ఆస్తి నష్టాలు ఉండవు.
3. యుద్ధరంగంలో పోరాడిన సైనికులు చనిపోతారు. మరికొందరు గాయపడి అంగవైకల్యంతో బాధపడతారు. 3. సామాన్య జనం సంతోషంగా జీవిస్తారు.
4. సమాజ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుంది. అసమానతలు పెరుగుతాయి. 4. సమాజ ఆర్థిక వ్యవస్థలో కుదుపులు ఉండవు. అసమానతలు కనిపించవు.
5. అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు, మందు పాతరలు వంటి వాటి వినియోగం వల్ల ఆరోగ్యం అస్తవ్యస్తం అవుతుంది. 5. సమాజంలోని ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.
6. దేశాల మధ్య ఆధిపత్య భావజాలం పెరుగుతుంది. 6. దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది.
7. అనైతిక, అమానుష చర్యలు పెచ్చు మీరుతాయి. 7. సమాజంలో నైతికత, మానవత్వం పరిఢవిల్లుతాయి.
8. ప్రకృతి, పర్యావరణ సమతుల్యత నాశనం అవుతాయి. 8. ప్రకృతి, పర్యావరణ సమతుల్యత చక్కగా ఉంటాయి.
9. విదేశాంగ విధానం పట్ల నమ్మకం పెరిగి పరస్పర సహకారం ఏర్పడుతుంది. 9. దేశాల మధ్య విదేశాంగ విధానం పట్ల అపనమ్మకం ఏర్పడుతుంది.
10. పర్యాటకం (టూరిజం) తగ్గిపోతుంది. 10. పర్యాటకం పెరిగి, యాత్రికుల సంఖ్య పెరుగుతుంది.
11. వాతావరణం కలుషితం అవుతుంది. 11. పరిశుభ్ర వాతావరణం ఉంటుంది.
12. యుద్ధం అనాగరిక చర్య, 12. శాంతి నాగరిక చర్య.

AP 10th Class Telugu 11th Lesson Questions and Answers యుద్ధ విజేత

ప్రశ్న 2.
కింది కవితను పొడిగించండి.
నేనే సైనికుడనైతే……….
దేశ రక్షణకు పాటు పడతాను.
దేశ గౌరవాన్ని కాపాడుతాను.
మువ్వన్నెల జాతీయపతాకం కీర్తి నిలుపుతాను.
నేనే సైనికుడనైతే
AP 10th Class Telugu 11th Lesson Questions and Answers యుద్ధ విజేత 1
జవాబు:
నేనే సైనికుడనైతే…
దేశ రక్షణకు పాటు పడతాను.
దేశ గౌరవాన్ని కాపాడుతాను.
మువ్వన్నెల జాతీయపతాకం కీర్తి నిలుపుతాను.
నేనే సైనికుడనైతే ……
సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉంటాను.
ప్రకృతి వైపరీత్యాలలో
బాధితులకు బాసటగా నిలుస్తాను.
నేనే సైనికుడవైతే …..
శత్రుమూకలపై కన్నేసి ఉంచుతాను.
గీత దాటిన వారికి
బుద్ధి చెప్తాను.
నేనే సైనికుడనైతే
ప్రకృతికి రక్షణగా నిలుస్తాను.
శాంతి గీతం ఆలపిస్తాను.
జన్మభూమికి జై కొడతాను.

భాషాంశాలు

పదజాలం

అ) కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి.

1. ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం తథ్యం.
తథ్యం = తప్పకుండా
సొంతవాక్యం : ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం తప్పకుండా లభిస్తుంది.

2. పంటలకు మంచి ధర రావడంతో రైతన్నల మోముపై దరహాసం వెల్లివిరిసింది.
దరహాసం = చిరునవ్వు
సొంతవాక్యం : పంటలకు మంచి ధర రావడంతో రైతన్నల మోముపై చిరునవ్వు వెల్లివిరిసింది.

3. విజయం సాధించడానికి వ్యూహం అవసరం.
వ్యూహం = ప్రణాళిక,
సొంతవాక్యం : విజయం సాధించడానికి ప్రణాళిక అవసరం.

4. బుద్ధుడు సర్వస్వాన్ని త్యజించి భిక్షువుగా మారాడు.
త్యజించి = విడిచిపెట్టి
సొంతవాక్యం : బుద్ధుడు సర్వస్వాన్ని విడిచిపెట్టి భిక్షువుగా మారాడు.

ఆ) కింది వాక్యాలలో పర్యాయపదాలు గుర్తించి రాయండి.

1. సమరంలో సైనికులు పోరాడుతూ ప్రాణత్యాగం చేశారు. ఆ సంగ్రామం వలన ఎంతోమంది అనాథలు అవుతారు.
జవాబు:
యుద్ధం సమరం, సంగ్రామం

2. గెలుపు కోసం ప్రతిఒక్కరూ ప్రయత్నిస్తారు. జయం దక్కలేదని నిరుత్సాహపడకూడదు.
జవాబు:
విజయం : గెలుపు, జయం

3. సేవాతత్పరత వల్ల యశస్సు కలుగుతుంది. ఆ పేరు శాశ్వతమైనది.
జవాబు:
కీర్తి : యశస్సు, పేరు

ఇ) కింది పదాలకు నానార్థాలు జతపరచండి.
AP 10th Class Telugu 11th Lesson Questions and Answers యుద్ధ విజేత 2
1. పశువు (ఇ) అ) సమయం, నలుపు, చావు.
2. కాలం (అ) ఆ) రాష్ట్రం, ఏలుబడి, దొరతనం
3. రాజ్యం (ఆ) ఇ) గొట్టె, ఆత్మ, ప్రమథ గణము

ఈ) కింది పదాలకు వికృతులను రాయండి.

ప్రకృతి – ప్రకృతి
AP 10th Class Telugu 11th Lesson Questions and Answers యుద్ధ విజేత 3

1. ప్రకృతి – పగిది
2. భోగము – రోగము
3. పుణ్యం – పున్నెము
4. గర్వము – గురువు

వ్యాకరణాంశాలు

ఆ) కింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
AP 10th Class Telugu 11th Lesson Questions and Answers యుద్ధ విజేత 4
AP 10th Class Telugu 11th Lesson Questions and Answers యుద్ధ విజేత 5
1. సంవత్సరాలు : సంవత్సరము + లు = లు, ల, న,ల సంధి
2. కొమ్ములెగరేసిన : కొమ్ములు + ఎగరేసిన = ఉత్వసంధి
3. చరాచర : చర + అచర = సవర్ణదీర్ఘ సంధి
4. ఇంకొకరు : ఇంక + ఒకరు = అకారసంధి
5. మానవాళి : మానవ + ఆళి = సవర్ణదీర్ఘ సంధి

ఆ) కింది సంధి పదాలను కలిపి, సంధి పేరు రాయండి.
AP 10th Class Telugu 11th Lesson Questions and Answers యుద్ధ విజేత 6
1. ఒక్క + ఒక్క : ఒక్కొక్క – ఆమ్రేడిత సంధి
2. ఎందుకు + అవుతుంది : ఎందుకవుతుంది – ఉత్వసంధి
3. అతను + ఎప్పటికీ : అతనెప్పటికి – ఉత్వసంధి
4. నెత్తికి + ఎక్కు : నెత్తికెక్కు – ఇత్వ సంధి
5. యుద్ధ + ఉన్మాది : యుద్ధోన్మాది – గుణసంధి

ఇ) కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
AP 10th Class Telugu 11th Lesson Questions and Answers యుద్ధ విజేత 7
1. శత్రురాజ్యం : శత్రువు యొక్క రాజ్యం (షష్ఠీ తత్పురుష సమాసం)
2. భార్యాభర్తలు : భార్యయు, భర్తయు (ద్వంద్వ సమాసం)
3. రాజ్యభోగాలు : రాజ్యం వలన భోగాలు (పంచమీ తత్పురుష సమాసం)
4. యుద్ధవ్యూహం : యుద్దము యొక్క వ్యూహం (షష్ఠీ తత్పురుష సమాసం)

ఈ) కింది విగ్రహ వాక్యాలను సమాసపదాలుగా మార్చి సమాసం పేరు రాయండి.
AP 10th Class Telugu 11th Lesson Questions and Answers యుద్ధ విజేత 8
1. మరణము అనెడి మృదంగం : మరణ మృదంగం – రూపక సమాసం
2. అర్ధము చేత బలము : అర్ధబలము – తృతీయా తత్పురుష సమాసం
3. పసివారైన పిల్లలు : పసిపిల్లలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4. చిరుదైన దరహాసం : చిరుదరహాసం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

అలంకారం:

అతిశయోక్తి అలంకారం : ఒక వస్తువు యొక్క స్థితిని, స్వభావాన్ని, గుణాన్ని, ఉన్నదాని కంటే అతిశయంగా చేసి చూపడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. అంటే గోరంతను కొండంత చేసి చెప్పడం అని అర్ధం.
ఉదా : మా నూతిలో నీళ్ళు పాతాళానికి చేరాయి.
ఇందులో నిజానికి నూతిలో నీళ్ళు పాతాళానికి చేరలేదు. కాని పాతాళానికి చేరినట్లుగా అతిశయించి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారం.

AP 10th Class Telugu 11th Lesson Questions and Answers యుద్ధ విజేత

ఉ) కింది వాక్యాలలోని అలంకారాలను గుర్తించి రాయండి.

1. భూమి, ఆకాశాలు ఏకమగునట్లుగా వర్షం కురుస్తోంది.
జవాబు:
అతిశయోక్తి అలంకారం

2. సముద్రపుటలలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
జవాబు:
అతిశయోక్తి అలంకారం

3. పి.టి. ఉష గాలి కంటే వేగంగా పరుగెత్తింది.
జవాబు:
అతిశయోక్తి అలంకారం

4. మలయగిరి నుండి వచ్చే గాలి గాలి.
జవాబు:
లాటానుప్రాసాలంకారం

5. అమ్మ చూపించే ప్రేమ ప్రేమ.
జవాబు:
లాటానుప్రాసాలంకారం

ప్రాజెక్టు పని

* నోబుల్ శాంతి బహుమతి పొందిన నలుగురి వివరాలు సేకరించి, శాంతి కొరకు వారు చేసిన కృషిని వివరించండి.
జవాబు:
నోబెల్ శాంతి బహుమతి ప్రపంచశాంతి మరియు న్యాయం కోసం కృషి చేసిన వారికి గుర్తింపు మరియు ప్రోత్సాహానికి గుర్తుగా ఇస్తారు. 1901 నుండి ఈ బహుమతిని ఇస్తున్నారు.

1. నర్గీస్ మొహమ్మది :
2023 నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇరాన్ దేశానికి చెందిన కార్యకర్త నర్గీస్ మొహమ్మదికి ఇచ్చారు. ఇరాన్లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం, అలాగే మానవ హక్కులు, అందరికీ స్వేచ్ఛను పెంపొందించడానికి చేసిన కృషికి మెచ్చి, పురస్కారాన్ని ఇచ్చారు. నర్దేస్ ఒక జర్నలిస్టు. మహిళల హక్కుల కోసం చేసిన ఉద్యమాలలో భాగంగా, 13 సార్లు అరెస్టు అయ్యారు. బహుమతి ప్రకటించినప్పుడు కూడా ఆమె జైలులో ఉన్నారు.

2. నెల్సన్ మండేలా :
నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా దక్షిణాఫ్రికా దేశానికి చెందిన నల్లజాతి నాయకుడు. ఆయనకు 1993లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాన్ని గుర్తించి ‘ పురస్కార కమిటీ, ఈ బహుమతిని ప్రకటించింది. మానవతా స్ఫూర్తికి ప్రదాతగా ఆయనను ప్రపంచం కీర్తించింది. సుదీర్ఘ పోరాటం, జైలు జీవితం తర్వాత ఆయన దక్షిణాఫ్రికాకు అధ్యక్షులుగా పనిచేశారు. ‘నల్లజాతి సూరీడు’గా ఆయనను అభివర్ణిస్తారు.

3. అబీ అహ్మద్ :
అహ్మద్ ఇథియోపియా ప్రధాని. 1998-2000 సం॥రాల మధ్య ఎరిట్రియాతో యుద్ధం తర్వాత దాదాపు 20 సం॥రాల పాటు, రెండు దేశాల మధ్య నెలకొన్న సైనిక ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ, అహ్మద్ ఆధ్వర్యంలో ఎరిట్రియా దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎరిట్రియా దేశంతో సరిహద్దు సమస్య పరిష్కారానికి, అహ్మద్ చూపిన చొరవ, ఆ రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పింది. 2019వ సం॥రంలో నార్వేజియన్ నోబెల్ కమిటీ, అహ్మద్కు నోబెల్ శాంతి పురస్కారాన్ని అందించింది.

4. మదర్ థెరీసా :
శాంతికి విఘాతం కలిగించే పేదరికాన్ని, దుఃఖాన్ని తొలగించేందుకు, ఆమె చేసిన కృషికి గుర్తింపుగా 1979లో మదర్ థెరీసాకు నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు. మదర్ భారతదేశ పౌరసత్వం తీసుకొని, మిషనరీస్ ఆఫ్ ఛారిటీని కోల్కత్తాలో స్థాపించారు. ఆమె 45 సం॥రాల పాటు, భారతదేశం, ప్రపంచంలోని ఇతర దేశాలలోని రోగులకు, పేదలకు, అనాథలకు, మరణశయ్యపై ఉన్నవారికి పరిచర్యలు చేసింది. మదర్ అల్బేనియా దేశంలో పుట్టారు.

పాఠ్యాంత పద్యం

చం॥ వినయ విధేయ వర్తనుఁ డవిస్మృతిశాలి యసంశయా శయుం
డనితర సక్తమానసుఁ దపార్థవిదూరుఁ డధీతపాఠచిం
తనపరుఁడున్ సుఖగ్రహణ ధారణ గణ్యుఁడు సూక్ష్మబుద్ధి సు
స్వనుఁడు గురుప్రియుండునగువానినే శిష్యునిగాఁ గొనందగున్ – మహేంద్ర విజయము – దేవులపల్లి సోదర కవులు.

భావం : శిష్యుడు వినయంతో గురువు చెప్పినట్లు నడుచుకోవాలి. మరుపు ఉండకూడదు. స్థిరమైన మనస్సుతో ఉండాలి. గురువు పట్ల, చదువు పట్ల మాత్రమే ఏకాగ్రత కలిగి వుండాలి. అపార్థం చేసుకోకూడదు. చదివిన పాఠాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. గురువు బోధించే విషయాన్ని అర్థం చేసుకొని జ్ఞాపకం పెట్టుకోవాలి. చురుకైన బుద్ధితో మెలగాలి. మంచి కంఠస్వరం వుండాలి. గురువు మనస్సును సంతోష పెట్టాలి.

అదనపు భాషాంశాలు

నానార్థాలు

కాలం – సమయం, నలుపు, కారు, చావు
శక్తి – బలం, పార్వతి, సామర్థ్యం
అంగం – భాగం, అవయవం
జాతి – కులం, ఇల్లు, శరీరం
మూలం – కారణం, మొదలు
జీవనం – బ్రతుకు, నీరు
రక్తం – ఎరుపు, రుధిరం
శరం – బాణం, నీరు, రెల్లు
గోవు – ఆవు, కన్ను, బాణం
భూమి – ధర్మ వెల
మతం – అభిప్రాయం, సమ్మతి, శాస్త్రం
రాజ్యం – ప్రదేశం, రాష్ట్రం, ఏలుబడి
గర్భం – కడుపు, గుడిలోపలి స్థలం
పశువు – జంతువు, ప్రాణి, మేక
సంపద – లాభం, ధనం, ఐశ్వర్యం
బలం – సత్తువ, సైన్యం, బలాత్కారం

AP 10th Class Telugu 11th Lesson Questions and Answers యుద్ధ విజేత

వ్యుత్పత్త్యర్థములు

వ్యూహం – విశిష్టమైన ఊహా రచన – ప్రణాళిక
మరణం – దీనివలన చనిపోతారు – చావు
విజేత – విజయం సాధించిన వాడు – విజయుడు
పౌరుషం – పురుషుని భావం ఉద్యమం
పక్షి – పక్షములు కలది – పిట్ట
మానవులు – మనువు నుండి పుట్టిన వారు – మనుషులు
కలాపి – పింఛం కలది – నెమలి
పుష్పం – వికసించేది – పువ్వు
ధరణి – విశ్వాన్ని ధరించేది – భూమి
రుధిరం – ఎర్రని కాంతి కలది – రక్తం

సంధులు

అతనెప్పటికీ – అతను + ఎప్పటికీ – ఉత్వ సంధి
ఎందుకవుతుంది – ఎందుకు + అవుతుంది – ఉత్వ సంధి
కాలరెగరేస్తున్నాడు – కాలరు + ఎగరేస్తున్నాడు – ఉత్వ సంధి
నెత్తికెక్కించుకుని – నెత్తికి + ఎక్కించుకుని – ఇత్వ సంధి
గంతులేసే – గంతులు + ఏసే – ఇత్వ సంధి
మాంసపు ముద్ద – మాంసము + ముద్ద – పుంప్వాదేశ సంధి

సమాసములు

యుద్ధ విజేత – యుద్ధంలో విజేత – షష్ఠీ తత్పురుష సమాసం
అంగబలం – అంగము చేత బలం – తృతీయా తత్పురుష సమాసం
పచ్చని నేల – పచ్చనైన నేల – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నెత్తుటి తిలకం – నెత్తుటితో తిలకం – తృతీయా తత్పురుష సమాసం
మానవాళి – మానవుల యొక్క ఆళి – షష్ఠీ తత్పురుష సమాసం
మాంసపు ముద్ద – మాంసం యొక్క ముద్ద – షష్ఠీ తత్పురుష సమాసం
మరణ మృదంగం – మరణమనెడి మృదంగం – రూపక సమాసం
భార్యాబిడ్డలు – భార్య మరియు బిడ్డలు – ద్వంద్వ సమాసం
రెండు పశువులు – రెండు అనే సంఖ్య గల పశువులు – ద్విగు సమాసం

కవి పరిచయం

పేరు : నేతల ప్రతాప్ కుమార్
తల్లిదండ్రులు : శాంతకుమారి, సత్యం.

జన్మస్థలం : వీరు 13.08.1965లో నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో . జన్మించారు. ఇది నేడు తూర్పు గోదావరి జిల్లాలో భాగమైనది. (ఒకప్పుడు పశ్చిమ గోదావరి).

రచనలు : పాలకంకి, దళితనానీలు, అన్నం గిన్నె, భీంపాలరాగం, పుట్టినరోజు ఒక్కటే, బౌద్ధ భాషితాలు, బుద్ధిజం – శాస్త్రీయత, నా భూమికి నేనే, సమతా వసంత గానం, పిల్లల కోసం అంబేడ్కర్ కథ, నాగపూర్ యాత్ర తదితర గ్రంథాలు రాశారు.

పురస్కారాలు : విమల శాంతి జాతీయ కవితా పురస్కారం అందుకున్నారు. ప్రస్తుత పాఠ్యభాగం ‘సమతా వసంత గానం’ కవితా సంపుటి నుండి గ్రహించబడింది.

పదాలు – అర్ధాలు

తథ్యం = తప్పకుండా
దద్దమ్మ = చేతకానివాడు
మానవాళి = మానవుల సమూహం
అంగబలం = శారీరక శక్తి
అర్థబలం = ఎక్కువ సంపద
వ్యూహం = ప్రణాళిక
ఉన్మాది = పిచ్చివాడు, మానసిక రోగి
నామకరణం = పేరు పెట్టడం, పేరు నిర్ణయించడం
రమణి = స్త్రీ
మోము = ముఖం
ధ్వంసం = నాశనం చేయడం
త్యజించు = విడిచి పెట్టడం.
భోగం = సుఖం
చరాచర = కదిలేవి, కదలనివి
పశ్చాత్తాపం = చేసిన తప్పు తెలుసుకోవడం

Leave a Comment