Teachers often recommend practicing with AP 10th Class Biology Model Papers Set 9 in Telugu Medium to enhance exam readiness.
AP 10th Class Biology Model Paper Set 9 with Solutions in Telugu
Time: 2 Hours
Maximum Marks: 50
సూచనలు :
- ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 17 ప్రశ్నలు ఉండును.
- III వ విభాగం నందు కేవలం 12వ ప్రశ్నకు మాత్రమే మరియు IV వ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.
- 2 గంటల సమయంలో, 15 నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటకై కేటాయింపబడినది.
- అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రంలోనే రాయవలెను.
- అన్ని సమాధానములు స్పష్టంగాను, గుండ్రంగాను రాయవలెను.
విభాగము – I 8 × 1 = 8 మా.
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
ప్రశ్న 1.
కిణ్వనము అనగానేమి ?
జవాబు:
ఆక్సిజన్ లభ్యత లేనపుడు ఈస్ట్ కణాలు పైరువిక్ ఆమ్లమును ఇథైల్ ఆల్కహాల్గా మారుస్తాయి. దీనినే కిణ్వనము లేదా పులియబెట్టుట అంటారు.
ప్రశ్న 2.
మూత్ర సంఘటనమును తెలపండి.
జవాబు:
మూత్రంలో వివిధ ప్రోటీన్లు, క్రియాటినిన్, కాల్షియం, ఫాస్పరస్, యూరియా, సోడియం, పొటాషియం వంటి పదార్థాలు ఉంటాయి.
ప్రశ్న 3.
మీ తరగతి గది కిటికీ వద్ద ఒక మొక్కను ఉంచితే ఏమవుతుంది ?
జవాబు:
మొక్క సూర్యరశ్మి తగిలే వైపు వంగి పెరుగుతుంది. దీనినే కాంతి అనువర్తన చలనము అంటారు.
ప్రశ్న 4.
క్రింది పేరా ఆధారంగా శాస్త్రవేత్తను గుర్తించండి.
1953లో (DNA) నిర్మాణాన్ని తెలిపే నమూనాను ఆవిష్కరించారు. అది ద్విసర్పిలంగా ఉంటుంది. వీరికి నోబెల్ బహుమతి లభించింది. |
జవాబు:
వాట్సన్ మరియు క్రిక్
ప్రశ్న 5.
మొక్కలలో స్త్రీ సంయోగ బీజదం (అండం) చిత్రం గీయండి.
జవాబు:
ప్రశ్న 6.
నేల క్రమక్షయంను అరికట్టడానికి ఏవేని రెండు కృత్యాలను రాయండి.
జవాబు:
- నేలపైన ఉన్న గడ్డిని తొలగించకూడదు.
- నీరు నేలపైన కాకుండా ప్రత్యేక కాలువలలో వెళ్ళే విధంగా చేయాలి.
విభాగము – II 4 × 2 = 8 మా.
సూచనలు :
- క్రింది ప్రశ్నలన్నింటికి సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
ప్రశ్న 7.
అంతఃస్రావ గ్రంథులను గూర్చి తెలుసుకోవడానికి మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ?
జవాబు:
- అంతఃస్రావ, బహిస్రావ గ్రంథులకు గల తేడా ఏమిటి ?
- అంతఃస్రావ గ్రంథులు స్రవించే పదార్థాన్ని ఏమంటారు ?
- క్లోమగ్రంథి ఏ రకమైన గ్రంథి ?
- హార్మోన్లు మన దేహంలో ఎలాంటి పనులను నిర్వర్తిస్తాయి ?
ప్రశ్న 8.
లామార్క్ ప్రతిపాదించిన ‘ఆర్జిత గుణాల అనువంశికత’ సిద్ధాంతం నిజమయి ఉంటే, ప్రస్తుతం ఎలా ఉండేది ?
జవాబు:
లామార్క్ ప్రతిపాదించిన ఆర్జిత గుణాల అనువంశికత సూత్రం సరైనది కాదు. ఇది సరైనది అయితే ఒక జీవి జీవితకాలంలో పొందిన మార్పులు తరువాత తరానికి అందుతాయి.
- కాళ్లు, చేతులు లేనివారికి కాళ్లు, చేతులు లేని పిల్లలే పుడతారు.
- ఆడవాళ్లు ముక్కు, చెవులు కుట్టించుకుంటారు. లామార్క్ సూత్రం నిజమైతే, పుట్టే పిల్లలకు ముక్కు, చెవులు కుట్టిన పిల్లలు పుడతారు.
- ఎండలో పనిచేసే రైతులు, శ్రామికులు నల్లని చర్మం కలిగి ఉంటారు. వారి పిల్లలందరూ నల్లగానే పుడతారు.
- మనిషి తన జీవితంలో అనేక నైపుణ్యాలు సంపాదిస్తాడు. లామార్క్ సూత్రం ప్రకారం ఈ నైపుణ్యాలన్నీ పిల్లలకి చేరతాయి. అంటే ఏ శిక్షణా లేకుండానే పెయింటర్ కొడుకు పెయింట్ వేస్తాడు, శిల్పి కొడుకు శిల్పాలు చెక్కుతాడు.
- ఒక వ్యక్తి జిమ్కి వెళ్ళి దారుఢ్య దేహం సంపాదిస్తే అతని సంతతి దారుఢ్య దేహంతో పుడతారు. కానీ ఇవన్నీ అసాధ్యాలు.
ప్రశ్న 9.
కొండలలో గనులు త్రవ్వడం కోసం అడవులను నాశనం చేయడం వలన కలిగే నష్టాలేమిటి ?
జవాబు:
అడవులను మైనింగ్ కార్యకలాపాల కోసం నాశనం చేయడం వలన
- పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది..
- వర్షపాతం తగ్గుతుంది.
- గ్రీన్ హౌస్ వాయువుల విడుదల పెరుగుతుంది.
- గిరిజనుల జీవనోపాధి తగ్గడం, వారి సంస్కృతికి క్షీణత ఏర్పడును.
ప్రశ్న 10.
చిత్రం చూడండి. క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి.
a) ఏ ఏ దశలు పూర్తవటానికి ఒకే సమయం తీసుకుంటాయి ?
b) DNA సంశ్లేషణ ఏ దశలో జరుగుతుంది ?
జవాబు:
a) ‘G1’ దశ మరియు ‘S’ దశ
b) ‘S’ దశ.
విభాగము – III 5 × 4 = 20 మా.
సూచనలు :
-
- క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
ప్రశ్న 11.
HIV ఎయిడ్స్ వ్యాధి నివారణ తెలుపుతూ 5 నినాదాలు రాయండి.
జవాబు:
- ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం.
- ఎయిడ్స్ వ్యాధి నీ కళ్ళను మూయక ముందే వాటిని నీవు తెరువు.
- ఎయిడ్స్ వ్యాధిని అసహ్యించండి… వ్యాధిగ్రస్తులను కాదు.
- విజ్ఞానాన్ని వ్యాప్తి చేయండి…. HIV వైరస్ను కాదు.
- ఎయిడ్స్ అంటువ్యాధి కాదు…. అంటించుకునే వ్యాధి.
- కండోమ్ను ధరించు…. వ్యాధి సంక్రమణను నివారించు.
ప్రశ్న 12.
క్రింది పటములలో ఒక పటము గీసి, భాగాలను వ్రాయండి.
A) పత్రం యొక్క అడ్డుకోత చిత్రం గీసి, భాగాలు గుర్తించండి.
జవాబు:
(లేదా)
B) మూత్రపిండం నిలువుకోత పటం గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 13.
కారణాలు తెలపండి.
ఎ) వాసోప్రెస్సిన్ ఎల్లప్పుడూ స్రవించదు.
బి) మూత్రం మొదట ఆమ్లయుతంగా ఉండి తరువాత క్షారయుతంగా ఉంటుంది.
సి) అభివాహిధమని వ్యాసం కంటే, అపవాహిధమని వ్యాసం తక్కువగా ఉంటుంది.
డి) వేసవిలో మూత్రం చలికాలంలో కంటే చిక్కగా ఉంటుంది.
జవాబు:
ఎ) వాసోప్రెస్సిన్ ఎల్లప్పుడూ స్రవించదు : జీవక్రియలకు సరిపడినంత నీరు శరీరంలో లేనప్పుడు, వాసోప్రెస్సిన్ స్రవించబడి, నీటి పునఃశోషణను పెంచుతుంది. అందువలన గాఢత చెందిన మూత్రం ఏర్పడుతుంది. నీరు ఎక్కువగా త్రాగిన సందర్భాలలో, శీతాకాలంలో శరీరం నుండి నీటి నష్టం తక్కువగా ఉండి శరీరానికి సరిపడినంత నీరు లభించినపుడు వాసోప్రెస్సిన్ స్రవించబడదు
బి) మూత్రం మొదట ఆమ్లయుతంగా ఉండి తరువాత క్షారయుతంగా ఉంటుంది : మూత్రంలో మొదట యూరియా కరిగి యూరికామ్లంగా ఉండుట వలన ఆమ్లయుతంగా ఉంటుంది. కానీ యూరియా తరువాత అమ్మోనియాగా మారటం వలన మూత్రం క్రమంగా క్షారయుతంగా మారుతుంది.
సి) అభివాహిధమని వ్యాసం కంటే అపవాహిధమని వ్యాసం తక్కువగా ఉంటుంది : అపవాహిధమని వ్యాసం తక్కువగా ఉండుట వలన రక్తనాళగుచ్ఛం (గ్లోమెరూలస్) లో పీడనం పెరిగి, రక్తం వడపోతకు గురి అవుతుంది. అందువలన రక్తం నుండి మలిన పదార్థాలు వేరు చేయబడతాయి.
డి) వేసవిలో మూత్రం చలికాలంలో కంటే చిక్కగా ఉంటుంది : వేసవిలో పరిసరాల ఉష్ణోగ్రత అధికంగా ఉండుట వలన శరీరం చెమట ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతుంది. శరీరం నీటిని కోల్పోవటం వలన మూత్రం తక్కువగా ఏర్పడుతుంది. తక్కువ మూత్రం ద్వారా వ్యర్థాలు విసర్జించబడటం వలన మూత్రం చిక్కగా ఉంటుంది. కావున వేసవి కాలంలో ఎక్కువ నీరు త్రాగటం ఆరోగ్యకరం.
ప్రశ్న 14.
కింది పట్టికను పరిశీలించండి.
ప్రత్యుత్పత్తి విధానం | జీవులు |
విచ్ఛిత్తి | పారామీషియం, బాక్టీరియా |
కోరకీభవనం | ఈస్ట్, హైడ్రా |
ముక్కలగుట | స్పైరోగైరా, బద్దె పురుగులు |
కొమ్ములు | పసుపు, అల్లం |
ఛేదనం | గులాబి, మందార |
అంటుకట్టుట | నిమ్మ, ఆపిల్ |
పట్టిక ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
i) పై పట్టికలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే రెండు జీవుల పేర్లు రాయండి.
ii) పై పట్టికలో సూచించిన వాటిలో రెండు కృత్రిమ శాఖీయ వ్యాప్తి విధానాలను రాయండి.
iii) పై వాటిలో సహజ శాఖీయ వ్యాప్తి జరిపే రెండు మొక్కల పేర్లు రాయండి.
iv) విచ్ఛిత్తి ద్వారా ఒక జీవి నుండి ఎన్ని జీవులు ఏర్పడతాయి ?
జవాబు:
i) పారామీషియం, బాక్టీరియా, ఈస్ట్, హైడ్రా
ii) (ఎ) ఛేదనము (బి) అంటుకట్టుట
iii) (ఎ) పసుపు (బి) అల్లం
iv) విచ్ఛిత్తి – ద్విదా విచ్ఛిత్తి – రెండు జీవులు ఏర్పడతాయి.
(లేదా)
విచ్ఛిత్తి – బహుదా విచ్ఛిత్తి – రెండు కంటే ఎక్కువ జీవులు ఏర్పడతాయి.
ప్రశ్న 15.
ఊపిరితిత్తులలో వాయువుల ప్రసారం ఎలా జరుగుతుంది ?
జవాబు:
నాసికా రంధ్రాల ద్వారా వాయువు శరీరంలోకి ప్రవేశిస్తుంది. నాసికా కుహరంలో గాలిలోని దుమ్ము, ధూళికణాలు తొలగించబడతాయి. గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత దాదాపు సమానమవుతుంది. ఉప జిహ్విక అనే కండరపు కవాటం ఆహారపు, వాయు మార్గాలను నియంత్రిస్తూ తమ తమ వ్యవస్థల లోనికి సరిగ్గా ప్రవేశించునట్లు చేస్తుంది. ఊపిరితిత్తుల నుండి నిశ్వాసంలో బయటకు వచ్చే గాలి స్వరతంత్రుల గుండా ప్రయాణించేటప్పుడు వాటిని కంపించేలా చేస్తుంది. వాయునాళం ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకెళ్ళే నిర్మాణం. వాయునాళం ఉరః కుహరం మధ్య భాగంలో రెండు శ్వాసనాళాలుగా చీలి ఒక్కొక్క ఊపిరితిత్తిలోకి చేరుతుంది. శ్వాసనాళాలు అనేకసార్లు చీలుతూపోయి చివరకు శ్వాసనాళికలుగా అంతమవుతాయి. శ్వాసనాళికలు వాయుగోణులలో అంతమవుతాయి. రక్త కేశనాళికలు వాయుకోశగోణుల గోడలలో అధికసంఖ్యలో ఉండడం వలన వాయు వినిమయం జరుగుతుంది. రక్తం ఆక్సిజన్ని శరీరంలోని ప్రతి కణానికి అందజేస్తుంది.
విభాగము – IV 2 × 8 = 16 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
- ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
ప్రశ్న 16.
ఎ) కణచక్రంలోని వివిధ దశలను తెలపండి.
జవాబు:
సర్వసాధారణంగా కణ విభజన ప్రక్రియలను సమవిభజన (mitosis) అంటాము. అది 40 నుంచి 60 నిమిషాలల్లోనే పూర్తవుతుంది. (సరిగ్గా విభజనకై తీసుకొనే సమయం). రెండు కణ విభజనలకు మధ్య నుండే సమయాన్ని అంతర్దశ (interphase) అంటారు. ఈ దశలో కణ విభజనకు అవసరమయ్యే వివిధ పదార్థాల ఉత్పత్తి, DNA జన్యు పదార్థం ప్రతికృతి జరిగి సమవిభజన ద్వారా పిల్ల కణాలకు సమానంగా పంచబడతాయి. ఈ దశను 3 ఉపదశలుగా వర్గీకరించారు.
G1 దశ : ఇది సమవిభజనకు మరియు DNA ప్రతికృతికి మధ్యగల సంధాన దశ. ఈ దశలో కణ పరిమాణం పెరుగుతుంది.
S దశ : ఇది DNA సంశ్లేషణ జరిగే దశ. ఈ దశలో క్రోమోజోమ్లు రెట్టింపు అవుతాయి.
G2 దశ : ఇది DNA ప్రతికృతి మరియు సమవిభజన ప్రారంభానికి మధ్యగల దశ. కణాంగాలు విభజన చెందుతాయి. క్రోమోజోమ్లు సమవిభజనకు సిద్ధమవుతాయి.
M దశ : ఇది సమవిభజన జరిగే దశ.
(లేదా)
బి) మానవ హృదయ నిర్మాణమును చిత్రం సహాయంతో వివరించుము.
జవాబు:
హృదయము – బాహ్యనిర్మాణము :
- హృదయం, ఉరః పంజరంలో ఊపిరితిత్తుల మధ్యలో అమరి ఉంటుంది. మీ గుండె పరిమాణం సుమారుగా మీ అంత ఉంటుంది.
- ఇది కార్డియాక్ కండరంతో చేయబడి ఉంది.
- గుండె బేరీ పండు ఆకారంలో ఉండి, త్రికోణాకారంగా ఉంటుంది. పై వైపున వెడల్పుగాను, క్రింది వైపున సన్నగాను, కొద్దిగా ఎడమ వైపుకు వంగి ఉంటుంది.
- గుండెను ఆవరించి రెండు పొరలుంటాయి. వీనిని “హృదయావరణ త్వచాలు” అంటారు. ఈ రెండు పొరల మధ్య భాగం హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది.
అంతర్నిర్మాణం :
- గుండె లోపల ఉండే ఉబ్బెత్తు నిర్మాణాలు గుండెను నాలుగు గదులుగా విభజిస్తాయి.
- పై రెండు గదులను ‘కర్ణికలు’ అని, క్రింద రెండు గదులను ‘జఠరికలు’ అని అంటారు.
- గుండె గోడలకు అంటిపెట్టుకొన్న రక్తనాళాలను ‘కరోనరీ’ రక్తనాళాలంటారు.
- ఇవి గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి.
- పై వైపున ఉన్న కర్ణికల గోడలు పలుచగాను, కిందివైపు ఉన్న జఠరికల గోడలు మందంగాను ఉంటాయి.
- దృఢంగా ఉన్న రక్తనాళాలను ‘ధమనులు’ అంటారు. ‘బృహద్ధమని’ హృదయం నుండి బయలుదేరి శరీర భాగాలన్నింటికి మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇది అతి పెద్ద ధమని.
- చిన్న ధమని, “పుపుస ధమని”. ఇది రక్తాన్ని హృదయం నుండి ఊపిరితిత్తులకు తీసికుపోతుంది.
- గుండె పై భాగంలో కుడివైపున ఉండే పెద్ద సిరను “ఊర్థ్వ బృహత్సిర” అంటారు.
- ఇది శరీరం పై భాగాల నుండి రక్తాన్ని సేకరించి కుడి కర్ణికలోకి తెరుచుకుంటుంది.
- గుండె కుడివైపు దిగువ భాగంలో కనిపించే సిరను “అధోబృహత్సిర” అంటారు.
- ఇది శరీరం దిగువ భాగాల నుండి రక్తాన్ని సేకరించి కుడి కర్ణికలోకి తెరుచుకుంటుంది.
- ఎడమ కర్ణికలో ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకువచ్చే ‘పుపుస సిరలు’ తెరుచుకొనే రంధ్రాలుంటాయి.
- కుడి జఠరిక నుండి బయలుదేరే రక్తనాళము పుపుస ధమని ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది.
- ఎడమ జఠరిక నుండి “బృహద్ధమని” శరీర భాగాలకు ఆమ్లజనితో కూడిన రక్తాన్ని సరఫరా చేస్తుంది.
- కుడి కర్ణికకు, కుడి జఠరికకు మధ్యగల కుడికర్ణిక జఠరికాంతర విభాజకముపై గల కవాటాన్ని “అగ్రత్రయ కవాటం” అని అంటారు.
- ఎడమ కర్ణిక, ఎడమ జఠరికకు మధ్యగల ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజకము పైగల కవాటాన్ని “అగ్రద్వయ కవాటం” అని అంటారు.
ప్రశ్న 17.
ఎ) కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరమని నిరూపించే ప్రయోగానికి కావలసిన పరికరాలు మరియు ప్రయోగ విధానాన్ని వివరించండి.
జవాబు:
బ్లాక్ పేపర్, క్లిప్స్, కుండీలో పెరుగుతున్న మొక్క, అయోడిన్, మిథైలేటెడ్, స్పిరిట్, పెట్రిడిష్
ప్రయోగ విధానం :
- కుండీలో పెరుగుతున్న మొక్కలోని పిండి పదార్థం తొలగించడానికి వారం రోజులు చీకటిలో ఉంచాలి. ఒక నల్లని కాగితం తీసుకొని మీకు నచ్చిన డిజైన్ కత్తిరించండి.
- డిజైను కాగితాన్ని ఆకుకు పైన క్రింద ఉంచి క్లిప్స్ పెట్టాలి. నల్లటి భాగం గుండా కాంతి ఆకుపైన పడకుండా కాగితం ఉండేలా అమర్చాలి.
- అమరికలో ఉన్న మొక్కను సూర్యరశ్మిలో ఉంచండి. కొన్ని గంటల తర్వాత ఆకును వేరుచేసి నీటిలో వేడి చేయండి.
- ఆకును పరీక్ష నాళికలో ఉంచి మిథైలేటెడ్ స్పిరిట్ పోసి, దానిని నీరు ఉన్న బీకరులో ఉంచి వేడి చేయాలి. ఆకు నుండి పత్రహరితం తొలగిన తరువాత దానిని పెట్రిడిలో ఉంచాలి.
- ఆకుపై కొన్ని చుక్కల అయోడిన్ వేయండి. ఎక్కడైతే సూర్యరశ్మి సోకలేదో అక్కడ తెల్లగా, మిగతా భాగం నీలంగా మారింది.
నిర్ధారణ : ఆకుపై ఎక్కడైతే సూర్యరశ్మి సోకలేదో అక్కడ పిండి పదార్థం ఏర్పడక తెల్లగా ఉంది. ఆకు మిగతా భాగంలో సూర్యరశ్మితో సహా అన్ని కారకాలు ఉండటం వల్ల పిండిపదార్థం ఏర్పడింది. ఆకు నీలంగా మారింది.
(లేదా)
బి) అవాయు-శ్వాసక్రియను అర్థం చేసుకోవడానికి మీ ప్రయోగశాలలో నీవు నిర్వహించిన ప్రక్రియను వివరించండి.
జవాబు:
ఉద్దేశం : అవాయు శ్వాసక్రియ జరుగునపుడు ఆల్కహాలు ఏర్పడునని నిరూపించుట.
కావలసిన పరికరాలు : గాజుసీసా, గ్లూకోజ్ ద్రావణం, ఈస్టు కణాలు, చిన్నబీకరు.
ప్రయోగం చేయు విధానం : వెడల్పు మూతిగల ఒక గాజుసీసా తీసుకొనవలెను. సున్నపు తేట నింపిన చిన్న బీకరును ఆ గాజు సీసాలో ఉంచవలెను. గాజు సీసాలో 200 మి.లీ. గ్లూకోజు ద్రావణం తీసుకుని దానికి కొంచెం రొట్టెలలో.. ఉపయోగించే ఈస్టు కలపవలెను. గ్లూకోజ్ ద్రావణంపైన నూనె పోసి కప్పవలెను. దీని వలన గాలి గ్లూకోజ్లో ప్రవేశించదు. గాజు సీసాకు గట్టి బిరడాను బిగించవలెను. ఒకటి రెండు రోజులు తరువాత సీసా మూతను తీసి వాసన చూస్తే, అది ఆల్కహాలు వాసన’ ఉండడం గమనించవలెను. అలాగే సున్నపుతేట పాలవలె మారడం గమనించవలెను.
పరిశీలన : అవాయు పరిస్థితులలో శ్వాసక్రియ జరగడం వల్ల గ్లూకోజు ద్రావణం ఆల్కహాలుగా మారినది. కార్బన్ డై ఆక్సైడు విడుదలగుట వలన సున్నపు తేట పాలవలె మారినది.
నిర్ధారణ : దీనిని బట్టి అవాయు పరిస్థితులలో కూడా శ్వాసక్రియ జరుగుతుందని తెలుస్తుంది.