Teachers often recommend practicing with AP 10th Class Biology Model Papers Set 8 in Telugu Medium to enhance exam readiness.
AP 10th Class Biology Model Paper Set 8 with Solutions in Telugu
Time: 2 Hours
Maximum Marks: 50
సూచనలు :
- ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 17 ప్రశ్నలు ఉండును.
- III వ విభాగం నందు కేవలం 12వ ప్రశ్నకు మాత్రమే మరియు IV వ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.
- 2 గంటల సమయంలో, 15 నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటకై కేటాయింపబడినది.
- అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రంలోనే రాయవలెను.
- అన్ని సమాధానములు స్పష్టంగాను, గుండ్రంగాను రాయవలెను.
విభాగము – I 8 × 1 = 8 మా.
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
ప్రశ్న 1.
విచక్షణా రహితంగా బోరు బావులను త్రవ్వితే భవిష్యత్తు ఏమవుతుంది ?
జవాబు:
భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. నీటి ఎద్దడి ఏర్పడి కరువు ఏర్పడుతుంది.
ప్రశ్న 2.
క్రింది లోగో ఏమి తెలియజేస్తుంది ?
జవాబు:
సుస్థిరాభివృద్ధిని తెలుపుతుంది.
ప్రశ్న 3.
మీలోని అన్ని లక్షణాలు మీ తల్లిదండ్రులను పోలి ఉన్నాయా ?
జవాబు:
నాలోని అన్ని లక్షణాలు తల్లిదండ్రులను పోలి ఉంటాయి. కాని కొన్ని కొత్త లక్షణాలు కూడా కనబడుతాయి.
ప్రశ్న 4.
మూత్రం ఎందుకు పసుపుగా ఉంటుంది ?
జవాబు:
మూత్రంలో యూరోక్రోమ్ అనే వర్ణకం ఉండటం వలన మూత్రం పసుపుగా ఉంటుంది.
ప్రశ్న 5.
ధమని యొక్క అడ్డుకోత చిత్రం గీయండి.
జవాబు:
ప్రశ్న 6.
అవాయు శ్వాసక్రియలో కండరాలలో ఏర్పడే రసాయన పదార్థం ఏది ?
జవాబు:
లాక్టిక్ ఆమ్లం
విభాగము – II 4 × 2 = 8 మా.
సూచనలు :
- క్రింది ప్రశ్నలన్నింటికి సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
ప్రశ్న 7.
ఆహారం మ్రింగేటపుడు మరియు శ్వాసక్రియలో ఉపజిహ్విక యొక్క పాత్ర ఏమిటి ?
జవాబు:
- ఉపజిహ్విక కంఠబిలంలో కవాటం వలె పనిచేస్తుంది.
- శ్వాసనాళం, ఆహార వాహికలను వేరు పరచడానికి సహాయపడుతుంది.
- మ్రింగే సమయంలో ఆహారం వాయునాళంలోనికి వెళ్ళకుండా కాపాడుతుంది.
ప్రశ్న 8.
ప్రేగులోని ఆంత్రరసాలను గూర్చి తెలుసుకోవడానికి మీకు సమీపంలోని వైద్యుని ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు ?
జవాబు:
- ప్రేగులో ఏయే రసాలు ఉత్పత్తి అవుతాయి ?
- ఆంత్రరసాలలో గల ఎంజైమ్ల పేర్లు ఏమిటి ?
- ఆంత్ర ఎంజైమ్లు ఆహారాన్ని ఎలా జీర్ణం చేస్తాయి ?
ప్రశ్న 9.
కింది ఇచ్చిన సమాచారాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.
ప్రతి జీవిలో రెండు రకాల కణ విభజనలు జరుగుతాయి. సమ విభజనలో క్రోమోజోమ్ల సంఖ్య (2n) లో మార్పు ఉండదు. క్షయకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి (n) కు తగ్గుతుంది, అని వీస్మీన్ పరికల్పన చేశాడు. |
i) ‘n’ మరియు ‘2n’ అనేవి వేటిని సూచిస్తాయి ?
జవాబు:
‘n’ ఏకస్థితికమును, ‘2n’ ద్వయస్థితికమును సూచిస్తాయి.
ii) క్షయకరణ విభజన ఏ కణాలలో జరుగుతుంది ?
జవాబు:
లైంగిక కణాలలో సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు క్షయకరణ విభజన జరుగుతుంది.
iii) క్షయకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గకుంటే ఏమి జరుగుతుంది ?
జవాబు:
క్షయకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గకుంటే క్రోమోజోముల సంఖ్య తరువాత తరాలలో స్థిరంగా వుండదు.
iv) చర్మ కణాలు ఏ రకం అయిన కణవిభజనను జరుపుతాయి ?
జవాబు:
చర్మ కణాలు సమవిభజనను జరుపుతాయి.
ప్రశ్న 10.
జీవావరణ పిరమిడ్లను గూర్చి తెలుసుకోవడానికి ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు ?
జవాబు:
- జీవావరణ పిరమిడ్లను ఎవరు రూపొందించారు ?
- సాధారణ పిరమిడ నకు జీవావరణ పిరమిడ్నకు భేదాలేవి ?
- జీవావరణ పిరమిడ్లు ఎన్ని రకాలు ? అవి ఏవి ?
- సంఖ్యా పిరమిడ్ దేని ఆధారంగా ఏర్పరుస్తారు ?
విభాగము – III 5 × 4 = 20 మా.
సూచనలు :
-
- క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
ప్రశ్న 11.
ఆహారపు గొలుసులో ఒక పోషకస్థాయి నుండి మరొక పోషకస్థాయికి బదిలీ అయిన శక్తి ఏమవుతుంది ?
జవాబు:
- ఆహారపు గొలుసులో ఒక పోషకస్థాయి నుండి మరొక పోషకస్థాయికి శక్తి బదిలీ అవుతుంది.
- ఈ శక్తి బదిలీ పూర్తిగా 100 శాతం జరగదు. కొంత శక్తి జీవి జీవక్రియలకు వినియోగించుకుంటుంది.
- ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక పోషకస్థాయి నుండి తరువాత పోషకస్థాయికి కేవలం 10-20% శక్తి మాత్రమే సరఫరా అవుతుంది. మిగిలిన 80% నుండి శక్తి జీవి జీవక్రియలకు, శరీర ఉష్ణానికి ఖర్చు చేయబడుతుంది.
- ఉదాహరణకు 10 కిలోల గడ్డిని ఒక శాకాహారి ఆహారంగా తీసుకొంటే, దాని నుండి లభించిన శక్తిని, ఆ శాకాహారి, జీవక్రియలకు వాడుకొంటుంది. అంటే గుండె కొట్టుకోవటానికి, పరుగెత్తటానికి, శరీర ఉష్ణానికి ఈ శక్తి ఖర్చు అవుతుంది. ఇలా ఖర్చు అయ్యే శక్తి విలువ 80% వరకు ఉంటుంది.
- జీవి తన అవసరాలకు పోను మిగిలిన శక్తిని జీవద్రవ్యరాశి రూపంలో శరీరంలో నిల్వ చేసుకొంటుంది. ఈ నిల్వ చేసుకొన్న తక్కువ శక్తి తరువాత పోషకస్థాయి అయిన మాంసాహారికి అందించబడుతుంది.
ప్రశ్న 12.
క్రింది పటములలో ఒక పటము గీసి, భాగాలను వ్రాయండి.
A) ఆంత్రచూషకాలను చూపే చిత్రం గీచి, భాగాలను గుర్తించండి.
జవాబు:
(లేదా)
B) స్వతంత్ర వ్యూహన సిద్ధాంతాన్ని చూపే గడుల చిత్రాన్ని బట్టి ఒక ఫ్లోచార్టును గీయండి.
జవాబు:
గు.ప – గుండ్రని పసుపు – 9
గు.ఆ – గుండ్రని ఆకుపచ్చ – 3
ము.ప – ముడతలు పసుపు – 3
ము.ఆ – ముడతలు ఆకుపచ్చ – 1
ద్విసంకర సంకరణం, F2 తరం దృశ్య రూప నిష్పత్తి – 9 : 3 : 3 : 1 |
ప్రశ్న 13.
మానవ పరిణామం గురించి స్వగతం తయారుచేయండి.
జవాబు:
భూమి మీద అత్యున్నత మేధాసంపత్తి గల జీవిగా పిలవబడే మానవుడు అను నేను అన్ని సాధారణ జీవులవలె పరిణామం చెంది ఈ స్థాయికి వచ్చానంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆదిమానవుని వలె 7 లక్షల 50 వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన నా పరిణామం నేడు నన్ను అగ్రస్థాయిలో నిలిపింది. మొదట ‘హోమో హెబిలస్’ గా పిలవబడిన నేను మిగిలిన ప్రేమేట్స్ మాదిరిగా ఒక జంతువుగా అడవిలో సంచరించటం ప్రారంభించాను. ఇది సుమారు 1.6 నుండి 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం మాట. తరువాత నేను చింపాంజి, గొరిల్లాల వలె కాకుండా నిటారుగా నిలబడటం నేర్చుకొన్నాను. ఇది నా జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన. దీనివలన నా రెండు చేతులు ఉపయోగంలోకి వచ్చాయి. అప్పుడు నన్ను ‘హోమో ఎరెక్టస్’ అన్నారు. తరువాత జంతువులతో వేరైన నేను మనిషిగా అడుగులు వేశాను. సంఘజీవనం స్థాపించాను. నన్ను అపుడు ‘నియాండర్తలెన్సిస్’ గా పిలిచారు. తరువాత 12.5 లక్షల సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఇపుడు ఆధునిక మానవుడిగా ‘హోమో సెపియన్ ‘గా పిలవబడుతూ, నా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాను.
ప్రశ్న 14.
కింది సమాచారాన్ని విశ్లేషించండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
వ.సం. | మొక్క పేరు | వ్యాప్తిచెందే పద్ధతి |
1) | మామిడి | అంటుకట్టడం |
2) | గులాబి, మందార | ఛేదనం |
3) | మల్లె | అంటుతొక్కడం |
4) | రణపాల | ఆకు అంచుల నుండి కొత్త మొక్కలు మొలకెత్తుతాయి |
5) | బంగాళదుంప | దుంప |
6) | ఉల్లి | లపనం |
i) పైన సూచించిన ప్రత్యుత్పత్తి విధానాలను ఏమని పిలవవచ్చు ?
ii) మొక్కలలో శాఖీయ ప్రత్యుత్పత్తికి, లైంగిక ప్రత్యుత్పత్తికి గల ముఖ్యమైన తేడా ఏమిటి ?
iii) బంగాళదుంప మొక్క విత్తనాలను ఉత్పత్తి చేయలేదు. ఇలాంటి మొక్కలను ఏ పద్ధతి ద్వారా వ్యాప్తి చెందించవచ్చు?
iv) పట్టికలో సూచించిన పద్ధతులలో మొక్కలను వ్యాప్తి చెందించడం వలన కలిగే లాభం ఏమిటి ?
i) పైన సూచించిన ప్రత్యుత్పత్తి విధానాలను ఏమని పిలవవచ్చు ?
జవాబు:
పట్టికలో సూచించినవి శాఖీయోత్పత్తి విధానాలు.
ii) మొక్కలలో శాఖీయ ప్రత్యుత్పత్తికి, లైంగిక ప్రత్యుత్పత్తికి గల ముఖ్యమైన తేడా ఏమిటి ?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగబీజాలు ఏర్పడి సంయోగం చెందుతాయి. శాఖీయ ప్రత్యుత్పత్తిలో సంయోగబీజాలు ఏర్పడవు.
iii) బంగాళదుంప మొక్క విత్తనాలను ఉత్పత్తి చేయలేదు. ఇలాంటి మొక్కలను ఏ పద్ధతి ద్వారా వ్యాప్తి చెందించవచ్చు?
జవాబు:
బంగాళదుంప మొక్కలు ‘కన్నులు’ అనే శాఖీయోత్పత్తి విధానంలో వ్యాప్తి చెందును.
iv) పట్టికలో సూచించిన పద్ధతులలో మొక్కలను వ్యాప్తి చెందించడం వలన కలిగే లాభం ఏమిటి ?
జవాబు:
శాఖీయోత్పత్తిలో మొక్కల నాణ్యత మారదు. తక్కువ కాలంలో ఎక్కువ మొక్కలు ఉత్పత్తి చేయవచ్చు.
ప్రశ్న 15.
మూత్రపిండాలు పనిచేయని వ్యక్తి పాటించవలసిన తాత్కాలిక మరియు శాశ్వత పరిష్కార పద్ధతులను వివరించండి.
జవాబు:
వివరణ : ESRD వ్యక్తికి తాత్కాలిక పరిష్కార పద్ధతి – డయాలసిస్ (లేదా) కృత్రిమ మూత్రపిండము మరియు శాశ్వత పరిష్కార పద్ధతి మూత్రపిండ మార్పిడి.
డయాలసిస్ :
- ఈ ప్రక్రియలో రక్తాన్ని ఒక ముఖ్యమైన ధమని ద్వారా బయటకు తెచ్చి రక్తస్కంధనాన్ని నిరోధించే కారకాలను కలిపి డయలైజర్ యంత్రంలోకి పంపిస్తారు.
- డయలైజర్ యంత్రంలో రక్తం గొట్టాల వంటి సెల్లోఫేన్తో తయారైన నాళికల ద్వారా ప్రవహించును. ఈ నాళికలు డయలైజింగ్ ద్రావణంలో మునిగి వుంటాయి.
- డయలైజింగ్ ద్రావణంలో నత్రజని వ్యర్థాలు వుండవు కనుక డయలైజర్లో రక్తం ప్రవహించేటప్పుడు నత్రజని వ్యర్థాలు వేరై రక్తం శుద్ధి చేయబడుతుంది.
మూత్రపిండ మార్పిడి :
- మూత్రపిండాలు పనిచేయని వారికి వారి దగ్గర బంధువు (దాత) నుండి బాగా పనిచేస్తున్న మూత్రపిండాన్ని వేరుచేసి అమర్చుతారు.
- రోగికి అమర్చిన మూత్రపిండము సరిగ్గా సరిపోయేలా అసంక్రామ్యత వ్యవస్థ ఆ మూత్రపిండాన్ని తిరస్కరించకుండా వుండాలంటే అతి సమీప బంధువు మూత్రపిండాన్ని దానం చేయాల్సి వుంటుంది.
- ఈ మధ్య కాలంలో దాతల నుండి మూత్రపిండాలు మరియు ఇతర అవయవాలు సేకరించి మూత్రపిండాలు పాడైపోయిన వారికి అమరుస్తున్నారు.
విభాగము – IV 2 × 8 = 16 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
- ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
ప్రశ్న 16.
ఎ) మీ శరీరం అంతఃస్రావ వ్యవస్థ మరియు నాడీవ్యవస్థతో సమన్వయంగా పనిచేస్తుందనడానికి కొన్ని ఉదాహరణలివ్వండి.
జవాబు:
- మన శరీరంలో అంతఃస్రావ వ్యవస్థ మరియు నాడీవ్యవస్థ సమన్వయంగా పనిచేస్తాయి.
- ఆందోళన, ఒత్తిడి ప్రమాదకర పరిస్థితులలో అధివృక్క గ్రంథి వల్కలం నుండి ఎడ్రినలిన్, నారడ్రినలిన్ హార్మోన్స్ స్రవించబడతాయి. ఇవి నాడీవ్యవస్థ నుండి వచ్చే ప్రచోదనాల వలన జరుగుతుంది.
- హైపోథాలమస్ మరియు పీయూష గ్రంథి స్రావాలు నాడీవ్యవస్థ అధీనంలో ఉంటాయి. అందుకే వీటి రసాయనాలను ‘న్యూరోహార్మోన్స్’ అంటారు.
- పీయూష గ్రంథి పరలంబికను ‘Neurohypophysis’ అంటారు. ఇది నాడీ కణజాలం కలిగి ఉండి, వినాళగ్రంథిగా పనిచేస్తుంది.
- నాడీ ప్రచోదనాలలో కీలకపాత్ర వహించే న్యూరోట్రాన్స్మీటర్స్ నాడీ రసాయన సమన్వయానికి ఉదాహరణ. ఉదా: ఎసిటైల్కొలిన్.
నిజ జీవిత నిదర్శనాలు :
- తల్లి బిడ్డకు పాలు ఇచ్చే సందర్భంలో చనుమొనలు (Nipple) చప్పరించటం వలన ఉద్దీపన జ్ఞాననాడి ద్వారా మెదడుకు చేరుతుంది. మెదడు ఆదేశం అనుసరించి పిట్యూటరీ గ్రంథి ‘ఆక్సిటాసిన్’ను ఉత్పత్తి చేస్తుంది. ఇది క్షీర గ్రంథులను ప్రేరేపించి పాలు విడుదల అవుతాయి. ఈ ప్రక్రియలో నాడీ రసాయనిక వ్యవస్థలు సమన్వయంగా పనిచేస్తాయి.
- లైంగిక ఉద్రేకాలలో గ్రాహకాల నుండి మెదడుకు సమాచారం చేరవేయటం వలన మెదడు ప్రతిస్పందించి ఆదేశాలు ఇస్తుంది. మెదడు ఆదేశాల మేరకు ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్స్ స్రవించబడి ప్రతిచర్యలు చూపుతాయి.
(లేదా)
బి) మానవుని రక్తము నుండి జీవ వ్యర్థములను తొలగించడానికి మూత్రపిండము ఎలా అనుకూలంగా ఉన్నది ?
జవాబు:
మూత్రపిండాల నిర్మాణం :
- మానవునిలో విసర్జన వ్యవస్థలో ఉండే భాగాలు ఎ) ఒక జత మూత్రపిండాలు, బి) ఒక జత మూత్రనాళాలు సి) మూత్రాశయం మరియు డి) ప్రసేకం.
- మూత్రపిండాల లోపలి తలం మధ్యలో గల పల్లాన్ని హైలస్ అంటారు. ఈ హైలస్ ద్వారా వృక్కధమని మూత్రపిండం లోనికి ప్రవేశిస్తుంది. వృక్కసిర మూత్రనాళం వెలుపలికి వస్తుంది.
- శరీరంలోని వివిధ అవయవాలలో ఉత్పత్తి అయిన వ్యర్థాలు ఆమ్లజని సహిత రక్తంతో కూడి వృక్కధమని ద్వారా మూత్రపిండాన్ని చేరుతాయి. ఆమ్లజని రహిత రక్తాన్ని వృక్కసిర మూత్రపిండం నుండి బయటికి పంపుతుంది.
- మూత్రపిండంలో రక్తం వడకట్టబడుతుంది. ఫలితంగా వేరుచేయబడిన వ్యర్థాలు మూత్రంగా బయటికి విసర్జించబడతాయి. దీనిలో నెఫ్రాన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది.
మూత్రం ఏర్పడే విధానం : మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలుంటాయి.
1) గుచ్ఛగాలనం
2) వరణాత్మక పునఃశోషణం
3) నాభికాస్రావం
4) అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం.
1) గుచ్ఛగాలనం : వృక్క ధమని శాఖ అయిన అభివాహి ధమని నుండి రక్తం, రక్తకేశ నాళికా గుచ్ఛం లోనికి ప్రవేశిస్తుంది. . ఈ ధమని కలిగించే పీడనం వల్ల రక్తం వడపోయబడుతుంది. వ్యర్థ పదార్థాల అణువులు, పోషక పదార్థాల అణువులు, నీరు వడపోయబడి బౌమన్స్ గుళికకు చేరతాయి.
2) వరణాత్మక పునఃశోషణం : వరణాత్మక పునః శోషణం ప్రాథమిక మూత్రంలో ఉండే ఉపయుక్త పదార్థాలను బాహ్య రక్తకేశనాళికా వల తిరిగి శోషిస్తుంది. గ్లూకోజు, అమైనో ఆమ్లాలు, విటమిన్ ‘సి’, పొటాషియం, కాల్షియం, సోడియం క్లోరైడ్లు, 75% నీరు పునఃశోషించబడతాయి.
3) నాళికాస్రావం : సమీపస్థ సంవళితనాళంలో పునఃశోషణం తరువాత మూత్రం హెన్లీ శక్యం ద్వారా దూరస్థ సంవళితనాళంలోనికి చేరుతుంది. ఇక్కడ అధికంగా ఉన్న పొటాషియం, సోడియం, హైడ్రోజన్ అయానులు బాహ్యరక్తకేశనాళికా వల నుండి దూరస్థ సంవళిత నాళంలోకి స్రవించబడతాయి. దీనివల్ల మూత్రం యొక్క pH సమతుల్యమవుతుంది.
4) అతిగాఢత గల మూత్రం ఏర్పడటం : నెఫ్రాన్ వడగట్టిన మూత్రంలో 75% నీరు సమీపస్థ సంవళిత భాగంలోనే పునఃశోషణమవుతుంది. హెన్లీశిక్యం ప్రాంతంలో ఉన్న మూత్రం నుండి 10% నీరు ద్రవాభిసరణం ద్వారా దానిని ఆవరించి ఉన్న కణజాలంలోనికి శోషించబడుతుంది. తరువాత సంగ్రహణ నాళంలో వాసోప్రెసిన్ అనే హార్మోన్ సమక్షంలో నీటి పునఃశోషణ జరిగి మూత్రం అతి గాఢతను పొందుతుంది.
మూత్రంలో 96% నీరు, 2.5% కర్బన పదార్థాలు (యూరియా, యూరికామ్లం, క్రియాటిన్, క్రియాటినైన్, నీటిలో కరిగే విటమిన్లు, హార్మోన్లు మరియు ఆక్సలేట్లు మొదలైనవి) మరియు 1.5% అకర్బన పదార్థాలు (సోడియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్ మొదలైనవి) ఉంటాయి.
ప్రశ్న 17.
ఎ) కాండం కొనమీద ఫైటోహార్మోన్ ప్రభావం తెలుసుకోవటానికి నీవు ఏ ప్రయోగం నిర్వహిస్తావు ?
జవాబు:
ప్రయోగం : 1926లో డచ్ వృక్ష శరీర ధర్మ శాస్త్రవేత్తలు వెంట్ మొక్క ద్వారా ఉత్పత్తి అయిన ఒక ప్రభావాన్ని ఏర్పరచడంలో సఫలీకృతులయ్యారు. ఓటు ధాన్యపు అంకురం యొక్క ప్రాంకురం కవచాన్ని కత్తిరించాడు. కాండం కొనపైన ఆగార్ ఆగార్ ముక్కకు పెట్టి గంటసేపు అలాగే ఉంచాడు. ఆగార్ను చిన్న చిన్న పెట్టెలుగా కత్తిరించి ప్రతి పెట్టె వంటి ఆగార్ని తొడుగు కత్తిరించిన మొక్క కాండంపైన పెట్టాడు. వాటిని చీకటిలో ఉంచాడు. గంటలోపల నిర్దిష్టమైన వంపును ఆగార్ పెట్టిన భాగం నుండి దూరంగా కనబడింది.
పరిశీలన : ప్రాంకుర కవచంతో సంబంధంలేని ఆగార్ కాండం కొనభాగం ఎటువంటి వంపును ప్రదర్శించలేదు. ఆగార్ ముక్క ఉంచిన భాగం వైపు కొద్దిగా వంపు కనబడింది.
నిర్ధారణ : ఈ ప్రయోగం ఆధారంగా వెంట్ ఊహించిందేమిటంటే ప్రాంకుర కవచం కొనభాగం ప్రభావం రసాయనిక ఉద్దీపన వలన జరిగిందని ఈ రసాయనిక ఉద్దీపనలకు ఆక్సిన్లు అని పేరు పెట్టాడు. ఈ విధంగా వెంట్ ఆక్సిన్ అనే మొట్టమొదటి మొక్క హార్మోన్ ను కనుగొనగలిగారు.
(లేదా)
బి) లాలాజలం యొక్క చర్యను అర్థం చేసుకోవటానికి పిండిపై ఎలాంటి ప్రయోగం చేశారు? ప్రయోగ పద్ధతిని మరియు పరికరాలను గురించి వివరించండి.
ఉద్దేశం : పిండిపదార్థాలపై లాలాజల చర్యను అర్థం చేసుకోవటం.
పరికరాలు : పిండిపదార్థం, అయోడిన్, లాలాజలం, పరీక్షనాళిక, నీరు.
విధానం :
- ఒక పరీక్షనాళికలో సగం వరకు నీటిని తీసుకొని, పిండి పదార్థాన్ని కలపటం వలన పిండి ద్రావణం ఏర్పడినది.
- దీనిని వాచ్స్లో తీసుకొని అయోడిన్ కలపటం వలన పిండి ద్రావణం నీలిరంగుకు మారింది.
- నీలిరంగు పిండి ద్రావణాన్ని రెండు సమభాగాలుగా చేసి రెండు పరీక్షనాళికలలో తీసుకొన్నాను.
- ఒక పరీక్షనాళికలో ఒక టీ స్పూన్ లాలాజలం కలిపాను. రెండవ పరీక్షనాళికలో ఏమీ కలపలేదు.
- రెండు పరీక్షనాళికలను 45 నిమిషాలపాటు స్థిరంగా ఉంచి పరిశీలించాను.
పరిశీలన : లాలాజలం కలిపిన పరీక్షనాళికలోని పిండి ద్రావణం రంగును కోల్పోయింది. దీనికి ఒక చుక్క సజల టింక్చర్ అయోడిన్ కలిపినా నీలిరంగు ఏర్పడలేదు.
వివరణ : మొదటి పరీక్షనాళికలోని అయోడిన్ నీలిరంగుగా మారలేదంటే, పిండి పదార్థం లేదని అర్థం. కలిపిన లాలాజలం పిండి పదార్థంపై పనిచేయుట వలన పిండి పదార్థం చక్కెరగా మారింది. అందువలన ద్రావణం నీలిరంగుకు మారలేదు.
నిరూపణ : లాలాజలం పిండి పదార్థంపై పనిచేసి దానిని చక్కెరగా మార్చుతుంది.