Teachers often recommend practicing with AP 10th Class Biology Model Papers Set 1 in Telugu Medium to enhance exam readiness.
AP 10th Class Biology Model Paper Set 1 with Solutions in Telugu
Time: 2 Hours
Maximum Marks: 50
సూచనలు :
- ఈ ప్రశ్నాపత్రంలో 4 విభాగాలు మరియు 17 ప్రశ్నలు ఉండును.
- III వ విభాగం నందు కేవలం 12వ ప్రశ్నకు మాత్రమే మరియు IV వ విభాగం నందు గల అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.
- 2 గంటల సమయంలో, 15 నిమిషాల సమయం ప్రశ్నపత్రం చదువుటకై కేటాయింపబడినది.
- అన్ని సమాధానములు మీకివ్వబడిన సమాధాన పత్రంలోనే రాయవలెను.
- అన్ని సమాధానములు స్పష్టంగాను, గుండ్రంగాను రాయవలెను.
సెక్షన్ – I 6 × 1 = 6 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
ప్రశ్న 1.
పరాన్న జీవి మొక్కకు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
కస్కూట / డాడర్ / బంగారు తీగ
ప్రశ్న 2.
క్ర.సం. | జీవి / వర్గం | విసర్జకాంగాలు |
1. | ఫ్లాటి హెల్మింథిస్ | జ్వాలా కణాలు |
2. | సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు | మూత్రపిండాలు |
ఎ) ప్లాటి హెల్మింథిస్ వర్గ జీవులలో విసర్జకాంగాలేవి ?
జవాబు:
జ్వాలా కణాలు
బి) మానవునిలో విసర్జకాంగాలు ………………. .
జవాబు:
మూత్రపిండాలు
ప్రశ్న 3.
క్రింది పటమును గుర్తింపుము.
జవాబు:
ఆంత్ర చూషకం
ప్రశ్న 4.
సరియైన జతను గుర్తింపుము :
ఎ) చార్లెస్ డార్విన్ – ప్రకృతివరణ సిద్ధాంతం
బి) జీన్ లామార్క్ – బహిర్గతత్వ సూత్రము
జవాబు:
ఎ) చార్లెస్ డార్విన్ – ప్రకృతివరణ సిద్ధాంతం
ప్రశ్న 5.
పంట తెగుళ్ళ నియంత్రణ కొరకు ఒక పర్యావరణ స్నేహపూర్వక పద్ధతిని సూచించండి.
జవాబు:
పంట మార్పిడి పద్ధతి (లేదా) జీవ నియంత్రణ పద్ధతులు (లేదా) వంధ్యత్వ పద్ధతి
ప్రశ్న 6.
అడవుల సంరక్షణ గూర్చి మీ జీవశాస్త్ర ఉపాధ్యాయుని రెండు ప్రశ్నలను అడుగుము.
జవాబు:
- అడవుల సంరక్షణ ఆవశ్యకత ఏమిటి ?
- అడవులు ఏ విధంగా జీవ వైవిధ్యంను ప్రభావితం చేస్తాయి ?
సెక్షన్ – II 4 × 2 = 8 మా.
సూచనలు :
- క్రింది ప్రశ్నలన్నింటికి సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
ప్రశ్న 7.
మూత్రపిండాలు సక్రమంగా పనిచేయకపోతే జరిగే పరిణామాలను రాయండి.
జవాబు:
- శరీరం నీరు మరియు వ్యర్థ పదార్థాలతో నిండిపోతుంది.
- చేతులు మరియు పాదాల నందు వాపు రావచ్చు.
- రోగికి అలసట మరియు నీరసం ఉంటాయి.
ప్రశ్న 8.
క్రింది పట్టికను చదవండి.
క్ర.సం. | స్త్రీ / పురుషుడు | శస్త్ర చికిత్సా ప్రక్రియ | కుటుంబ నియంత్రణ పద్ధతి |
1. | స్త్రీ | అండ వాహికలోని చిన్న భాగాన్ని కత్తిరించి, కత్తిరించిన చివరలను ముడివేస్తారు. | ట్యూబెక్టమీ |
2. | పురుషుడు | శుక్ర నాళాలలోని కొంత భాగాన్ని కత్తిరిస్తారు. | వేసక్టమి |
క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎ) స్త్రీలలో కుటుంబ నియంత్రణ పద్ధతి ఏది ?
జవాబు:
ట్యూబెక్టమీ
బి) పురుషులలో కుటుంబ నియంత్రణ కొరకు చేసే శస్త్రచికిత్స విధానము ఏమిటి ?
జవాబు:
వేసక్టమి
ప్రశ్న 9.
మానవునిలో గల నాలుగు రకాల దంతాలేవి ?
జవాబు:
ఎ) కుంతకాలు
బి) రదనికలు
సి) అగ్ర చర్వణకాలు
డి) చర్వణకాలు
ప్రశ్న 10.
ఆహారము యొక్క రుచికి, వాసనకు గల సంబంధము గూర్చి తెలుసుకొనుటకు మీ ఉపాధ్యాయుడిని ఏవైనా రెండు ప్రశ్నలను అడుగుము.
జవాబు:
- జలుబుతో ఇబ్బందిపడుతున్నప్పుడు ఎందుకు మనం రుచిని గుర్తించలేము ?
- రుచి మరియు వాసన పరస్పర సంబంధం కలిగి ఉన్నాయని మనం ఎలా చెప్పగలం ?
సెక్షన్ – III 5 × 4 = 20 మా.
సూచనలు :
- క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
ప్రశ్న 11.
క్రింది పట్టికను అధ్యయనం చేయండి.
క్ర. సం. | ఆల్కలాయిడ్ | మొక్క | మొక్క భాగము | ఆల్కలాయిడ్ ఉపయోగము |
1. | క్వినైన్ | సింకోనా | బెరడు | మలేరియా నివారణ |
2. | రిసర్పిన్ | సర్పగంధి | వేరు, బెరడు | పాము కాటుకు మందు |
3. | నింబిన్ | వేప | విత్తనము, బెరడు, ఆకు | యాంటీ సెప్టిక్ |
4. | స్కోపోలమైన్ | ఉమ్మెత్త | పండు, పువ్వు | మత్తు మందు |
5. | పైరిథ్రాయిడ్స్ | గడ్డి చామంతి | పుష్పము | కీటకనాశిని |
క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. వేప మొక్కలోని ఏ భాగాలు నింబిన్ ను ఉత్పత్తి చేస్తాయి ?
జవాబు:
విత్తనాలు, బెరడు మరియు ఆకులు
2. కీటకనాశనిగా పనిచేయు ఆల్కలాయిడ్ ఏది ?
జవాబు:
పైరిథ్రాయిడ్స్
3. ఉమ్మెత్త మొక్క ఉత్పత్తి చేయు ఆల్కలాయిడ్ ఏది ?
జవాబు:
స్కోపాలమైన్
4. మలేరియాను నివారించు ఆల్కలాయిడ్ ఏది ?
జవాబు:
క్వినైన్
ప్రశ్న 12.
నాడీకణము యొక్క నిర్మాణమును వర్ణించండి.
జవాబు:
- నాడీకణం – కణదేహం, డెండ్రైట్స్ మరియు ఆఫ్ఘాన్ అనే భాగాలను కలిగి ఉంటుంది.
- కణదేహం నందు పెద్దదిగా ఉండే కేంద్రకం మరియు నిస్సల్ కణికలతో కూడిన కణద్రవ్యం ఉంటుంది.
- డెండ్రేట్స్ పొట్టివిగా ఉండి శాఖాయుతంగా ఉంటాయి.
- ఆక్జాన్ పొడవుగా స్థూపాకారంలో ఉంటుంది.
- కొన్ని నాడీకణాల యందు ఆఫ్ఘాన్ మయలీన్ తొడుగుతో కప్పబడి ఉంటుంది.
- మయలీన్ తొడుగులోని విరామాలను రన్పీయర్ కణుపులు అంటారు.
ప్రశ్న 13.
మానవ శుక్రకణము పటము గీచి, భాగాలను గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 14.
జీవావరణ పిరమిడ్ అనగానేమి ? ఆవరణశాస్త్ర పిరమిడ్లలోని రకాలేవి ?
జవాబు:
- వివిధ పోషక స్థాయిలలో ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని పిరమిడ్ రూపంలో రేఖాత్మకంగా చూపే చిత్రాన్ని “జీవావరణ పిరమిడ్” అంటారు.
- ఆవరణ శాస్త్ర పిరమిడ్లు మూడు రకాలుగా ఉంటాయి.
అవి : ఎ).సంఖ్యా పిరమిడ్. బి) జీవద్రవ్యరాశి పిరమిడ్. సి) శక్తి పిరమిడ్.
ప్రశ్న 15.
పెట్రోలియమ్, బొగ్గు, సహజవాయువు మొదలగు శిలాజ ఇంధనాలను పొదుపుగా వాడుటకు నాలుగు సలహాలివ్వండి.
జవాబు:
- అవసరం లేని సమయాల్లో విద్యుద్దీపాలను, ఫ్యాన్లను ఆర్పడం వలన విద్యుచ్ఛక్తిని పొదుపుగా వాడుకోవచ్చు.
- శక్తి సమర్థవంతమైన ఉపకరణములను కొని వినియోగించుట.
- వీలున్నంతవరకు నడవడం, సైకిల్పై వెళ్ళడం.
- ఎక్కువ దూరం ప్రయాణం చేయాలంటే, సొంతవాహనాలు కాకుండా బస్సు (లేదా) రైలు వంటి ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలి.
సెక్షన్ – IV 2 × 8 = 16 మా.
సూచనలు :
- అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
- ప్రతి ప్రశ్నకు 8 మార్కులు.
- ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
ప్రశ్న 16.
A) రక్త స్కందనం (లేదా) రక్తం గడ్డకట్టే ప్రక్రియను వివరించండి.
జవాబు:
- రక్త ఫలకికలు రక్తం గడ్డకట్టుటలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
- రక్తనాళాలకు గాయం అయినప్పుడు, రక్తఫలకికలు థ్రాంబోకైనేజ్ అనే ఎంజైంను విడుదల చేస్తాయి.
- థ్రాంబోకైనేజ్ రక్తంలో ఉన్న ప్రోత్రాంబిన్ అనే పదార్థాన్ని త్రాంబిన్ గా మారుస్తుంది.
- త్రాంబిన్ రక్తంలో ఉన్న ఫైబ్రినోజన్ అనే పదార్థాన్ని ఘనరూపంలో ఉండే ఫైబ్రిన్ తంతువులుగా మారుస్తుంది.
- ఈ ఫైబ్రిన్ తంతువులలో రక్తకణాలు చిక్కుకుని స్కందనం ఏర్పడుతుంది.
- ఫైబ్రిన్ తంతువులు దెబ్బతిన్న రక్తనాళపు అంచులను అతుక్కొని వాటిని దగ్గరకు లాగుతాయి.
(లేదా)
B) మానవునిలో లింగ నిర్ధారణ ప్రక్రియను వివరించండి.
జవాబు:
- మానవులలో 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి.
- వీటిలో 22 జతల క్రోమోజోమ్లు శారీరక క్రోమోజోమ్లు. ఇవి స్త్రీ, పురుషులలో ఒకే విధంగా ఉంటాయి.
- మిగిలిన ఒక జత క్రోమోజోమ్లు అల్లోజోమ్లు లేదా లైంగిక క్రోమోజోమ్లు.
- స్త్రీలలో ఉత్పత్తి అయ్యే అండములన్నీ ‘X’ క్రోమోజోమ్లను, పురుషులలో ఉత్పత్తి అయ్యే శుక్ర కణములు ‘X’ లేదా ‘Y’ క్రోమోజోమ్లను కలిగి ఉంటాయి.
- ‘X’ క్రోమోజోము కలిగి ఉన్న శుక్రకణం అండముతో ఫలదీకరణం చెందినపుడు ‘ఆడ’ శిశువు ఏర్పడుతుంది.
- ‘Y’ క్రోమోజోము కలిగి ఉన్న శుక్రకణం అండముతో ఫలదీకరణం చెందినపుడు ‘మగ’ శిశువు ఏర్పడుతుంది.
ప్రశ్న 17.
A) కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరుగునపుడు ఆక్సిజన్ విడుదలగునని నిరూపించుటకు ఒక ప్రయోగమును రాయుము.
జవాబు:
ఉద్దేశ్యము : కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరుగునపుడు ఆక్సిజన్ విడుదలగునని నిరూపించుట. కావలసిన వస్తువులు : గాజు బీకరు, పరీక్షనాళిక, గాజు గరాటు, హైడ్రిల్లా / ఎలోడియా మొక్కలు, నీరు, అగ్గిపుల్ల / అగరుబత్తి.
పద్ధతి:
- హైడ్రిల్లా లేదా ఎలోడియా వంటి నీటి మొక్కలను ఒక పొట్టి కాడ కలిగిన గరాటులో ఉంచండి.
- ఒక బీకరులో నీటిని తీసుకోండి.
- గరాటును మొక్కతో సహా బీకరులో ఉంచండి. పరీక్షనాళిక నిండా నీరు నింపి గరాటు కాడపైన బోర్లించండి.
- బీకరులోని నీటిమట్టం గరాటు కాడ కన్నా పైకి ఉండే విధంగా చూడండి.
- ప్రయోగాన్ని కనీసం 2 – 3 గంటల పాటు సూర్యరశ్మిలో ఉంచండి.
- ఇటువంటిదే మరొక అమరికను చీకటిగా ఉండే చోట పెట్టండి.
పరిశీలనలు :
- సూర్యరశ్మిలో ఉంచిన ప్రయోగ అమరికలో పరీక్ష నాళికలో నీటిమట్టం తగ్గుతూ, ఆ ప్రదేశం గాలితో నిండుతున్నట్లు గమనిస్తారు.
- చీకటిలో ఉంచిన అమరికలో నీటిమట్టంలో ఎటువంటి మార్పు కనబడలేదు.
- పరీక్షనాళికలోని గాలిని మండుతున్న అగ్గిపుల్ల / అగరుబత్తితో పరీక్షించినపుడు, కాంతివంతంగా మండడం గమనిస్తారు. ఫలితం : కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు ఆక్సిజన్ విడుదల అవుతుందని నిరూపించబడినది.
(లేదా)
B) ఇవ్వబడిన ప్రయోగమును పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయుము.
i) ప్రయోగ ఉద్దేశ్యమేమి ?
జవాబు:
శ్వాసక్రియ జరుగునపుడు ఉష్ణం వెలువడునని నిరూపించుట.
ii) ప్రయోగ నిర్వహణకు అవసరమగు సామగ్రి ఏమిటి ?
జవాబు:
థర్మాస్ ఫ్లాస్క్, థర్మామీటర్, మొలకెత్తిన విత్తనాలు, రబ్బరు బిరడా.
iii) ఉత్తమ ఫలితాలు సాధించడానికి నీవు ఎలాంటి విత్తనాలను ఎన్నుకొంటావు ?
జవాబు:
మొలకెత్తిన విత్తనాలు.
iv) పై ప్రయోగంలో నీవు పరిశీలించిన అంశం ఏది ?
జవాబు:
ప్రయోగం జరుగుతున్నంతసేపు థర్మామీటర్ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది.